కార్యాలయం ఉద్యోగులే దొంగలు!

10 Sep, 2019 09:30 IST|Sakshi
నిందితులను మీడియా ఎదుట హాజరు పరిచిన సీఐ భీమానాయక్‌

సాక్షి, ఒంగోలు : కార్యాలయంలో పనిచేసే ఉద్యోగులే ఆ సంస్థలో వస్తువులను కాజేశారు. ఈ సంఘటన స్థానిక ఏనుగుచెట్టు సమీపంలోని డీటీడీసీ కార్యాలయంలో వెలుగు చూసింది. ఒన్‌టౌన్‌ సీఐ ఎం.భీమానాయక్‌ కేసు నమోదు చేయడంతో పాటు నిందితులను అరెస్టు చేసి సోమవారం మీడియా ముందు హాజరు పరిచారు. సీఐ కథనం ప్రకారం.. డీటీడీసీ కార్యాలయం నిర్వాహకుడు జొన్నగలగడ్డ శ్రీనివాసరావు ఇటీవల పోలీసులకు ఒక ఫిర్యాదు చేశాడు. డెలివరీ చేయాల్సిన పార్శిల్‌ వస్తువులు చోరీ అయ్యాయనేది ఆ ఫిర్యాదు సారాంశం. చోరీ సొత్తు విలువ రూ.4 లక్షలు. దీనిపై దృష్టి సారించిన పోలీసులు ముందుగా డీటీడీసీ కార్యాలయంలోని సీసీ పుటేజి ఆధారంగా కేసు దర్యాప్తు ప్రారంభించారు. అందులో లభించిన సమాచారం ఆధారంగా రాత్రి వేళ కార్యాలయంలో విధుల్లో పనిచేసిన వ్యక్తుల ప్రమేయం ఉన్నట్లు గుర్తించారు.

పోలీసులు నిఘా ఉంచి దామోదరం సంజీవయ్య కూరగాయల మార్కెట్‌ వద్ద ఉన్న అయినాబత్తిన చిరంజీవి, అతడిచ్చిన సమాచారంతో అదే కార్యాలయంలో పనిచేసే కాకా మణికంటేశ్వరరావులను ఆదివారం అరెస్టు చేశారు. నిందితుల నుంచి వివిధ కంపెనీలకు చెందిన 11 మొబైల్‌ ఫోన్లు, వైర్‌లెస్‌ స్పీకర్‌–1, సన్‌ గ్లాసెస్‌–1, బైక్‌ హారన్‌–1, రిస్ట్‌వాచి–1 స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ రూ.1.20 లక్షలుగా నిర్థారించారు. ఈ కేసులో మరో నిందితుడు హరిప్రసాద్‌ అలియాస్‌ హరి కోసం గాలిస్తున్నారు. నిందితులను అరెస్టు చేయడంలో ఎస్‌ఐ నఫీజ్‌ బాషా, సిబ్బంది కృషి చేశారంటూ వారిని సీఐ భీమానాయక్‌ అభినందించారు.

మరిన్ని వార్తలు