అమ్మ కోసం..రాత్రంతా దీనంగా..

20 Dec, 2019 10:37 IST|Sakshi

బిక్కుబిక్కుమంటూ గడిపిన ముగ్గురు ఆడపిల్లలు

జైలులో ఉన్న తండ్రి రామాయంపేట శివారులో హత్యకు గురైన తల్లి

నిజామాబాద్‌అర్బన్‌: ముగ్గురు ఆడపిల్లలు.. పట్టుమని పదేళ్లు కూడా లేవు. తండ్రి జైలులో... తల్లి ఎక్కడికెళ్లిందో తెలియదు. రోజులాగే స్కూల్‌ నుంచి సాయంత్రం ఇంటికొచ్చారు. ఇంట్లో అమ్మ కనబడలేదు. చిన్న పిల్లలిద్దరూ ఒకటే ఏడుపు.. తొమ్మిదేళ్ల అక్క వారికి సముదాయించింది. ఇంట్లో ఉన్నది ఆ ముగ్గురే. రాత్రయింది అమ్మ రాలేదు. ఏం చేయాలో వారికి తెలియలేదు. క్షణ క్షణం బిక్కుబిక్కుమంటూ గడుపుతున్న తన చెల్లెళ్లకు ఆ చిన్నారి తెల్లవారే దాకా ఓదార్పునిస్తూ కూర్చుంది. 

సాక్షి, నిజామాబాద్‌: నగరంలోని వినాయక్‌నగర్‌కు చెందిన బున్ని రాజు, స్రవంతి (30) దంపతులకు ముగ్గురు కూతుళ్లు హారిక (9), అక్షయ (5), మేఘన (4) ఉన్నారు. ఓ ష్యూరిటీ కేసులో రాజు జైలుకు వెళ్లగా, స్రవంతి బ్యూటీషియన్‌గా పని చేస్తూ కుటుంబాన్ని నెట్టుకుస్తోంది. అయితే, వివిధ కేసుల్లో జైలుకు వెళ్లొచ్చిన డిచ్‌పల్లి మండలం సుద్దపల్లికి చెందిన నీరటి అరుణ్‌కు, జైలులో రాజు పరిచయమయ్యా డు. జైలు నుంచి బయటకు వచ్చిన అరుణ్‌.. రాజు సెల్‌ఫోన్‌కు కాల్‌ చేయగా స్రవంతి లిఫ్ట్‌ చేసింది.

ఈ క్రమంలో ఆమెతో పరిచయం పెంచుకున్న అరుణ్‌.. తన అసలు పేరుతో కాకుండా విక్కీ పేరుతో స్రవంతికి దగ్గరయ్యాడు. ఆమె భర్త రాజును బెయిల్‌పై బయటకు తీసుకొస్తానని నమ్మబలికాడు. రామాయంపేటలో బంగారం, నగదు దాచి ఉంచానని స్రవంతిని నమ్మించిన అరుణ్‌ ఈ నెల 5వ తేదీన ఆమె స్కూటీపైనే అక్కడకు తీసుకెళ్లాడు. అక్కడ ఆమెపై అత్యాచారం చేసి దారుణంగా హతమార్చాడు.  

పాపం చిన్నారులు..
పెద్ద కూతురు హారిక మూడో తరగతి చదువుతుండగా, అక్షయ ఎల్‌కేజీ, మేఘన యూకేజీ చదువుతున్నారు. తండ్రి జైలులో ఉండడంతో స్రవంతి వారి ఆలనాపాలన చూస్తోంది. రోజులాగే ఉదయం పాఠశాలకు వెళ్లిన పిల్లలు సాయంత్రం ఇంటికి వచ్చే సరికి తల్లి కనిపించలేదు. ఎక్కడికి వెళ్లాలో తెలియక ఇంట్లోనే ఉన్నారు. చీకటి పడినా అమ్మ రాకపోవడంతో చిన్న పిల్లలు ఏడుపందుకున్నారు. దీంతో ‘అమ్మ ఊరెళ్లింది. కాసేపట్లో వస్తుందంటూ’ వారిని అక్క హారిక వారిని ఓదార్చింది. పాపం ముగ్గురు చిన్నారులు అలా ఆ రాత్రంతా ఇంట్లోనే బిక్కుబిక్కుమంటూ గడిపారు. ఉదయం పిల్లులు ఏడ్వడంతో విన్న చుట్టుపక్కల వారు వచ్చి వారిని దగ్గరకు తీసుకున్నారు. 

తల్లి మృతి ఇప్పటికీ తెలియదు 
విషయం తెలియడంతో రాజు సోదరి హుటాహుటిన వచ్చి పిల్లలను అక్కున చేర్చుకుంది. అయితే, అప్పటి నుంచి చిన్నారులు తల్లి కోసం ఏడుస్తూనే ఉన్నారు. స్రవంతి హత్యకు గురైన విషయం రెండ్రోజుల క్రితం బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. కానీ ఆ విషయాన్ని పిల్లలకు తెలియనివ్వలేదు. అమ్మ ఎప్పుడు వస్తుందని చిన్నారులు చుట్టు పక్కల వారిని దీనంగా అడుతుండడం చూసిన వారు కంటతడి పెడుతున్నారు.   

మరిన్ని వార్తలు