తల్లికి కడుపు కోత

11 May, 2019 13:30 IST|Sakshi
వివరాలు తెలుసుకుంటున్న సీఐ నాయుడు

కాన్పులో శిశువు మృతి

పెదపాడు పీహెచ్‌సీలో ఘటన

వైద్య సిబ్బంది నిర్లక్ష్యంపై బంధువుల ఆందోళన  

పశ్చిమగోదావరి, పెదపాడు : ముక్కుపచ్చలారని ఆ పసికందు లోకాన్ని చూడకుండానే అనంతలోకాలకు వెళ్లిపోయింది. పెదపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కాన్పు కోసం వచ్చిన తల్లికి కడుపుకోత మిగిలింది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం పెదపాడు గ్రామానికి చెందిన నాగమణికి పెంటపాడు మండలంలోని అలంపురం గ్రామానికి చెందిన వ్యక్తితో వివాహమైంది. గర్భిణి కావడంతో 7వ నెలలో పుట్టింటికి వచ్చింది. పెదపాడు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతోంది. మే 27 ప్రసవ సమయంగా నిర్ణయించారు. గురువారం వైద్య పరీక్షలు నిర్వహించి స్కానింగ్‌ చేయించుకోవాలని సూచించారు. గురువారం సాయంత్రం నొప్పులు రావడంతో ఆమెను పెదపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రసవం నిమిత్తం తీసుకువచ్చారు.

శుక్రవారం మధ్యాహ్నం సమయం వరకు ప్రసవం కాలేదు. దీంతో ప్రైవేటు ఆసుపత్రికి తీసుకువెళ్తామని అడిగినా కాన్పు ఇక్కడే జరుపుతామంటూ బదులిచ్చారు. ప్రసవ సమయంలోనే బిడ్డ చనిపోయింది. దీంతో శిశువు బంధువులు ఆసుపత్రి ముందు ఆందోళన చేశారు. అనంతరం పెదపాడు పోలీసులకు సాయంత్రం 6 గంటల సమయంలో ఫిర్యాదు చేశారు. దీంతో పెదపాడు ఎస్సై జి.జ్యోతిబసు పరిస్థితిని సమీక్షించి సీఐ వైవీఎల్‌ నాయుడుకు సమాచారం ఇవ్వడంతో ఆయన అక్కడకు చేరుకుని వారి నుంచి వివరాలను సేకరించారు. డాక్టరు 11 గంటల సమయంలోనే ఆసుపత్రి నుంచి వెళ్లిపోయారని, డాక్టరు లేని సమయంలో కాన్పు చేయడం, ప్రైవేట్‌ ఆసుపత్రికి వెళ్లిపోతామని చెప్పినా వినకుండా,  ఏఎన్‌ఎంలు నిర్లక్ష్యంగా వ్యవహరించడం కారణంగానే ఆరోగ్యంగా ఉన్న బిడ్డ చనిపోయినట్లు బాధితులు ఆరోపించారు. ఆరోగ్యంగా ఉన్నప్పుడు బిడ్డ ఎలా చనిపోతుందంటూ బంధువులు ప్రశ్నించారు.  దీంతో సీఐ నాయుడు ఆసుపత్రి సిబ్బందిని విచారించారు. బిడ్డ ప్రసవ సమయంలో మట్టిని తినడం వల్లే ఊపిరాడక చనిపోయినట్లు చెప్పారు. ఈ ఆసుపత్రిలో ఇప్పటివరకు ఇలాంటి సంఘటనలు ఎప్పుడూ జరగలేదన్నారు. గర్భిణి వైద్య పరీక్షలకు చెందిన పత్రాలను పరిశీలించారు. అనంతరం మృతిచెందిన బిడ్డను పరిశీలించారు. సీఐ నాయుడు విచారణ చేస్తున్నారు.

మరిన్ని వార్తలు