అయ్యో ! చాక్లెట్‌ అనుకుని విషం తిన్నారు

22 May, 2020 09:07 IST|Sakshi

సాక్షి, వైరా ‌: పొరపాటున విషపూరిత ఆహారం తిని బాలుడు మృతి చెందిన సంఘటన మండలంలోని తాటిపూడిలో గురువారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన రాయల వెంకటేశ్వర్లు, ఆదిలక్ష్మి అనే దంపతులు తాటిపూడి సమీపంలోని ఎఫ్‌సీఐ గోదాంలో వాచ్‌మెన్లుగా పని చేస్తున్నారు. వీరికి స్టీఫెన్, యశ్వంత్‌ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. స్టీఫెన్‌ను దత్తత తీసుకుని పెంచుకుంటున్నారు. కాగా గోదాంలో ఎలుకల తాకిడి అధికంగా ఉండడంతో వాటిని నివారించేందుకు చాక్లెట్‌ రూపంలో ఉండే విషపూరితపు ఆహారాన్ని తీసుకొచ్చి గోదాంలో ఉంచుతారు.

ఇదే క్రమంలో వెంకటేశ్వర్లు ఇంట్లో కూడా ఎలుకలు ఉన్నాయని గోదాం నుంచి మూడు చాక్లెట్‌లను తీసుకొచ్చి ఇంట్లోని బీరువా కింద ఉంచాడు. గురువారం ఇంట్లో ఎవరు లేకపోవడంతో స్టీఫెన్‌ (14) తన తమ్ముడు యశ్వంత్‌తో కలిసి ఇంట్లో ఆడుకుంటూ ఆ విషపూరిత చాక్లెట్‌ను ఇద్దరు అన్నదమ్ములు తిన్నారు. అవి చేదుగా ఉన్నాయని యశ్వంత్‌ సగం తిని ఉసివేశాడు. స్టీఫెన్‌ మాత్రం మొత్తం తినేశాడు. అనంతరం స్టీఫెన్‌కు కళ్లు తిరుగుతున్నట్లు అనిపించడంతో తల్లిదండ్రుల వద్దకు వెళ్లారు. అప్పటికే స్టీఫెన్‌కు వాంతులు, విరోచనలు అవుతుండడంతో తల్లిదండ్రులు ఇరువురిని హుటాహుటిన వైరాలోని ఒక ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లగా అక్కడ స్టీఫెన్‌ మృతి చెందాడు. యశ్వంత్‌ను మెరుగైన వైద్యం కోసం ఖమ్మం ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. తండ్రి వెంకటేశ్వర్లు ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ సురేష్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.    

మరిన్ని వార్తలు