పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ పరీక్షలో అక్రమాలు : 42 మంది అరెస్ట్‌

25 Sep, 2018 12:52 IST|Sakshi

కోల్‌కతా : పశ్చిమ బెంగాల్‌లో పోలీస్‌ కానిస్టేబుల్‌ పోస్టుల నియామకానికి జరిగిన రాత పరీక్షలో అక్రమాలకు పాల్పడిన 42 మందిని బెంగాల్‌ సీఐడీ పోలీసులు అరెస్ట్‌ చేశారు. విచారణ అనంతరం అవకతవకలకు పాల్పడిన 42 మంది అభ్యర్ధులపై క్రిమినల్‌ కేసులు నమోదు చేశామని సీనియర్‌ పోలీస్‌ అధికారి వెల్లడించారు.

కానిస్టేబుల్‌ రిక్రూట్‌మెంట్‌కు ఆదివారం జరిగిన రాతపరీక్షలో పలు పరీక్షా కేంద్రాల్లో అభ్యర్ధులు వైర్‌లెస్‌ పరికరాలు, ఇయర్ ఫోన్లను ఉపయోగించినట్టు తమకు సమాచారం అందిందని సీఐడీ వర్గాలు వెల్లడించాయి. అభ్యర్ధులు వైర్‌లైస్‌ పరికరాలను తమ షూలు, స్లిప్పర్స్‌లో దాచారని, పలువురు అభ్యర్ధుల నుంచి తాము ఇయర్‌ ఫోన్లను స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు.

పరీక్షా కేంద్రాల వెలుపల నుంచి మొబైల్‌ ఫోన్లతో వీటిని అనుసంధానించారని సమాచారం ఉందన్నారు. ఈ అవకతవకల వెనుక భారీ రాకెట్‌ ఉందని సీఐడీ అధికారులు అనుమానిస్తున్నారు. ఈ రాకెట్‌లో ప్రమేయం ఉన్న వారందరినీ అరెస్ట్‌ చేసేందుకు సీఐడీ సన్నాహాలు చేస్తోంది.

మరిన్ని వార్తలు