రిమ్స్‌లో అప్పుడే పుట్టిన శిశువు మృతి

31 Aug, 2018 12:49 IST|Sakshi
రిమ్స్‌ డైరెక్టర్‌తో మాట్లాడుతున్న ఆందోళనకారులు

 కాన్పు నిర్లక్ష్యంగా చేశారంటూ బంధువుల ఆందోళన

సంబంధిత డాక్టర్‌పై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్‌

నాయకుల రాకతో రిమ్స్‌ వద్ద పరిస్థితి ఉద్రిక్తం

ఇష్టం వచ్చినట్లు డెలివరీ చేశారంటున్న బాధితులు

ప్రకాశం, ఒంగోలు సెంట్రల్‌:  వైద్యురాలి నిర్లక్ష్యంతో అప్పుడే పురుడు పోసుకున్న శిశువు (మగబిడ్డ) ప్రాణాలు గాలిలో కలిశాయి. ఆమె నిర్లక్ష్యానికి ఆ తల్లికి గర్భశోకం మిగిలింది. ఈ సంఘటన రిమ్స్‌లో గురువారం జరిగింది. శిశువు మృతి చెందడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. బాధితుల కథనం ప్రకారం.. చినగంజాం మండలం కడవకుదురుకు చెందిన కె. మధులత మొదటి కాన్పుకు ఈ నెల 25న రిమ్స్‌లో చేరింది. 26న కాన్పు చేస్తామని చెప్పిన వైద్యులు పట్టించుకోలేదు. 29న బంధువులు ప్రశ్నించడంతో రాత్రి పదిన్నర గంటల సమయంలో కాన్పు చేసేందుకు చర్యలు ప్రారంభించారు. కాన్పు కష్టం కావడంతో చాలాసేపు సాధారణ కాన్పు అవుతుందని వేచి ఉన్నారు. బిడ్డ కొద్దిగా బయటకొచ్చి అగిపోయింది. కడుపులో ఉన్న శిశువు ఒత్తిడికి గురై శ్వాస పీల్చుకోవడం కష్టమైంది. ఆ తర్వాత స్పృహ కోల్పోయాడు. ఆ తర్వాత చిన్న శస్త్రచికిత్స చేసి బిడ్డను బయటకు తీశారు. బిడ్డ అప్పటికే పూర్తిగా అనారోగ్యానికి గురవడంతో రిమ్స్‌లో ఉన్న చిన్న పిల్లల చికిత్స కేంద్రానికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ శిశువు మరణించింది.

కాన్పు చేసిన విధానంపై ఆగ్రహం
మందులు కావాలంటూ మధులత బంధువులను వైద్యులు అర్ధరాత్రి బయటకు పంపించారు. అప్పటికప్పుడు వారు రెండు వేల రూపాయల మందులు బయట నుంచి తీసుకొచ్చి వైద్య సిబ్బందికి అందించారు. అయినా బిడ్డ ప్రాణాలు దక్కలేదని బాధితులు కన్నీటిపర్యంతమయ్యారు. పైగా తల్లికి ఇష్టం వచ్చినట్లు దాదాపు 10 కుట్లకుపైగా వేశారని, రిమ్స్‌ వైద్య సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆరోపిస్తున్నారు. కాన్పు కోసం ఇష్టం వచ్చినట్లు తల్లి ముఖంపై కొట్టారని, పెదవి చిట్లిపోయి రక్తం కారిందని ఆరోపించారు. పొట్ట మీద ఇష్టం వచ్చినట్లు నొక్కడంతో వాతలు తేలాయని, ఇంత నిర్దయగా వ్యవహరిస్తారని అనుకుంటే తాము చీరాలలోనే కాన్పు చేయించుకునే వారమని విలపించారు. బాధితులు రిమ్స్‌ క్యాజువాలిటీ వద్ద డైరెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. కాన్పు కోసం వచ్చిన తమ బిడ్డను పట్టించుకోకుండా డాక్టర్‌ సమయం వృథా చేయడంతో ఇదంతా జరిగిందని పేర్కొన్నారు. కాన్పు కష్టం అవుతుందనుకుంటే సీజేరియన్‌ చేసి బిడ్డను బయటకు తీయవచ్చు కదాని మధులత బంధువులు ప్రశ్నిస్తున్నారు. మధ్యాహ్నం కొంత మంది నాయకులు రంగ ప్రవేశం చేయడంతో బాధితులు, నాయకులు రిమ్స్‌ డైరెక్టర్‌ చాంబర్‌ ఎదుట ఆందోళనకు దిగారు. తమకు న్యాయం చేయాలని నిరసన వ్యక్తం చేశారు.
ఆర్‌ఎంఓ గది వద్ద బాధితులతో డైరెక్టర్‌ మాట్లాడారు. సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తానని ఆందోళనకారులకు ఆయన హామీ ఇచ్చారు. మెడికల్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రవీంద్రనా«థ్‌రెడ్డి, గైనిక్‌ హెచ్‌ఓడీ డాక్టర్‌ బి.వెంకటేశ్వర్లు ఉన్నారు.

వైద్యుల పొరపాటు లేదు: మధులత విషయంలో వైద్యుల పొరపాటు లేదు. కాన్పు కష్టం అయింది. ఇందుకు తల్లి ఎత్తు, బరువు లేదు. బిడ్డ ఉమ్మ నీరు తాగింది. ఊపిరి తిత్తుల్లోకి కూడా నీరు చేరింది. శిశువు మృతి చెందాడు. అయినా జరిగిన సంఘటనపై విచారణ చేస్తున్నాం.
ఎస్‌కే మస్తాన్‌ సాహెబ్, డైరెక్టర్, రిమ్స్‌

మరిన్ని వార్తలు