వారి మధ్య ప్రేమ?

1 May, 2019 10:08 IST|Sakshi
మధు, సుదర్శన్‌ యాదవ్‌ (ఫైల్‌)

అతని ప్రవర్తన నచ్చక దూరం?

మధు మృతి కేసులో సీఐడీకి కీలక సమాచారం  

రాయచూరు రూరల్‌/ కంప్లి: సివిల్‌ ఇంజనీరింగ్‌ విద్యార్థి మధు పత్తార్‌ అనుమానాస్పదంగా మృతి కేసు విచారణలో సీఐడీ అధికారులకు పలు విషయాలు బయట పడుతున్నాయి. అదనపు డీజీపీ సలీం నేతృత్వంలోని అధికారుల బృందం దర్యాప్తు సాగిస్తోంది. నిందితుడు సుదర్శన్‌ యాదవ్‌ను క్షుణ్ణంగా విచారించి సమాచారం రాబడుతున్నాయి. సీఐడీ ఎస్పీ శరణప్ప, డీఎస్పీ రవి శంకర్, సీఐ దిలీప్‌ కుమార్‌లు ఏడీజీపీతో పాటు విచారణలో పాల్గొంటున్నారు.  ఏప్రిల్‌ 13న ఇంటి నుంచి బయల్దేరిన మధు పత్తార్‌ (23) 16వ తేదీన నగరంలోని మాణిక్‌ప్రభు ఆలయం వెనుక గుట్టల్లో ఉరివేసుకున్న స్థితిలో శవమై తేలిన సంగతి తెలిసిందే. నవోదయ ఇంజనీరింగ్‌ కళాశాలలో చదువుతున్న మధు హత్య కేసులో నిందితుడిగా భావిస్తున్న సుదర్శన్‌ యాదవ్‌ల మధ్య ఎనిమిదేళ్ల నుంచి ప్రేమ వ్యవహారం కొనసాగుతున్నట్లు సమాచారం. దానికి సంబంధించి కొన్ని ఫోటోలు కూడా బయటకు వచ్చాయి. నగరంలోని ఒక ప్రైవేట్‌ పాఠశాలలో 8, 9, 10వ తరగతి, కళాశాలలో 11, 12వ తరగతుల వరకు క్లాస్‌మేట్‌లుగా ఉన్నారు. యాదవ్‌ బీకాంలో చేరగా మధు ఇంజనీరింగ్‌కు వేర్వేరు కాలేజీల్లో చేరారు. అతని ప్రవర్తన నచ్చక ఆమె దూరంగా ఉంది. అయినా ప్రేమిస్తున్నానంటూ వెంటపడేవాడు. ఇద్దరి మధ్య గొడవలు చోటు చేసుకోవడంతో మధును యాదవ్‌ హత్య చేశాడో, లేక మధునే ఆత్మహత్య చేసుకుందా? అనే అంశాలపై పూర్తి స్థాయిలో అధికారులు విచారణ చేస్తున్నారు.గత రెండు వారాలుగా సీఐడీ అధికారుల బృందం నగరంలోనే తిష్ట వేసి విచారణ సాగిస్తోంది.  

సీబీఐతో దర్యాప్తు చేయించాలి  
మధుపత్తార్‌ అనుమానాస్పద మృతి కేసును సీబీఐతో దర్యాప్తు చేయించాలని మంగళవారం ఏబీవీపీ తాలూకా శాఖ ర్యాలీని నిర్వహించి తహశీల్దార్‌కు వినతిప్రతాన్ని అందజేశారు.  స్థానిక శారద పాఠశాల నుంచి ప్రారంభమైన ర్యాలీ ప్రముఖ మార్గాల మీదుగా తహాశీల్దార్‌ కార్యాలయానికి చేరారు. మధుపత్తార్‌ హత్యకు కారకులైన దోషులను బంధించి ఉరిశిక్ష వేయాలని నినాదాలు చేశారు. ఈ సందర్బంగా ఏబీవీపి తాలూకా శాఖా అధ్యక్షులు ఎం.శివబసవనగౌడ కార్తీక్, గీతా పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు