అయ్యో పాపం..!

8 Sep, 2018 13:39 IST|Sakshi
యల్లంవారిదిన్నెలో ఏడు నెలల క్రితం నిర్మించిన పంట కాలువ, ప్రమాదస్థితిలో ఉన్న కాలువ పరిసరాలు గోకుల నందు(ఫైల్‌)

చిన్నారిని మింగేసిన పంట కాలువ

అధికారుల నిర్లక్ష్యానికి నిండుప్రాణం బలి

నెల్లూరు సిటీ: నగరపాలక సంస్థ అధికారుల నిర్లక్ష్యం ఓ చిన్నారి ప్రాణాన్ని బలి తీసుకుంది. బుడిబుడి అడుగులు వేస్తూ కళ్ల ముం దు తిరుగుతూ ఆడుకుంటున్న ఆరేళ్ల చిన్నారి పంటకాలువలో పడి మృతిచెందాడు. పంట కాలువపై సిమెంట్‌ మూత గానీ, ఫెన్సింగ్‌ లేకపోవడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఆలస్యంగా వెలుగుచూసిన ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి.

ముత్తుకూరులోని తిమ్మనపట్నానికి చెందిన చిట్టిబాబు, లీలావతికి ఇద్దరు సంతానం. కుమారుడు పాముల గోకుల నందు(6), మూడేళ్ల కుమార్తె ఉన్నారు. ఈ క్రమంలో ఆదివారం నెల్లూరు నగరంలోని 13వ డివిజన్‌లోని సింహపురి హాస్పిటల్‌ నుంచి చింతారెడ్డిపాళెం వైపు వెళ్లే యల్లంవారిదిన్నె గ్రామంలో ఉన్న తన తల్లి వద్దకు లీలావతివచ్చింది. గురువారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో గోకుల నందు ఆడుకుంటూ ఇంటి ముందు ఉండే పంటకాలువ వద్దకు వచ్చాడు. ప్రమాదవశాత్తు కాలువలో పడిపోయాడు. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో చిన్నారి కాలువలో పడిన విషయాన్ని గమనించలేదు. తల్లి లీలావతి కుమారుడి కోసం ఆ ప్రాంతమంతా వెతికింది. ఎక్కడా కనిపించకపోవడంతో ఆందోళనకు గురైంది. సాయంత్రం 5 గంటల సమయంలో అనుమానం వచ్చి ఇంటికి సమీపంలోని వ్యక్తులను కాలువలోకి దించి గాలించారు. ఓ వ్యక్తి కాలికి నందు మృతదేహం తగిలింది. బయటకు తీయగా అప్పటికే నందు మృతిచెందినట్లు గుర్తించారు. సమీపంలోని సింహపురి హాస్పిటల్‌కు తీసుకెళ్లగా నందు అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు కూడా నిర్ధారించారు. దీంతో కుటుంబసభ్యులు ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. తమ కళ్ల ముందే తిరుగుతున్న కుమారుడు విగతజీవిగా మారడంతో వారిని ఓదార్చడం ఎవరి తరం కాలేదు.

అధికారుల నిర్లక్ష్యం
యల్లంవారిదిన్నె ప్రధాన రహదారికి ఓ వైపు పంట కాలువను ఏడు నెలల క్రితం నిర్మించారు. కాలువ పక్కనే ఇళ్లు ఉన్నాయి. అయితే కాలువ పై సిమెంట్‌ స్లాబ్‌ కానీ, ఫెన్సింగ్‌ కానీ వేయకపోవడంతో స్థానికులు బిక్కుబిక్కుమంటూ జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో రెండు నెలల క్రితం నుంచి నలుగురు కాలువలో పడిన ఘటనలు ఉన్నాయి. అయితే కాలువలో పడిన సమయంలో అందుబాటులో ఎవరో ఒకరు ఉండడంతో ప్రాణాలతో బయటపడ్డారు. ఐదేళ్ల చిన్నారి రేవంత్, వృద్ధురాలు శీనమ్మ, శ్రీను కాలువలో పడ్డారని స్థానికులు చెబుతున్నారు. అయితే గురువారం జరిగిన ఘటనతో స్థానికులు భయభ్రాంతులకు గురవుతున్నారు.
ఎన్నిసార్లు చెప్పినా ఫలితం లేదు
కార్పొరేషన్‌ అధికారులకు కాలువను మూసివేయాలని, ఫెన్సింగ్‌ ఏర్పాటు చేయాలని స్థానికులు కోరినా ఫలితం లేకుండాపోయింది. స్థానిక డీఈ ఆకుల శ్రీనివాసులుకు కాలువ నిర్మాణం చేస్తున్న సమయంలోనే చెప్పినా పట్టించుకోలేదని వాపోతున్నారు. రాబోయే వర్షాకాలంలో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని, ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరతున్నారు.

మరిన్ని వార్తలు