విహారయాత్రకు వెళ్లి వస్తూ మృత్యువు ఒడిలోకి..

10 Jun, 2019 11:37 IST|Sakshi
చిన్నారుల మృతదేహాల వద్ద రోదిస్తున్న బంధువులు

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు చిన్నారుల మృతి

టిప్పర్‌ రూపంలో కబళించిన మృత్యువు

గంపరాయి ఘాట్‌లో ప్రమాదం

మృతులిద్దరూ అన్నా చెల్లెళ్లు

పిల్లల మృతితో కన్నీరుమున్నీరైన కన్నవారు

కన్నవారి ఆశలు ఆవిరయ్యాయి. అల్లారి ముద్దుగా పెంచుకుంటున్న పిల్లల్ని మృత్యువు కబళించడంతో ఆ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా రోదిస్తున్నారు. విహార యాత్రల కోసం వెళ్లిన చిన్నారులను మృత్యువు టిప్పర్‌ రూపంలో వచ్చి పొట్టనపెట్టుకోవడంతో ఆ ప్రాంతమంతా విషాదంతో నిండిపోయింది. ఈ ఘోరం పెదబయలు మండలం గంపరాయి గ్రామ సమీపంలోని ఘాట్‌ రోడ్డులో చోటుచేసుకోగా.. పల్లయదొర ముఖేష్‌ (8), పుల్లయదొన స్వప్న(6) అన్నాచెల్లెళ్లు మృత్యువాత పడ్డారు.

విశాఖపట్నం , పెదబయలు (అరకులోయ): పర్రెడ గ్రామానికి చెందిన పుల్లయదొర  వెంకటరావు, అప్పలమ్మలు పిల్లల చదువు కోసమని విశాఖపట్నం గాజువాక ప్రాంతానికి కొన్నేళ్ల క్రితం వచ్చి స్థిరపడ్డారు. ఓ ప్రైవేటు షాపులో రాడ్‌ బెండింగ్‌ పనులు చేసుకుంటూ వచ్చే ఆదాయంతో కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారు. వీరికి బాబు ముఖేష్, పాప స్వప్న అనే పిల్లలు ఉన్నారు. బాబు ఒకటి, పాప నర్సరీ చదువుతున్నారు. పాఠశాలలకు వేసవి సెలవులు కావడంతో పిల్లలను తీసుకొని తల్లిదండ్రులు స్వగ్రామం పర్రెడ గ్రామానికి మే నెలలో   వచ్చారు. అయితే సెలవులు మరికొద్ది రోజుల్లో ముగుస్తుండడంతో విహారయాత్రకు తీసుకెళ్లమని పిల్లలు ముఖేష్, స్వప్న మారం చేశారు. దీంతో  చిన్నాన్న సింహాచలం, అత్త లక్ష్మిలు పిల్లల్ని తీసుకొని ఆదివారం ఉదయం ద్విచక్ర వాహనంపై పర్యాటక ప్రాంతానికి వెళ్లారు. అరకులోయలోని పద్మాపురం గార్డెన్, మ్యూజియం చూశారు. తిరిగి ద్విచక్ర వాహనంపై వస్తుండగా గంపరాయి ఘాటీలోని మలుపువద్ద టిప్పర్‌ వచ్చి వీరి ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టడంతో ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘోరంలో పిల్లలు ముఖేష్, స్వప్న సంఘటనా స్థలంలోనే మృతి చెందగా, వాహనం నడుపుతున్న సింహాచలం, వెనుక కూర్చున్న లక్ష్మి స్వల్ప గాయా లతో బయటపడ్డారు. పిల్లల మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

శోకసంద్రంలో పర్రెడ : ఇద్దరు పిల్లలు మృత్యువాత పడడంతో పర్రెడ గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. ఆదివారం ఉదయం వరకు అందరితో కలిసి ఆడుకున్న పిల్లలు మృత్యువాత పడడం స్థానికులను కలచివేసింది.

రోడ్డు ప్రమాదం బాధాకారం: ఎమ్మెల్యే చెట్టి పాల్గుణ
గంపరాయి ఘాటీలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పిల్లలు మృతి చెందడం బాధకరమని అర కు ఎమ్మెల్యే చెట్టి పాల్గుణ అన్నారు. ప్రమాద సమాచారం తెలిసిన వెంటనే అధికారులతో మా ట్లాడి కారణాలు అడిగి తెలుసుకున్నారు. మృతి చెందిన పిల్లల తల్లిదండ్రులతో ఫోన్‌లో మాట్లాడా రు. కుటుంబాన్ని ఆదుకుంటామని భరోసా ఇచ్చా రు. రోడ్డు ప్రమాదాల నివారణ చర్యలు తీసుకోవాలని, మలుపులు, ఘాటీ రోడ్డు వద్ద హెచ్చరి కల బోర్డులు ఏర్పాటుకు సంబంధిత ఆర్‌అండ్‌బీ అధికారులతో మాట్లాడుతామన్నారు. మృతుల కుటుంబ సభ్యులను వైఎస్సార్‌ సీపీ నాయకులు కాతారి సురేష్‌కుమార్‌ పరామర్శించారు.

మరిన్ని వార్తలు