చీటీవ్యాపారి కుచ్చుటోపీ

7 Dec, 2019 13:06 IST|Sakshi

రూ. 3 కోట్లకు టోకరా

2 రోజుల క్రితం పరారీ

బాధితుల్లో ఉపాధ్యాయులే అధికం

శ్రీకాకుళం, సరుబుజ్జిలి: రోజూ కూలీనాలీ చేసుకుని పైసా పైసా కూడబెడుతున్నారు. అలా వచ్చిన తమ సంపాదనలో కొంత మొత్తం పొదుపు చేయాలని ఆలోచిస్తున్నారు. తమ భవిష్యత్‌ అవసరాలకు అక్కరకు వస్తాయని భావిస్తున్నారు. దీనికి అనేక రకాల మార్గాలను ఆశ్రయిస్తున్నారు. అన్నిటికంటే సులువుగా డబ్బులు కలసి వచ్చే చిట్స్‌ రంగాన్ని ఎంచుకుంటున్నారు. వీరి అవసరాలను కొంతమంది అనధికార చిట్స్‌ వ్యాపారులు బలహీనతగా తీసుకుంటున్నారు. వారి నమ్మకానికి శఠగోపం పెడుతున్నారు. తాజాగా సరుబుజ్జిలి మండలంలోని ఓ గ్రామానికి చెందిన అనధికార ఫైనాన్స్, చిట్స్‌ వ్యాపారి జిల్లాలో 200 మందికి కుచ్చుటోపీ పెట్టాడు. చిట్స్‌ వేసిన దాదాపు రూ. 3 కోట్లతో పరారైనట్లు మండలంలో కలకలం రేపింది.

చిరువ్యాపారం నుంచి చిట్టీల వరకూ...
చిట్స్‌ వ్యాపారి తొలుత సైకిల్‌పై తన వ్యాపా రాన్ని ప్రారంభించాడు. చిన్నపాటి సంచుల్లో ఖైనీ, బీడీలు, చుట్టలు, టీ పొడి, చాక్లెట్లు, నిత్యావసర వస్తువులు గ్రామాల్లో విక్రయించేవాడు. తదుపరి అవే వస్తువుల తో హోల్‌సేల్‌ వ్యాపారం ప్రారంభించాడు. ద్విచక్రవాహనంపై పలు కిరాణా దుకాణాలకు సామగ్రి సరఫరా చేసి నగదు వసూళ్లు చేసేవాడు. కాలక్రమేణా అందరి వద్ద నమ్మకంగా ఉంటూ పరిచయాలు పెంచుకుని చిట్స్‌ వ్యాపారాన్ని ప్రారంభించాడు. కొద్ది రోజులపాటు వందలు.. వేలల్లో.. ఆపై లక్షలకు చిట్స్‌ వ్యాపారం పడగలెత్తడం విశేషం. ఈ నేపథ్యంలో చిట్‌ వేలం పాడగా సంబంధిత వ్యక్తులు అందుబాటులో లేకపోతే వారి వ్యక్తిగత ఖాతాకు నగదు జమ చేసేవాడని సమాచారం. దీంతో అన్నివర్గాల ప్రజలకు నమ్మకం ఏర్పడింది. వేలం పాట తర్వాత కూడా నెలవారీ వడ్డీ ఇస్తే సరిపోతుందని అసలు సొమ్ము అతని వద్దనే ఉంచేవారు.

అధిక వడ్డీతోనే ఆశ
చిట్స్‌ వ్యాపారాల్లో నగదు చెల్లించి మోసపోయిన వారిలో సామాన్యులతోపాటు అధిక శాతం మంది ఉద్యోగులే ఉండటం గమనార్హం. మండలంలోని రొట్టవలస, కొత్తకోట, మూలసవలాపురం, పాతపాడు, కేజేపేట, సరుబుజ్జిలి, బప్పడాం, శాస్త్రులపేట, వీరభద్రాపురం, కాగితాపల్లి, లొద్దలకాగితాలపల్లి, తెలికిపెంట, పాతపాడు తదితర గ్రామాల్లో ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నవారు అధికంగా ఉన్నారు. వీరు ప్రతినెలా చిట్స్‌ చెల్లించి వేలం పాడగా వచ్చిన నగదు కూడా చిట్స్‌ వ్యాపారి వద్ద నెలవారీ వడ్డీల కోసం దాచేవారు.

ఇతర ప్రాంతాలకు వ్యాపార విస్తరణ
ఈ చిట్స్‌ వ్యాపారం జిల్లాలో ఆమదాలవలస, గార, ఎల్‌.ఎన్‌.పేట, బూర్జ, హిరమండలం, బత్తిలి, భామిని, పాతపట్నం, కాశీబుగ్గతోపాటు ఒడిశా, పశ్చిమబంగా, తెలంగాణ, మన రాష్ట్రంలో విజయవాడ, రాజమండ్రి, విశాఖపట్నం ప్రాంతాలకు విస్తరించింది. అక్కడ నుంచి కూడా అనేక మంది చిట్స్‌ కోసం నెలవారీగా సదరు వ్యక్తి బ్యాంకు ఖాతాకు నగదు చెల్లింపులు చేసినట్లు తెలుస్తోంది. 

బయటపడిన బాగోతం...  
ఎనిమిదేళ్లుగా గుట్టుగా సాగిన అనధికార చిట్స్‌ అండ్‌ ఫైనాన్స్‌ వ్యాపారంలో లొసుగులు నెల రోజుల క్రితం నుంచే బయటపడ్డాయి. నెలవారీ వడ్డీల కోసం దాచుకున్న సొమ్ముతోపాటు, చిట్‌ వేలం పాడిన నగదును సకాలంలో తిరిగి చెల్లించకపోవడంతో పలువురిలో అనుమానాలు తలెత్తాయి. దీంతో ఎవరికి వారే బయటపడకుండా తమకు రావాల్సిన పైకం కోసం చిట్స్‌ వ్యాపారిపై వారం రోజులుగా తీవ్ర ఒత్తిళ్లు తెచ్చినట్లు సమాచారం. ఇదేక్రమంలో కొంతమంది వ్యక్తులు చిట్స్‌ వ్యాపారికి చెందిన కొన్ని స్థిరాస్తులను రిజిస్ట్రేషన్‌ చేసుకున్నట్లు తెలుస్తోంది. మిగిలిన వారు ప్రశ్నిస్తే తనకు బయట నుంచి రావాల్సిన బకాయిలు వసూళ్లయిన వెంటనే చెల్లిస్తానని హామీ ఇచ్చిన కొద్ది గంటల్లో అజ్ఞాతంలోకి వెళ్లినట్లు సమాచారం.  

ఆ నగదు ఏమైనట్లు...
చిట్స్‌ రూపంలో వసూళ్ల చేసిన కోట్లాది రూపాయలు ఏం చేసాడన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఉద్యోగులు, ప్రజల నుంచి తీసుకున్న సొమ్ములతో శ్రీకాకుళం, నైరా, సరుబుజ్జిలి, కాశీబుగ్గ, విశాఖ తదితర ప్రాంతాల్లో స్థిరాస్తులు కొనుగోలు చేసినట్లు పలువురు చర్చించుకుంటున్నారు.

కష్టపడిన సొమ్ము పోయింది
రోజువారా కష్టపడిన సొమ్ము రూ. 60 వేలు చిట్‌ కింద చెల్లించాను. పలుమార్లు డబ్బులు కోసం ప్రశ్నిస్తే చిట్స్‌ వ్యాపారి వాయిదాలతో కాలక్షేపం చేశాడు. లోపాయికారంగా భయపెట్టిన వారికి మాత్రం కొంతమేర చెల్లించాడు.– ఇల్లాకుల శ్రీనివాసరావు,నందికొండకాలనీ, సరుబుజ్జిలి మండలం

లిఖిత పూర్వకంగా ఫిర్యాదు లేదు
ఇదే విషయమై ఆమదాలవలస సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ ప్రసాదరావు వద్ద ప్రస్తావించగా చిట్స్‌ వ్యాపారి డబ్బులు చెల్లింపుల వ్యవహారం కోసం ఇంతవరకు ఎవరూ లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేయలేదు. ఫిర్యాదు వస్తే తక్షణమే విచారణ చేపడతామని వెల్లడించారు.

మరిన్ని వార్తలు