కేటీఆర్‌ పీఏనంటూ బురిడీ..

15 Feb, 2020 18:32 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మంత్రి కేటీఆర్‌ పీఏనంటూ మోసాలు చేస్తున్న రంజీ మాజీ క్రికెటర్‌ నాగరాజు బుడుమురును నగర సైబర్‌ క్రైమ్‌ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. సీసీఎస్‌ జాయింట్‌ సీపీ అవినాష్‌ మహంతి కథనం ప్రకారం.. గతంలో ఆంధ్రప్రదేశ్‌ తరఫున రంజీ ట్రోఫీల్లో ఆడిన నాగరాజు హైఫై లైఫ్‌కు అలవాటు పడి మోసాలబాటను ఎంచుకున్నాడు. ఆర్థిక వనరులు పుష్కలంగా ఉండే వ్యాపారుల సెల్‌నంబర్లను ఏదో ఒక రీతిని సంపాదిస్తాడు. ఆ తర్వాత ఫలానా మంత్రి పీఏనంటూ మాట కలుపుతాడు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన రంజీ క్రికెట్‌ నాగరాజు పేదవాడని, అతడికి క్రికెట్‌ కిట్‌లను స్పాన్సర్‌ చేయమంటూ నమ్మించి బురిడీ కొట్టిస్తాడు. ఇదే తరహాలో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ కంపెనీ చీఫ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ (సీఎండీ)కి గతేడాది డిసెంబర్‌ 26న ఫోన్‌కాల్‌ చేసి కేటీఆర్‌ పీఏ తిరుపతిని మాట్లాడుతున్నానంటూ మాటలు కలిపాడు.

‘ఆంధ్రప్రదేశ్‌కు చెందిన క్రికెటర్‌ నాగరాజు బుడుమురు అండర్‌ 25 వరల్డ్‌కప్‌కు, ట్వంటీ20 సన్‌రైజర్స్‌ టీమ్‌కు ఎంపికయ్యాడు. అతడిది నిరుపేద కుటుంబమని క్రికెట్‌ కిట్‌కు, పర్యటన కోసం స్పాన్సర్‌షిప్‌ కావాలంటూ నమ్మించాడు. మీ సంస్థ లోగో ఆ క్రికెట్‌ కిట్‌పై ప్రదర్శిస్తారని, ఆ కిట్‌ మంత్రి కేటీఆర్‌ చేతుల మీదుగా నాగరాజుకు అందిస్తామ’ని నిందితుడు చెప్పాడు. ఇది నమ్మిన ఆ కంపెనీ సీఎండీ అతడిచ్చిన బ్యాంక్‌ ఖాతాకు రూ.3,30,400 బదిలీ చేశాడు. చివరకు మోసపోయానని తెలుసుకున్న కంపెనీ ప్రతినిధి జనవరి 13న నగర సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు టెక్నికల్‌ డాటా ఆధారంగా నిందితుడు నాగరాజును శనివారం అరెస్టు చేశారు. కోర్టులో హాజరుపరిచి చంచల్‌గూడ జైలుకు తరలించారు. 

మరిన్ని వార్తలు