చిన్నారిని చిదిమేసిన మృత్యుశకటం

23 Feb, 2018 11:37 IST|Sakshi
బైక్‌పై బోల్తా పడిన టాటా ఏస్‌ వ్యాను , చిన్నారి మృతి

తాండవ జంక్షన్‌ వద్ద ప్రమాదం

బ్రేకులు ఫెయిలై బీభత్సం సృష్టించిన వ్యాన్‌

మూడు వాహనాలను ఢీకొన్న వైనం

ఐదుగురికి గాయాలు

అమ్మానాన్న, అక్కతో అంతవరకూ ఆనందంగా గడిపిన అభయం శుభం తెలియని  అయిదేళ్ల  చిన్నారిని అంతలోనే మృత్యువు కబళించింది.   తల్లిదండ్రులు,అక్క చూస్తుండగానే కర్కశంగా  వ్యాన్‌ రూపంలో పొట్టనపెట్టుకుంది. మొక్కు చెల్లించుకుని తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఆ దృశ్యాన్ని చూసిన స్థానికులు కంటతడిపెట్టుకున్నారు.

నాతవరం(నర్సీపట్నం): నర్సీపట్నం–తుని రోడ్డులో నాతవరం మండలం తాండవ జంక్షన్‌లో గురువారం వేగంగా వస్తున్న వ్యాను బ్రేకులు పట్టక వరుసగా మూడు వాహనాలను ఢీకొని బీభత్సవం సృష్టించింది. ఈ  సంఘటనలో ఓ చిన్నారి మృతి చెందగా, అయిదుగురికి తీవ్రగాయాలయ్యాయి. నాతవరం పోలీసులు అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. పాయకరావుపేట మండలం పెంటకోట గ్రామానికి చెందిన కోనే విజయ రామకృష్ణ ,అతని భార్య దేవి,  తమ  ఇద్దరు కుమార్తెలతో కలిసి గురువారం ఉదయం దైవదర్శనానికి బయలు దేరారు. రోలుగుంట మండలం  సింగరాజుపేట గ్రామంలో గల గంగాలమ్మ తల్లిని దర్శించుకుని, మొక్కులు  చెల్లించుకున్నారు. తిరిగి బైక్‌పై ఇంటికి  బయలుదేరారు. నాతవరం మండలం తాండవ జంక్షన్‌లో  జామకాయలు  కోసం ఆగారు. రోడ్డు పక్కన  బైక్‌ నిలిపి, దానిపై విజయరామకృష్ణ, చిన్న కుమార్తె దుర్గశ్రీ  కూర్చొన్నారు. భార్య దేవి, పెద్ద కుమార్తె మౌనిక దేవి బైక్‌ దిగి   జామ కాయలు కొనుగోలు చేయడానికి దుకాణం వద్దకు వెళ్లారు. వారిద్దరూ జామకాయలను పరిశీలిస్తుండగా  ఆ సమయంలో తుని వైపు నుంచి  వస్తున్న   వ్యానుకు బ్రేకులు ఫెయిల్‌ అయ్యాయి.   

ముందు వెళ్తున్న   టాటా ఏస్‌ వ్యానును బలంగా ఢీకొంది. అనంతరం   ప్రయాణికులను దించేసి నర్సీపట్నం  వైపు  నెమ్మదిగా వెళ్తున్న ఆర్టీసి బస్సును ఢీకొంది.  టాటా ఏస్‌ వ్యాను  బైక్‌పై ఉన్న  విజయరామకృష్ణ, అతని కుమార్తెపై బోల్తా ఢీకొంది. ఈ ప్రమాదంలో కోనె దుర్గశ్రీ (5) అక్కడికక్కడే మృతి చెందింది.  విజయరామకృష్ణ తలకు గాయమైంది. బైక్‌ పూర్తిగా నుజ్జయింది, జామకాయల దుకాణం వద్ద ఉన్న భార్య దేవి, పెద్ద కుమార్తె మౌనిక దేవికి స్వల్ప గాయాలయ్యాయి.  నాతవరం మండలం వి.బి.ఆగ్రహరం గ్రామానికి చెందిన సుర్ల నాగరత్నం, ముత్యాల దేవి తాండవ జంక్షన్‌లో గల  స్టేట్‌ బ్యాంకులో  డ్వాక్రా సొమ్ము తీసుకోవడం కోసం వచ్చారు. బ్యాంకులో పని పూర్తి చేసుకుని  జామకాయలు  కొనుక్కుని ఇంటి వెళ్లిపోదామనుకున్నా రు. అదే సమయంలో ప్రమాదం జరగడంతో వారికి కూడా గాయాలయ్యాయి. క్షతగాత్రులను  108 వాహనంలో నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి తరలించారు. అంతవరకు సరదాగా ఉన్న చెల్లెలు అంతలోనే మృత్యువాత పడడంతో అక్క మౌనిక దేవి భోరున విలపించింది.  కళ్లముందే కుమార్తెను మృత్యువు కబళించడంతో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించా రు. ఈసంఘటన చూసిన స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఈ ప్రమాదంపై  నాతవరం  హెడ్‌ కానిస్టేబుల్‌ జి.గోవిందరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు