వేడినీళ్లు పడి చిన్నారి మృతి

29 Aug, 2019 09:27 IST|Sakshi
చిన్నారి మృతదేహం వద్ద  రోదిస్తున్న తల్లితండ్రులు 

సాక్షి, పెదబయలు(విశాఖపట్టణం) :  వేడి నీళ్లు పడి ఓ చిన్నారి మృ త్యువాత పడింది. దీంతో ఆమె తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు. వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని పర్రెడ  పంచాయతీ పెద్దాపుట్టు గ్రామంలో తాంగుల పుష్ప అనే మహిళ స్నానం కోసమని ఈనెల 26వ తేదీ ఉదయం  కట్టెల పొయ్యపై నీళ్లు వేడిచేసింది. మరిగిన నీటిని బకెట్‌లో పోసింది. ఇంతలో ఆమె కుమార్తె లలితప్రియ(03) అటుగా వచ్చి వేడినీరు ఉన్న బకెట్‌పై కాలువేసింది.ఆ నీరు శరీరంపై పడి వీపు భాగం తీవ్రంగా కాలిపోయింది.

వెంటనే పెదబయలు పీహెచ్‌సీకి తీసుకెళ్లారు. అక్కడ వైద్యాధికారి లేకపోవడంతో ముంచంగిపట్టు సీహెచ్‌సీకి తీసుకెళ్లారు. అక్కడ చికిత్సచేసిన వైద్యాధికారి, పాపకు తీవ్ర గాయాలయ్యాయని, వెంటనే కేజీహెచ్‌కు తీసుకెళ్లాలని సూచించారు. అయితే తల్లిదండ్రులు కిలగాల గ్రామంలో నాటు వైద్యుని వద్దకు తీసుకెళ్లి చికిత్స చేయించారు. కొద్దిగా తగ్గడంతో బుధవారం స్వగ్రామం తీసుకొచ్చారు. ఇంటికి తీసుకొచ్చిన వెంటనే పాప మృతి చెందిందని తల్లిదండ్రులు లక్ష్మణరావు, పుష్ప తెలిపారు.  ప్రమాదం జరిగిన వెంటనే  విశాఖపట్నం తీసుకువెళ్లి ఉంటే  పాప బతికేదని వారు భోరున విలపించారు.  

షాక్‌కు గురైన తల్లి
తన ముద్దుల కుమార్తె మృతి  చెందడంలో తల్లి పుష్ప షాక్‌కు గురైంది. ఆమె ఎనిమిది నెలల గర్భిణి. నెల రోజుల్లో ప్రసవించనున్నట్టు వైద్యులు తెలిపారు.ఈ దుర్ఘటన జరగడంతో ఆమె తీవ్రంగా రోదించి, అపస్మారకస్థితిలోకి వెళ్లిపోయింది. తరువాత సపర్యలు చేయడంతో తేరుకుంది. సమాచారం తెలుసుకున్న రూడకోట పీహెచ్‌సీ వైద్యాధికారి కనక అప్పారావు వైద్య సిబ్బందిని పెద్దాపుట్టు గ్రామానికి పంపించి ఆమెకు వైద్యసేవలందించారు.  ప్రస్తుతం ఆమె ఆరోగ్యపరిస్థితి బాగుందని వైద్య సిబ్బంది తెలిపారు. చిన్నారి మృతి చెందడంతో పెద్దాపుట్టలో విషాదఛాయలు అలముకున్నాయి.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా