రేప్‌ కేసులో చిన్మయానంద అరెస్ట్‌

21 Sep, 2019 05:17 IST|Sakshi

షహజాన్‌పూర్‌: న్యాయ విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడిన అభియోగంపై కేంద్ర మాజీ మంత్రి స్వామీ చిన్మయానంద (72) అరెస్టయ్యారు. జిల్లా కోర్టు ఆయనకు 14 రోజుల జుడీషియల్‌ కస్టడీ విధించిందని పోలీసులు వెల్లడించారు. తన ప్రవర్తన పట్ల ఆయన క్షమాపణలు తెలిపారు. శుక్రవారం ఉదయం 8.50 గంటలకు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు.  భారీ బందోబస్తు నడుమ ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లి వైద్యపరీక్షలు చేయించి కోర్టులో హాజరుపరిచారు.

‘ప్రత్యేక విచారణ బృందం (సిట్‌) ప్రతి విషయాన్ని క్షుణ్నంగా పరిశీలిస్తోంది. ఇందులో జాప్యమేమీ లేదు. బాధితురాలు కేసు నమోదు చేయించే సమయంలో, ఆమె వద్ద ఉన్న వీడియో ఆధారాలను ఇచ్చింది. అవి  నిజమైనవని నిర్థారించుకున్నాకే, ఆయన్ను అరెస్ట్‌ చేశాం’ అని డీజీపీ ఓపీ సింగ్‌ వెల్లడించారు. సిట్‌ అధికారి నవీన్‌ ఆరోరా మాట్లాడుతూ.. బాధితురాలు, నిందితుల కాల్‌ డేటాను పరిశీలించామని తెలిపారు. బాధితురాలు ఓ పెన్‌డ్రైవ్‌లో 43 వీడియోలను సిట్‌కు సమర్పించింది. చిన్మయానందకు చెందిన ఓ సంస్థలో న్యాయ విద్య అభ్యసిస్తుండగా పలుమార్లు ఆయన తనపై అత్యాచారం చేసినట్లు బాధితురాలు ఆరోపిస్తోంది.

మరిన్ని వార్తలు