చిన్నారి వర్షిత హత్యకేసులో నిందితుడి అరెస్ట్‌

16 Nov, 2019 17:47 IST|Sakshi

సాక్షి, చిత్తూరు: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన చిన్నారి వర్షిత హత్యాచారం కేసులో ప్రధాన నిందితుడు పఠాన్‌ మహ్మద్‌ రఫీ (25) అలియాస్‌ గిడ్డును పోలీసులు అరెస్టు చేశారు. హత్యానంతరం గుండు లాంటి కటింగ్‌ చేయించుకుని తప్పించు తిరుగుతున్న రఫీని శనివారం చాకచక్యంగా పట్టుకున్నట్లు చిత్తూరు ఎస్పీ సెంథిల్‌కుమార్‌ మీడియాకు వివరించారు. ఈ నెల 7వ తేదీ చిత్తూరు జిల్లా బి.కొత్తకోట మండలం గుట్టపాళ్యంకు చెందిన సిద్ధారెడ్డి, ఉషారాణి దంపతులు తమ మూడో కుమార్తె వర్షిత (5)ను తీసుకుని అంగళ్లు ప్రాంతంలోని ఓ వివాహ రిసెప్షన్‌కు హాజరయ్యారు.

అక్కడ తప్పిపోయిన బాలిక మరుసటి రోజు ఉదయం కల్యాణ మండపం వెనుక శవమై తేలిన విషయం తెలిసిందే. హత్య జరిగిన రోజు రాత్రి వర్షిత ఓ ఉన్మాది వెంట వెళుతుండటాన్ని సీసీ ఫుటేజీల ద్వారా గుర్తించిన పోలీసులు అనుమానితుడి ఊహా చిత్రాన్ని అన్ని స్టేషన్లకు పంపించారు. తీరా ఈ దురాగతానికి పాల్పడింది చిన్నప్పటి నుంచే పిల్లలపై లైంగిక దురాగతాలకు పాల్పడుతున్న మదనపల్లె ప్రాంతంలోని బసినికొండకు చెందిన రఫీగా పోలీసులు గుర్తించారు. కురబలకోట మండలం అంగళ్లు ప్రాంతంలోని మొలకవారిపల్లెలో ఉంటున్న తన భార్య ఇంటికి వచ్చిన రఫీ పాపకు చాక్లెట్లు ఆశ చూపించి తీసుకెళ్లి అత్యాచారంచేసి ఆపై హత్య చేసినట్లు తేలడంతో నిందితుడ్ని అరెస్టు చేశారు. 

చిన్నతనంలోనే వక్రబుద్ధి.. జైలు
 పోలీసుల విచారణలో రఫీ దుర్మార్గపు వాంఛలు వెలుగుచూశాయి. బసినికొండలో 15 ఏళ్ల వయస్సున్నప్పుడే ఆరో తరగతి చదువుతున్న బాలికపై అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు. అప్పట్లో పోలీసులు జువైనల్‌హోమ్‌కు తరలించారు. ఏడాదిన్న క్రితం అంగళ్లులో 12 ఏళ్ల వయస్సున్న బాలికతో అసభ్యంగా ప్రవర్తించాడు. పాప తల్లిదండ్రులు, గ్రామస్తులు దేహశుద్ధి చేశారు. అయితే పోలీసులకు ఫిర్యాదు చేయడానికి వెనుకంజవేశారు. తాజాగా వర్షితను పొట్టనపెట్టుకున్నాడు.

>
మరిన్ని వార్తలు