ప్రియుని భార్యను చంపడానికి కేసరిబాత్‌లో సైనేడ్‌..

30 Jan, 2019 10:58 IST|Sakshi
పరారీలో ఉన్న నిందితుడు లోకేష్‌ , ప్రధాన నిందితురాలు లక్ష్మీ

అనైతిక బంధమే అంతు చూసింది

చింతామణిలో విష ప్రసాద దుర్ఘటన..

ప్రియుని భార్యను చంపడానికి కుట్ర  

కేసరిబాత్‌లో సైనేడ్‌ కలిపిన ప్రియురాలు  

ఆమెతో పాటు ముగ్గురు మహిళల అరెస్టు

చింతామణి: చిక్కబళ్లాపురం జిల్లా చింతామణిలో విషం కలిపిన ప్రసాదం తిని ఇద్దరు మరణించడం, మరో 8మంది తీవ్ర అస్వస్థత పాలైన ఘటనలో మిస్టరీ వీడిపోయింది. అక్రమ సంబంధమే ఇంత పని చేయించిందని తేలింది. తమ ఆనందానికి ప్రియుని భార్య గౌరి, ఆమె తల్లి  అడ్డుగా ఉందని వారిని మట్టుబెట్టడానికి ప్రియుడు లోకేష్‌ (30)తో కలిసి నిందితురాలు లక్ష్మీ (48) ఈ ఘాతుకానికి పాల్పడిందని పోలీసులు ప్రకటించారు. స్వర్ణకారులు బంగారంపనిలో ఉపయోగించే సైనేడ్‌ విషాన్ని ప్రసాదంలో కలిపినట్లు తెలిపారు.

మంగళవారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో రాష్ట్ర ఐజీపీ దయానంద, ఎస్పీ కార్తీక్‌రెడ్డితో కలిసి కేసు వివరాలను వెల్లడించారు. ప్రధాన నిందితురాలు లక్ష్మీ, ఆమెకు సహకరించిన ఇద్దరు మహిళలను అరెస్టు చేసినట్లు వారు తెలిపారు. వివరాలు.. గత శుక్రవారం రాత్రి చింతామణి పట్టణంలో ఒక ఆలయం వద్ద ఇద్దరు మహిళలు పంచిన ప్రసాదం తిని కవిత (29), సరస్వతమ్మ (55) అనే ఇద్దరు మహిళలు మరణించారు. ఇది సంచలనం కలిగించింది. ఎస్పీ కార్తీక్‌రెడ్డి కేసు దర్యాప్తును సీరియస్‌గా తీసుకున్నారు. కేసు విచారణలో భాగంగా పలువురు అనుమానితులను పట్టుకుని విచారించగా లక్ష్మీ పాత్ర బయటపడింది. 

అడ్డు తొలగించుకోవాలని   
ఆలయం వద్ద ఎదురెదురు ఇళ్లలో ఉండే మహిళ లక్ష్మీతో యువకుడులోకేష్‌ అనైతిక సంబంధం ఉంది. రెండేళ్ల కిందట లోకేష్‌కు శిడ్లఘట్టకు చెందిన  గౌరి అనే యువతితో పెళ్లయింది. లోకేష్‌ బండారం భార్యకు తెలిసిపోవడంతో లక్ష్మీతో గొడవలు పడింది. పోలీసు స్టేషన్‌కు వెళ్లి పంచాయతీ జరిగాయి.  నాలుగు నెలల కిందట లోకేష్‌ ఇంటి నుండి ఎక్కడికో వెళ్లిపోయాడు. గౌరి పోలీసుస్టేషన్‌ మిస్సింగ్‌ కేసు పెట్టింది.  కానీ అజ్ఞాతం నుంచి లక్ష్మీ– లోకేష్‌ మధ్య సంబంధాలు కొనసాగాయి. గౌరిని చంపాలని పథకం పన్ని రెండుసార్లు ప్రయత్నించి విఫలయినట్టు లక్ష్మీ అంగీరించింది.

ఈసారి పకడ్బందీగా  
గత శుక్రవారం పకడ్బందీగా అమలు చేశారు. లక్ష్మీ తన ఇంట్లో కేసరిబాత్‌ను తయారు చేసింది. ప్రసాదాన్ని రెండు భాగాలు చేసి ఇంటి పనిమనిషి అమరావతి, ఆలయం ముందర పూలు అమ్ముతున్న పార్వతీలను పిలిచి ప్రసాదాన్ని పంచాలని సూచించింది. అందులో సైనైడ్‌ కలిపి ఉన్న విషయం వారికి తెలియకపోవడంతో సరేనని అంగీకరించారు. ప్లాస్టిక్‌ కప్పులో పెట్టినది గౌరి, వారి తల్లి సరస్వతి గుడినుంచి రాగానే ఇవ్వాలని సూచింది. వారు సరిగ్గా గౌరి, తల్లి సరస్వతికి ఇచ్చి తినమని చెప్పారు.  ఇంటికి వెళ్లాక సరస్వతి ఇంటిపక్కలవారికి పంచింది.తాను కొంత తిని, కూతురికి ఇవ్వగా ఆమె తినలేదు. కొంతసేపటికే ప్రసాదం తిన్న 10 మంది తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. కవిత అనే మహిళ చనిపోగా, ఆమె భర్త రాజు, చిన్నారులు జాహ్నవి, చరణి , ఇతరులు నారాయణప్ప, వెంకటరమణ, సుధా, శశిదర్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. సరస్వతి చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచింది. ఈ కేసులో మరొక నిందితుడు లోకేష్‌ కోసం గాలిస్తున్నామని ఐజీపీ చెప్పారు. దర్యాప్తు బృందానికి 50వేలు  బహుమానాన్ని ప్రకటించారు.  

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు