నీటి డబ్బాలో తల ఇరుక్కుని..

29 May, 2019 13:25 IST|Sakshi
చిన్నారి మృతదేహం వద్ద విలపిస్తున్న తల్లి గంగ, ఇతర కుటుంబసభ్యులు

చిన్నారి మృతి

సూరంపాలెంలో హృదయవిదారక సంఘటన

రాజవొమ్మంగి (రంపచోడవరం) : మామిడి పండు తిని చేతులు కడుక్కోవడానికి నీటి డబ్బా వద్దకు వెళ్లి అందులో తల ఇరుక్కుని ఊపిరాడక ఏడాదిన్నర పాప మరణించిన హృదయవిదారక సంఘటన మంగళవారం రాజవొమ్మంగి మండలం సూరంపాలెంలో జరిగింది. ఆ సమయంలో ఇంట్లోని వారందరూ అక్కడే ఉన్నా పాపకు సంభవించిన ప్రమాదాన్ని దాదాపు 15 నిమిషాల వరకు గుర్తించలేకపోయారు. ఇంట్లో కలివిడిగా తిరుగుతూ సందడి చేసే ఆ చిన్నారి నిర్జీవంగా ఓ ప్లాస్టిక్‌ నీటిడబ్బాలో పడి ఉండడం ఆ కుటుంబాన్ని కలచివేసింది.

సూరంపాలెం శివారున నివసించే సుర్ల సత్యనారాయణ, గంగలకు ఏడాదిన్నర క్రితం మొదటి కాన్పులో పాప పుట్టింది. ఆ చిన్నారికి దేవ వర్షిణి అని పేరుపెట్టుకున్నారు. పాపే తమ లోకం అని అనుకొంటున్న వారి ఆనందం నిముషాల్లోనే ఆవిరైంది. వర్షిణి మామిడి పండు తిని రోజూ మాదిరిగానే చేతులు కడుక్కోవడానికి ఆ ప్లాస్టిక్‌ నీటి డబ్బా(ప్లాస్టిక్‌ టిన్‌) వద్దకు వెళ్లింది. ఆ డబ్బాలో నీళ్లు అడుగున ఉండడంతో తలవంచి చేతులు కడుక్కోవడానికి ప్రయత్నించే సమయంలో ఆ పాప తల ఆ టిన్నులో ఇరుక్కుపోయింది. ఊపిరి ఆడకపోవడంతో ప్రాణాలు విడిచింది. పాప అలికిడి లేకపోవడంతో నీటి టిన్ను వద్దకు వెళ్లిన తల్లి తండ్రి, నాన్నమ్మ అవాక్కయ్యారు. టిన్నులో పాప తల కిందకు కాళ్లుపైకి కనిపించడంతో వెంటనే పాపను బయటకు తీశారు. అప్పటికే ఆ చిన్నారి ప్రాణాలు గాలిలో కలసిపోవడంతో కన్నీరుమున్నీరయ్యారు. అయినా ఆశ చావక పాపను రాజవొమ్మంగి పీహెచ్‌సీకి తరలించగా అప్పటికే పాప మరణించినట్టు వైద్యులు ధ్రువీకరించారు. వర్షిణి అచేతనంగా పడి ఉండటంతో నానమ్మ లక్ష్మి దుఃఖానికి అంతులేకుండా పోయింది. నవమాసాలు మోసి కన్న బిడ్డ ఇక లేదని తలచుకొంటూ కుమిలిపోతున్న తల్లి గంగ, తండ్రి సత్యనారాయణలను ఓదార్చడం గ్రామంలో ఎవరి వల్ల కాలేదు.

మరిన్ని వార్తలు