పుత్రశోకాన్ని మిగిల్చిన ఈత సరదా..

12 Jun, 2019 16:12 IST|Sakshi
ప్రవీణ్‌ ఈతకు వెళ్లిన∙బావి

సాక్షి, డోర్నకల్‌(వరంగల్‌ ): తల్లిదండ్రులకు తెలియకుండా ఈత నేర్చుకోవాలన్న సరదా ప్రాణాలను తీయడమే కాకుండా పుత్రశోకాన్ని మిగిల్చింది. వివరాల్లోకి వెళ్తే.. మహబూబాబాద్‌ జిల్లా డోర్నకల్‌ మండలం ఫకీరాతండాకు చెందిన బానోత్‌ రామా, విజయ దంపతులకు ఇద్దరు కుమారులు. వీరిలో పెద్దకుమారుడైన బానోత్‌ ప్రవీణ్‌(13) ఖమ్మం ప్రభుత్వ పాఠశాలలో 8వ తరగతి పూర్తి చేశాడు. రెండు రోజులలో సెలవులు పూర్తి కానుండటంతో తిరిగి ఖమ్మం వెళ్లేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ క్రమంలో మంగళవారం ప్రవీణ్‌ తండ్రి రామా ఖమ్మం వెళ్లాడు. దీంతో తమ్ముడు, మిత్రులతో కలిసి తండా సమీపంలోని చెరువు పక్కనే ఉన్న వ్యవసాయ బావికి ఈతకు వెళ్లాడు. ప్రవీణ్‌కు ఈత రాకున్నా ఖాళీ కూల్‌డ్రింక్, వాటర్‌ బాటిళ్లకు మూతలు బిగించి వాటికి తాడు కట్టి నడుం చుట్టూ కట్టుకున్నాడు.

ఖాళీ బాటిళ్లను నడుంకు కట్టుకోవడంతో నీటిలోకి దిగినా గాలిలో తేలుతుండటంతో వాటి సహాయంతో ఈత కొట్టసాగాడు. నీటి మధ్యలోకి వెళ్లిన తరువాత నడుంకు ఉన్న తాడు తెగిపోవడంతో కేకలు వేస్తూ నీట మునిగాడు. ప్రవీణ్‌ నీట మునిగిన విషయాన్ని గమనించిన మిత్రులు తండా పెద్దలకు సమాచారం అందించారు. తండావాసులు వచ్చి బావిలోకి దిగి వెతికినా ప్రవీణ్‌ ఆచూకీ దొరకలేదు. 108 వాహనంతో పాటు డోర్నకల్‌ సీఐ జె.శ్యాంసుందర్‌ ఘటనా స్థలానికి చేరుకున్నారు. తండావాసులు పలు వ్యవసాయ పనిముట్ల సహకారంతో రెండు గంటల పాటు శ్రమించి బావి అడుగున ఉన్న ప్రవీణ్‌ మృతదేహాన్ని బయటకు తీశారు.  ప్రవీణ్‌ మృతదేహాన్ని చూసి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం మహబూబాబాద్‌ ఏరియా ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.

నీటి తొట్టెలో పడి చిన్నారి మృతి
గూడూరు: తల్లి ఇంట్లో పనిలో నిమగ్నమైన ఉండగా ఇంటి ముందు ఉన్న ఓ చిన్నారి నీటి తొట్టిలో పడి మృతి చెందిన సంఘటన మండలంలోని దుబ్బగూడెంలో మంగళవారం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం..దుబ్బగూడెంకు చెందిన మూడు రమేష్‌ దంపతుల రెండో కూతురు అభినయ (1) ఇంటి ముందు ఆడుకుంటుంది. ఈ క్రమంలో తల్లి ఇంట్లో పనిలో నిమగ్నమై ఉంది. కొద్ది సేపటి తరువాత బయటికి వచ్చిన కూతురు కనిపించకపోవడంతో వెతికింది. ఆ తరువాత ఇంటి పక్కనే ఉన్న నీటి తొట్టిలో పడి ఉండడాన్ని చూసి బోరున విలపించి బయటికి తీసింది. అప్పటికే చిన్నారి మృతి చెందింది. ఈ సంఘటనపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. 
 

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా