వామ్మో.. గొలుసు దొంగలు

5 Sep, 2019 09:37 IST|Sakshi

రెండురోజుల వ్యవధిలో 32 సవర్ల బంగారు ఆభరణాల అపహరణ

సిబ్బంది తీరుపై ఎస్పీ మండిపాటు

తీరు మారకపోతే వేటు తప్పదని హెచ్చరిక

సాక్షి, నెల్లూరు: నెల్లూరు నగరంలో గొలుసు దొంగలు హడలెత్తిస్తున్నారు. తాజాగా బీవీనగర్, చంద్రమౌళినగర్‌లో ఇద్దరు మహిళల మెడల్లోని బంగారు సరుడులను తెంపుకెళ్లారు. వివరాలిలా ఉన్నాయి. భక్తవత్సలనగర్‌ పోస్టాఫీసు వీధిలో పి.వాణి, వెంకటరమేష్‌బాబు దంపతులు నివాసం ఉంటున్నారు. ఈనెల 3వ తేదీ రాత్రి వాణి తన ఇంటిముందు నిలబడి పక్కింటివారితో మాట్లాడుతోంది. ఈక్రమంలో గుర్తుతెలియని ఇద్దరు దుండగులు బైక్‌పై వచ్చి ఆమె మెడలోని 9 సవర్ల బంగారు ఆభరణాలను అపహరించుకెళ్లారు. ఊహించని ఈ పరిణామంతో ఖంగుతిన్న బాధితురాలు కుప్పకూలిపోయింది. కొద్దిసేపటికి తేరుకుని దొంగా.. దొంగా అని అరిచేలోపు దుండగులు బైక్‌ వేగం పెంచి పరారయ్యారు. దీంతో ఆమె తన కుటుంబసభ్యులతో కలిసి వేదాయపాళెం పోలీసులకు ఫిర్యాదు చేసింది. చోరీకి గురైన సొత్తు విలువ సుమారు రూ.2 లక్షలు ఉంటుందని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

ఇంటికి వెళుతుండగా..
చంద్రమౌళినగర్‌ 10వ వీధిలో పి.నాగమణి, వెంకటేశ్వర్లు దంపతులు నివాసం ఉంటున్నారు. ఈనెల 3వ తేదీ రాత్రి నాగమణి, పక్కవీధికి చెందిన ప్రసన్నలు మోర్‌ మార్కెట్‌ సమీపంలోని వినాయక విగ్రహం వద్దకు వెళ్లారు. అక్కడ పూజలు చేసి ఇంటికి నడుచుకుంటూ బయలుదేరారు. ఈక్రమంలో ఇద్దరు గుర్తుతెలియని దుండుగులు బైక్‌పై వారిని వెంబడించారు. నాగమణి ఇంటివద్దకు వచ్చేసరికి దుండగులు ఆమెకు ఎదురుగా వచ్చి మెడలోని ఐదు సవర్ల బంగారు సరుడును తెంచుకెళ్లారు. ఈ మేరకు బాధితురాలు వేదాయపాళెం పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

ఎస్పీ ఆగ్రహం
రెండురోజుల వ్యవధిలో వేదాయపాళెం పోలీసు స్టేషన్‌ పరిధిలో నాలుగుచోట్ల గొలుసు దొంగతనాలు జరిగాయి. సుమారు రూ.8 లక్షలు విలువచేసే 32 సవర్ల బంగారు ఆభరణాలను దుండగులు తెంపుకెళ్లారు. వరుస ఘటనపై జిల్లా ఎస్పీ ఐశ్వర్యరస్తోగి తీవ్రంగా మండిపడ్డారు. తీరు మార్చుకుని గస్తీని ముమ్మరం చేసి గొలుసు దొంగలను పట్టుకోవాలని, లేనిపక్షంలో వేటు తప్పదని హెచ్చరించారు. శివారు ప్రాంతాల్లో గస్తీని ముమ్మరం చేయాలని, వాహన తనిఖీలు పెంచాలని బుధవారం ఆదేశించారు.

మరిన్ని వార్తలు