జర భద్రం..కోడిమాంసానికి రంగుల పూత

18 Feb, 2019 13:17 IST|Sakshi
మటన్‌ షాపులో తనిఖీలు నిర్వహిస్తున్న అధికారులు

నల్లగొండ టూటౌన్‌ : మాంసం వ్యాపారులు స్వలాభం కోసం అడ్డదారులు తొక్కుతున్నారు. మేకపోతు అంటూ.. మేకల మాంసం, కోడి మాంసానికి రంగులు వేసి అమ్ముతూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా ఎక్కడా కూడా రంగులు వేయని కోడి మాంసం దొరికే పరిస్థితి లేదంటే అతిశయోక్తికాదు. దాదాపు వ్యాపారులందరు కోడి మాంసానికి రంగులు వేసి మసి పూసి మారేడుకాయ చేసి నాలుగు పైసలు వెనకేసుకోవడానికే ఆశపడుతున్నారు. ఈ రంగుల వలన ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారనే ధ్యాస కూడా లేకుండా ఇష్టానుసారంగా వ్యాపారం చేస్తున్నారు. జిల్లా కేంద్రంతో పాటు ప్రధాన పట్టణాలు మిర్యాలగూడ, నకిరేకల్, హాలియా, దేవరకొండతో అన్ని మండలాల్లో కోడి మాంసానికి రంగులు పూసి విక్రయిస్తున్నారు. ఒక్క కోడి మాంసమే కాదు మనం నిత్యం బయటి హోటలల్లో తినే (మటన్‌ ఇతరత్ర) ఆహార పదార్థాలు  అన్నీ కల్తీ మయం చేస్తున్నట్లు అనేక ఫిర్యాదులు ఉన్నాయి.

మటన్‌లోనూ మాయ...
మార్కెట్‌లో మటన్‌ అంటే యమ క్రేజ్‌ ఉంటుంది. ప్రతి ఆదివారం మటన్‌ షాపుల వద్ద వినియోదారులు బారులుదీరుతుంటారు. మటన్‌ మీద వినియోదారులు చూపిçస్తున్న క్రేజ్‌ను వ్యాపారులు క్యాష్‌ చేసుకుంటున్నారు. మేకలను కోసి మేకపోతు మాంసం అని విక్రయిస్తున్నారు. అదే విధంగా కొంతమంది వ్యాపారులు అనారోగ్యం బారిన పడిన మేకలను కూడా తక్కువ ధరకు కొనుగోలు చేసి ఇక్కడ వినియోగదారులకు అంటగడుతున్న ట్లు తెలిసింది. రెస్టారెంట్లలో మటన్‌కు సైతం రం గులు వేసి బిర్యానీలు తయారీ చేస్తుండడం గమనార్హం. అనేక చోట్ల మటన్‌లోనూ వినియోగదారులను మాయ చేçస్తుండడం విస్మయం కలిగిస్తోంది.

సర్వం కల్తీమయం
బజ్జీబండి నుంచి రెస్టారెంట్ల వరకు ఎక్కడ చూసినా కల్తీ చేసిన ఆహార పదార్థాలనే తయారు చేసి వడ్డించేస్తున్నారు. విశేషమంటే బయటి ప్రాంతాల్లో పర్యటించినప్పుడు ఏ హోటల్‌కు వెళ్లినా జిల్లా ఉన్నతాధికారులకు సైతం ఈ కల్తీ ఆహార పదార్థాలే వడ్డిస్తుండడం వారిని విస్మయానికి గురిచేస్తోంది. ప్రతి వ్యాపారి కల్తీ మయం చేస్తున్నట్లు గతంలో ఓ సారి నల్లగొండ మున్సిపల్‌ అధికారులు తనిఖీలు చేసినప్పుడు బయటపడిన విషయం తెలిసిందే. ఇక ఫాస్ట్‌ ఫుడ్‌ సెంటర్లలో అయితే అంతులేని రంగులు వాడుతున్నట్లు అధికారులే చెబుతున్నారు. రోడ్ల మీద ఎక్కడ పడితే అక్కడ దర్శనమిచ్చే ఫాస్ట్‌ ఫుడ్‌ సెంటర్లు, బండీలపై అధికారులు ఎందుకు దృష్టి పెట్టడంలేదనే  ప్రశ్నలకు సమాధానాల్లేవు. హోటల్‌ నిర్వాహకులు  ఇష్టానుసారంగా మాంసంతో తయారు చేసిన ఆహార పదార్థాలు వడ్డించేస్తున్నారు. మిగిలిన ఆహార పదార్థాలను సైతం మరుసటి రోజు వినియోగదారులకు వడ్డించటం పరిపాటిగా మారిందనే విమర్శలు లేకపోలేదు.

అరకొర తనిఖీలు ...
జిల్లా యంత్రాంగం నిర్లిప్తత, తనిఖీ అధికారుల జాడలేకపోవడంతో కల్తీ రాజ్యం నడుస్తుందనే విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. ఆహార ఉత్పత్తులకు సంబంధించిన వాటిపై తనిఖీలు చేయాల్సిన అధికారులు ఎక్కడ ఆ పని సీరియస్‌గా తీసుకుంటున్న దాఖలాలు లేవనే విమర్శలు లేకపోలేదు. జిల్లా ఉన్నతాధికారులు తనిఖీలకు ఆదేశించినప్పుడు మాత్రమే అరకొరగా దాడులు చేసి హడావుడి చేస్తారనే అపవాదు ఎదుర్కొంటున్నారు. జిల్లాలోని అన్ని మండలాలు, పట్టణాల్లో ప్రతి రోజు కొన్ని వందల షాపుల్లో కల్తీలు జరుగుతున్న సంబంధిత శాఖల అధికారులు మత్తు నిద్ర వదలడం లేదనే విమర్శలు ఉన్నాయి. అధికారుల కళ్లేదుట రంగులు వాడిన పదార్థాలు కనిపించినా సంబంధిత వ్యాపారులపై కేసులు నమోదు చేసి జరిమానాలు విధించింది ఒక్క శాతం కూడా లేదనే చెప్పాలి. ఇప్పటికైనా సంబంధిత అధికారుల నామమాత్రంగా కాకుండా చిన్న వ్యాపారులతో పాటు రెస్టారెంట్లు, పెద్ద, పెద్ద హోటళ్లపై ఆకస్మిఖ దాడులు చేస్తేనే కల్తీమయానికి కొంతైనా అడ్డకట్ట వేయవచ్చనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

 మటన్, చికెన్‌ షాపుల్లో తనిఖీలు
జిల్లా గెజిటెడ్‌ ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్, లీగల్‌ మెట్రాలజీ ఇన్‌స్పెక్టర్, మున్సిపల్‌ శానిటరీ ఇన్‌స్పెక్టర్ల బృందం ఆదివారం నల్లగొండ పట్టణంలోని పలు మటన్‌ షాపులు, చికెన్‌ షాపుల్లో తనిఖీలు నిర్వహించింది. ఉదయం 8 గంటల ప్రాంతంలోని పట్టణంలోని హైదరాబాద్‌ రోడ్డు, రామగిరి ప్రాంతంలో మటన్‌ షాపులు, చికెన్‌ షాపుల్లో తనిఖీలు చేసి పలు చోట్ల అక్రమాలను గుర్తించారు. ఎక్కువ షాపుల్లో తప్పుడు తూకాలు వేసి వినియోగదారులను మోసం చేస్తున్నట్లు జిల్లా మెట్రాలజీ ఇన్‌స్పెపెక్టర్‌ శ్రీనివాస్‌ గుర్తించారు. అదే విధంగా కొంత వ్యాపారులు తమ కాంటాలకు ముద్ర వేయించుకోకుండా ప్రభుత్వ నిబంధనలకు ఉల్లగించారు. హైదరాబాద్‌ రోడ్డులో మేకపోతు అని చెబుతూ మేక మాంసం విక్రయిస్తున్నట్లు అధికారుల తనిఖీల్లో వెల్లడైంది. కోడి మాంసానికి రంగులు పూసి విక్రయిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. తప్పుడు తూకాలు, ముద్ర వేయించకపోవడంతో వ్యాపారులపై జిల్లా లీగల్‌ మెట్రాలజీ ఇన్‌స్పెక్టర్‌ ఐదు కేసులు నమోదు చేశారు. ఈ తనిఖీల్లో గెజిటెడ్‌ ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్‌ కలీల్, శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ సురిగి శంకర్‌ గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

కల్తీ చేస్తే కఠిన చర్యలు
ఆహార పదార్థాలు, మట న్, చికెన్‌లను కల్తీ చేసి విక్రయిస్తే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటాము. ప్రభుత్వ నిబంధనల ప్రకారం కేసులు నమోదు చేసి జరిమానా విధిస్తాం. వినియోదారులు కూడా కల్తీ పట్ల అప్రమత్తంగా ఉండాలి.
  – ఖలీల్, జిల్లా గెజిటెడ్‌ ఇన్‌స్పెక్టర్‌

మరిన్ని వార్తలు