బస్సు ప్రమాదం: అడ్డదారే కొంప ముంచింది!

11 Sep, 2018 14:53 IST|Sakshi

అధికారుల నిర్లక్ష్యంతో అమాయకుల బలి

సాక్షి, కొండగట్టు : జగిత్యాల జిల్లా కొండగట్టులో చోటుచేసుకున్న ఘోర ప్రమాదానికి ఆర్టీసీ, ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యమే కారణమని తెలుస్తోంది. గతంలో ఇదే చోట ఓ లారీ ప్రమాదంలో సుమారు 20 మంది మృతి చెందారు. ఆ తర్వాత ఇంతటి పెద్ద ప్రమాదం చోటుచేసుకోవడం ఇదే తొలిసారి. లారీ ప్రమాదమప్పుడే అధికారులు ఈ ఘాట్‌ రోడ్డుపైకి భారీ వాహనాలను నిషేదించారు. కేవలం బైక్స్‌ను మాత్రమే అనుమతించేవారు. దీనికి సంబంధించి హెచ్చరిక బోర్డులను కూడా ఏర్పాటు చేశారు. ఈ రోడ్డుకు ప్రత్యామ్నయంగా బైపాస్‌ రోడ్డు కూడా ఉంది.  కానీ గత మూడు నెలల నుంచి ఆర్టీసీ బస్సులు, ప్రయివేట్‌ వాహనాలను మళ్లీ అనుమతిస్తున్నారు. ఘాట్‌ రోడ్డు నుంచి హైవేపైకి కిలోమీటర్‌ దూరం ఉంటుంది. ప్రత్యమ్నాయ రోడ్డు ఉపయోగిస్తే మరో ఐదు కిలోమీటర్లు ఎక్కువగా ప్రయాణించాల్సి వస్తుంది. దీంతోనే ఆర్టీసీ అధికారులు డిజీల్‌కు కక్కుర్తిపడి బస్సులను షార్ట్‌కట్‌గా భావించిన ఘాట్‌రోడ్డు రూట్‌లో నడిపిస్తున్నారు.

ఘాట్‌ రోడ్డు నిర్మాణం కూడా ఆర్‌అండ్‌బీ నిబంధనలకు విరుద్దంగా ఉందని గతంలోనే అధికారులు గుర్తించారు. ప్రభుత్వానికి కూడా నివేదిక పంపించారు. ఘాట్‌ రోడ్డుకు ఇరువైపుల గోడను నిర్మించాలని  కూడా నిర్ణయించారు. ఆ గోడ నిర్మాణం చేబడితే ఈ ఘోర ప్రమాధం సంభవించేది కాదని, వారి నిర్లక్ష్యంతో అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయారని స్థానికులు అధికారుల తీరుపట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 57మంది ప్రాణాలు కోల్పోయారు. 

మరిన్ని వార్తలు