సరికొత్త యాప్‌తో రైళ్లల్లో నేరాలకు చెక్‌

20 Oct, 2018 01:49 IST|Sakshi

‘జీరో ఎఫ్‌ఐఆర్‌’పేరుతో యాప్‌ను అభివృద్ధి చేసిన భారతీయ రైల్వే 

త్వరలోనే దక్షిణ మధ్య రైల్వేలో అమలు 

సాక్షి, హైదరాబాద్‌: దూర ప్రయాణాలు చేసే రైలు ప్రయాణికులకు ఏదో సందర్భంలో చోరీలు, వేధింపులు ఎదురయ్యే ఉంటాయి. ముఖ్యంగా మహిళలు తమ కంపార్ట్‌మెంట్లలో తోటి ప్రయాణికుల అసభ్య ప్రవర్తనతో ఇబ్బందులు పడి ఉంటారు. ఇలాంటి సమస్యలకు చెక్‌ పెట్టేలా ‘జీరో ఎఫ్‌ఐఆర్‌’పేరుతో భారతీయ రైల్వే ఓ యాప్‌ను అభివృద్ధి చేసింది. త్వరలో దీన్ని అమల్లోకి తీసుకురానుంది. వేధింపులు, చోరీలపై వెంటనే ఈ యాప్‌ ద్వారా ఫిర్యాదు చేయడంతో పాటుగా ప్రయాణికులకు కలిగిన అసౌకర్యాన్ని ఎక్కడ నుంచైనా నమోదు చేయవచ్చు. ఇంటర్నెట్‌ కనెక్షన్‌ లేకపోయినా ఈ యాప్‌ ద్వారా ఆఫ్‌లైన్‌లో కూడా ఫిర్యాదు చేయవచ్చు. ఈ యాప్‌ ద్వారా చేసిన ఫిర్యాదునే ఎఫ్‌ఐఆర్‌గా పరిగణించి సమీపంలోని ఆర్పీఎఫ్‌/జీఆర్పీ పోలీసులు అవసరమైన చర్యలు తీసుకుంటారు.  

పాత ప్రాజెక్టే సరికొత్తగా! 
వాస్తవానికి ఇదేం కొత్త ప్రాజెక్టు కాదు. ప్రయాణికుల సమస్యల తక్షణ పరిష్కారానికి ఒక వేదికను ఏర్పాటు చేయాలని, 2017 డిసెంబరు 14న కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ నిర్ణయించారు. అందులో భాగంగానే దీన్ని పైలెట్‌ ప్రాజెక్టుగా మధ్యప్రదేశ్‌లో అమలు చేస్తున్నారు. ఈ ప్రాజెక్టు విజయవంతమైతే యాప్‌ను మరింత అభివృద్ధి చేసి దక్షిణ మధ్య రైల్వేలో కూడా అమలు చేసేందుకు అధికారులు కసరత్తులు చేస్తున్నారు.
 

దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ఒక్క సికింద్రాబాద్‌ నుంచే రోజుకు 210 రైళ్లు, 1,80,000 మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు. వీరిలో ప్రతిరోజూ వివిధ కారణాల వల్ల పదుల సంఖ్యలో జీఆర్పీ, ఆర్పీఎఫ్‌కి ఫిర్యాదులు వస్తున్నాయి. ఇప్పుడు జీరో ఎఫ్‌ఐఆర్‌ యాప్‌ విధానం అమల్లోకి వస్తే ప్రయాణికులకు చాలా సౌకర్యంగా ఉంటుంది. బాధితులు రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు రైలు దిగాల్సిన అవసరం ఉండదు. ముఖ్యంగా ఒంటరిగా ప్రయాణం చేసే మహిళలకు, వృద్ధులకు మరింత సౌకర్యంగా ఉంటుందంటున్నారు రైల్వే అధికారులు. ఈ యాప్‌లో ఆర్పీఎఫ్‌ పోలీసులతో పాటుగా జీఆర్పీ, టీటీఈలను కూడా అనుసంధానం చేస్తున్నారు. 

మరిన్ని వార్తలు