సిగ్గుపడుతున్నా.. ఇంకేం చెప్పలేను: చిన్మయానంద్‌

20 Sep, 2019 15:52 IST|Sakshi

లక్నో : లైంగిక వేధింపుల ఆరోపణల కేసులో అరెస్టైన బీజేపీ నేత, కేంద్ర మాజీ మంత్రి స్వామి చిన్మయానంద్‌ (73) నేరాన్ని అంగీకరించినట్లు సమాచారం. తాను నిర్వహించే కాలేజీలో న్యాయవాద విద్యను అభ్యసిస్తున్న విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించినట్లు ఒప్పుకున్నారని ప్రత్యేక దర్యాప్తు బృందం చీఫ్‌ నవీన్ అరోరా మీడియాకు వెల్లడించారు. షహజన్‌పూర్‌లో లా కాలేజీలో అడ్మిషన్‌ విషయమై తనకు సహాయపడిన చిన్మయానంద్‌..తనను ఏడాది పాటు లైంగికంగా వేధించాడని బాధిత విద్యార్థిని ఆరోపించిన విషయం విదితమే. కాలేజ్‌లోని హాస్టల్‌లో తాను స్నానం చేస్తున్న దృశ్యాలను రికార్డు చేసిన చిన్మయానంద్‌.. పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడని ఆమె సంచలన ఆరోపణలు చేశారు. ఈ క్రమంలో రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తడంతో శుక్రవారం సిట్‌ అధికారులు ఆయనను అరెస్టు చేశారు. కోర్టు ముందు చిన్మయానంద్‌ను హాజరుపరచగా 14 రోజుల పాటు జైలుకు తరలించింది.

ఈ నేపథ్యంలో సిట్‌ అధికారి మాట్లాడుతూ...తనపై వచ్చిన ఆరోపణలు అన్నింటినీ చిన్మయానంద్‌ అంగీకరించానని తెలిపారు. బాధితురాలిని లైంగికంగా వేధించినట్లు, నగ్నంగా ఉన్న తనకు మసాజ్‌ చేయాల్సిందిగా ఆమెను ఇబ్బంది పెట్టినట్లు ఒప్పుకొన్నారని పేర్కొన్నారు. విచారణలో భాగంగా చిన్మయానంద్‌ తన నేరాన్ని అంగీకరించారని, తాను చేసిన పనులకు ఇప్పటికే సిగ్గుపడుతున్నానని, ఇక వాటి గురించి ఇంకా ఏం చెప్పలేనంటూ ఆయన పశ్చాత్తాపంతో కుంగిపోయినట్లు వెల్లడించారు. కాగా అడ్మిషన్‌తో పాటు లైబ్రరీలో తనకు ఉద్యోగం ఇప్పించిన చిన్మయానంద్‌ కోరిక మేరకు ఆశ్రమంలో ఆయనను కలిశానని బాధితురాలు పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాను హాస్టల్‌లో స్నానం చేస్తున్న వీడియోను చూపి..దాన్ని వైరల్‌ చేస్తానని బెదిరించి ఆయన తనను లోబరుచుకున్నాడని ఆరోపించారు. అనంతరం లైంగిక దాడి దృశ్యాలనూ రికార్డు చేసిన చిన్మయానంద్‌ వాటిని చూపి బ్లాక్‌మెయిల్‌ చేసేవాడని ఆవేదన వ్యక్తం చేశారు. స్వామి శిష్యులు తనకు తుపాకీ గురిచూపి ఆయన వద్దకు తీసుకువెళ్లేవారని, ఆయనకు తనతో మసాజ్‌ చేయించేవారని సంచలన ఆరోపణలు చేశారు.

మరిన్ని వార్తలు