కాన్పు సమయంలో శిశువు మృతి

29 Mar, 2018 12:13 IST|Sakshi
మృతిచెందిన శిశువు (ఇన్‌సెట్‌లో) శిశువు తల్లి సన్నగిరి కావ్య

వైద్యులు సకాలంలో స్పందించలేదు

శిశువు కుటుంబసభ్యుల ఆరోపణ

కావలి ప్రభుత్వ ఏరియా వైద్యశాలలో ఘటన  

కావలిరూరల్‌: కాన్పు సమయంలో శిశువు మృతిచెందిన ఘటన మంగళవారం రాత్రి కావలి ప్రభుత్వ ఏరియా వైద్యశాలలో చోటుచేసుకుంది. శిశువు కుటుంబసభ్యులు తెలిపిన వివరాల మేరకు.. హైదరాబాద్‌కు చెందిన సన్నగిరి శివప్రసాద్‌ భార్య కావ్య కాన్పుకోసం బిట్రగుంటలోని పుట్టింటికి వచ్చింది. మంగళవారం ఉదయం ఆమెకు నొప్పులు రావడంతో కుటుంబసభ్యులు కావలి ప్రభుత్వ ఏరియా వైద్యశాలకు తీసుకువచ్చారు. రాత్రి 9.51 గంటలకు ఆమెకు సహజ ప్రసవం ద్వారా మగ శిశువు జన్మించాడు. అయితే కాసేపటికి శిశువు మరణించాడు. దీంతో కావ్యతోబాటు ఆమె కుటుంబసభ్యులు తీరని ఆవేదనకు గురయ్యారు. కాన్పు సమయంలో డ్యూటీలో ఉండాల్సిన డాక్టర్‌ అక్కడ లేరు. కాల్‌ ఆన్‌ డ్యూటీలో ఉన్న చిన్న పిల్లల వైద్యనిపుణులు అర్ధగంట తర్వాత ఆస్పత్రికి రాగా, డ్యూటీ డాక్టర్‌ మరో పావు గంట తర్వాత చేరుకున్నారు. శిశువు మృతిచెందాడని వారు నిర్ధారించారు. విషయం తెలుసుకున్న ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ కె.సుబ్బారావు, చైర్మన్‌ గుత్తికొండ కిషోర్‌బాబు ఆస్పత్రికి చేరుకుని వివరాలు సేకరించారు.

డాక్టర్లు సకాలంలో స్పందించలేదు
ఇక్కడ కాన్పులు బాగా జరుగుతున్నాయంటే తీసుకువచ్చాం. డ్యూటీలో ఉండాల్సిన డాక్టర్‌ అందుబాటులో లేరు. సిబ్బందే కాన్పు చేశారు. వారు ఫోన్‌ చేయగా చిన్నపిల్లల డాక్టర్‌ అర్ధగంటకు వచ్చారు. డ్యూటీ డాక్టర్‌ అందుబాటులో ఉండి ఉంటే ఈ పరిస్థితి వచ్చుండేది కాదు.– దరిశి సుధీర్, కావ్య సోదరుడు

పూర్తి స్థాయిలో విచారిస్తాం
కాన్పు సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను మా సిబ్బంది తీసుకున్నారు. డాక్టర్లు అందుబాటులో లేరనే విషయంపై విచారిస్తున్నాం. కాన్పు సమయంలో గర్భంలో మలం కలసిపోయి శిశువు ముక్కులు, నోట్లోకి వెళ్లి చనిపోయి ఉంటాడని తెలుస్తోంది. పూర్తి స్థాయిలో విచారిస్తాం.  – డాక్టర్‌ కె.సుబ్బారావు, ప్రభుత్వ ఏరియా వైద్యశాల సూపరింటెండెంట్‌

అధికారులకు ఫిర్యాదు చేస్తాం
శిశువు మృతి చెందాడనే విషయం తెలియగానే కమిటీ సభ్యులతో కలసి ఇక్కడికి చేరుకున్నాం. డాక్టర్లు అందుబాటులో లేరనే ఆరోపణలపై ఆరా తీస్తున్నాం. ఈ ఘటనలో ఎలాంటి పొరపాట్లు ఉన్నా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేస్తాం.  – గుత్తికొండ కిషోర్‌బాబు, ఏరియా ఆస్పత్రి అభివృద్ధి కమిటీ చెర్మన్‌ 

మరిన్ని వార్తలు