ఆ నవ్వులు ఇక లేవు!

12 Nov, 2018 07:04 IST|Sakshi
చిన్నారి పద్మశ్రీ మృతదేహం

గెడ్డలో కొట్టుకుపోయి చిన్నారి మృతి

శోకసంద్రలో కుటుంబం

వప్పంగిలో విషాద చాయలు   

ఆ అంగన్‌వాడీలో రోజూ వినిపించిన హుషారు గొంతు ఇక వినిపించదు. వప్పంగి పంతులు కాలనీలో చలాకీగా తిరిగిన చిన్నారి ఇక ఆ దారుల్లో కనిపించదు. నాగులచవితి నాడు వెండి పట్టీలు వేసుకుని మురిసిపోయిన పద్మశ్రీ నవ్వు మరి వికసించదు. కన్నవాళ్లకు కన్నీళ్లు మిగుల్చుతూ ఐదేళ్ల ఈ చిన్నారి అందనంత దూరం వెళ్లిపోయింది. గెడ్డలో దిగి ప్రమాదవశాత్తు కొట్టుకుపోయి కన్ను మూసింది. ఉదయాన్నే కూతుళ్లతో నాగుల చవితి పూజలు చేయించిన తల్లిదండ్రులు సాయంత్రానికి ఓ కుమార్తెను పోగొట్టుకోవడం తట్టుకోలేకపోతున్నారు. శ్రీకాకుళం రూరల్‌ మండలం వప్పంగి గ్రామ సమీపంలో ఆదివారం జరిగిన ఈ ఘటన ఆ గ్రామాన్ని శోకసంద్రంలో ముంచేసింది.

శ్రీకాకుళం రూరల్‌: శ్రీకాకుళం మండలం వప్పంగి పంతులు కాలనీకి చెందిన శిమ్మ రవికుమార్, రూపావతిల కుమార్తె శిమ్మ పద్మశ్రీ(5) ఆదివారం మధ్యాహ్నం గెడ్డలో పడి మృతి చెందింది. ఈ దంపతులకు ఇద్దరు కుమార్తెలు కాగా పద్మశ్రీ చిన్న కూ తురు. ఆదివారం నాగులచవితి కావడంతో పిల్లలి ద్దరి చేత పూజలు చేయించిన తల్లిదండ్రులు పొలం పనులపై ఉదయం 10 గంటలకే బయటకు వెళ్లిపోయారు. అప్పటికే పక్కంటి పిల్లలతో పద్మశ్రీ అక్క సుష్మశ్రీలు ఆడుకుంటూ ఉన్నారు. మధ్యాహ్నం 12 గంటల తర్వాత టాయిలెట్‌కువెళ్లాల్సి రావడంతో సమీపంలోని శివాలయాన్ని ఆనుకుని ఉన్న గెడ్డ వద్దకు వెళ్లారు. గెడ్డ గట్టుపై ముగ్గురు పిల్లలు ఉండగా పద్మశ్రీ ముందుగా దిగింది. లోతు గమనించకపోవడంతో ఒక్కసారిగా కొట్టుకుపోయింది. దీంతో గట్టునే ఉన్న పిల్లలు కంగారు పడి స్థానికులకు విషయం చెప్పారు. వెంటనే స్థానికులు 100తో పాటు రూరల్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

దీంతో వెంటనే ఫైర్‌సిబ్బందితో పాటు రూరల్‌ పోలీసులు గెడ్డ గట్టు గుండా ప్రతి కల్వర్టు వద్ద నీటిలో నుంచి వెతకడం ప్రారంభించారు. పొలాల్లోని నీరు గెడ్డలో కలిసిపోతుండడంతో నీటి ప్రవాహం ఎక్కువగా కనిపించింది. సుమారు మూడు గంటల సేపు ప్రతి కల్వర్టు వద్ద జల్లెడ పట్టారు. వీరు వెతుకుతున్నంత సేపు చిన్నారి తల్లిదండ్రులు ఎంతో ఆశగా ఎదురుచూశారు. తమ కూతురు మళ్లీ తమ వద్దకు వచ్చేస్తుందని అనుకున్నారు. కానీ సుమారు ఐదు గంటల సమయంలో గార మండలంలోని అంబటివానిపేట పరిధి శిమ్మపేట శివారు గ్రామ పరిధిలోని ఓ కల్వర్టు వద్ద చిన్నారి మృతదేహాన్ని కనుగొన్నట్లు రూరల్‌ ఎస్‌ఐ చిన్నం నాయుడు తెలిపారు. దీంతో ఆ తల్లిదండ్రులకు శోకానికి అంతు లేకుండాపోయింది. కంటికీ మింటికీ ఒకటే ధారగా రోదించారు.

శోకసంద్రంలో కుటుంబం..
పద్మశ్రీ మరణవార్త విని తల్లిదండ్రులిద్దరూ షాక్‌కు గురయ్యారు. ప్రతి రోజు ఉదయం అంగన్‌వాడీకి వెళ్లేదని, ఎంతో చక్కగా, చలాకీగా ముసిముసి నవ్వులతో పలకరించేదని, నాగులచవితి సందర్భంగా కాళ్లకు వెండి పట్టీలు కూడా పెట్టుకుందని కన్నీళ్లతో అక్కడి వారితో చెప్పుకున్నారు. నాగుల చవితి రోజు ఆ దేవుడు ఇంతటి విషా దాన్ని ఇచ్చాడని బోరున విలపించారు. వారి రోదన చూసి స్థానికులు కళ్లనీళ్లు పెట్టుకున్నారు. చిన్నారి మృతితో వప్పంగిలో విషాదం అలుముకుంది. పద్మశ్రీ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం రిమ్స్‌కు తరలించారు. రూరల్‌ ఎస్‌ఐ చిన్నంనా యుడు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు