న్యాయవాదిపై సీఐ దాడి

12 May, 2018 08:51 IST|Sakshi
బాధితుడిని పరామర్శిస్తున్న అనంత వెంకటరామిరెడ్డి

అనంతపురం నాల్గో పట్టణ సీఐ శ్యామ్‌రావు తీరు వివాదాస్పదం

ప్రయివేట్‌ కేసు దాఖలు చేస్తామన్న వైఎస్సార్‌సీపీ లీగల్‌ సెల్‌ జిల్లా అధ్యక్షుడు నారాయణరెడ్డి

అనంతపురం న్యూసిటీ: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జిల్లా కార్యదర్శి, న్యాయవాది గోవిందరాజులుపై నాల్గవ పట్టణ సీఐ శ్యామ్‌రావు దాడి చేసి గాయపరిచారు. వివరాల్లోకి వెళితే శుక్రవారం గోవిందరాజు, అతని సోదరుడు శివశంకర్, మరో వ్యక్తి దివాకర్‌ రుద్రంపేట బైపాస్‌ సమీపంలో ఉన్న సండే కార్‌ బజార్‌ షోరూంకు బైక్‌లో వెళ్లారు. మొదట దివాకర్‌ బయటకు రాగా, ఆ సమయంలో అక్కడికి చేరుకున్న నాల్గవ పట్టణ సీఐ ‘ఏం రా..? దొంగకార్లు అమ్ముతున్నారంట’ అని వారిని నిలదీశారు. ‘సార్‌ దొంగ కార్లు అమ్మే ఖర్మ మాకేం పట్టిందని సీఐకు సమాధానమిచ్చారు. ఈ క్రమంలో దివాకర్‌ను సీఐ కొట్టే ప్రయత్నం చేశారు. అక్కడే ఉన్న గోవిందరాజు సీఐకి నచ్చజెప్పే క్రమంలో అతనిపై చేయి చేసుకున్నారు. తాను న్యాయవాదినని, ఇలా చేయడం సరైన పద్ధతికాదని అనగా ‘ఎవరైతే నాకేం? నేను చెప్పిందే వేదం’ అంటూ విచక్షణారహితంగా దాడి చేయడంతో గాయపడ్డ గోవిందరాజులు సర్వజనాస్పత్రిలో అడ్మిట్‌ అయ్యారు. 

సీఐపై కేసు నమోదు చేయాలి
న్యాయవాది గోవిందరాజులుపై విచక్షణారహితంగా దాడిచేసిన సీఐ శ్యామ్‌రావుపై చర్యలు తీసుకోవాలని వైఎస్సార్‌ సీపీ అనంతపురం అర్బన్‌ నియోజకవర్గ సమన్వయకర్త, అనంతపురం పార్లమెంట్‌ అధ్యక్షులు అనంత వెంటకరామిరెడ్డి డిమాండ్‌ చేశారు. సర్వజనాస్పత్రిలో చికిత్స పొందుతున్న గోవిందరాజులను ఆయన పరామర్శించారు. జిల్లాలో అధికార పార్టీ నేతలు ప్రజలపై దాడులు, వసూలు చేస్తున్నా నియంత్రించడంలో పోలీసులు వైఫల్యం చెందారన్నారు. తక్షణం సీఐపై కేసు నమోదు చేసి భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలన్నారు.  వైఎస్సార్‌ సీపీ లీగల్‌సెల్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కురుబ నాగిరెడ్డి మాట్లాడుతూ న్యాయవాదులపైనే దాడి చేస్తుంటే ఇక సామాన్యుల పరిస్థితేమిటన్నారు. సీఐపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. లీగల్‌ సెల్‌ జిల్లా అధ్యక్షులు నారాయణరెడ్డి మాట్లాడుతూ సీఐపై ఎస్పీ క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలన్నారు. ఎస్పీ స్పందించకపోతే ప్రైవేట్‌ కేసు వేస్తామని హెచ్చరించారు. గోవిందరాజులను పరామర్శించిన వారిలో వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మీసాల రంగన్న, జిల్లా అధికార ప్రతినిధులు చింతకుంట మధు, ఆలమూరు శ్రీనివాస్‌ రెడ్డి, ట్రేడ్‌ యూనియన్‌ జిల్లా అధ్యక్షులు మరువపల్లి ఆదినారాయణ రెడ్డి, పార్టీ నగరాధ్యక్షులు చింతా సోమశేఖర్‌ రెడ్డి, నేతలు గౌస్‌బేగ్, అనిల్, తదితరులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు