32మంది పోలీసులకు నోటీసులు జారీ

26 Jan, 2018 16:44 IST|Sakshi

సాక్షి, కరీంనగర్‌ : అక్రమ ఫైనాన్స్ వ్యవహారంలో నిందితుడు మాజీ ఏఎస్‌ఐ మోహన్‌రెడ్డి కేసు విచారణను సీఐడీ వేగవంతం చేసింది. మోహన్‌ రెడ్డి అక్రమ దందాలో పెట్టుబడులు పెట్టిన 32మంది పోలీసులకు సీఐడీ నోటీసులు జారీ చేసింది. నోటీసులు అందుకున్న వారంతా విచారణకు హాజరు కావాలని ఆదేశాలు ఇచ్చింది.

కాగా ఏఎస్‌ఐ మోహన్‌ రెడ్డిపై మరో కేసు నమోదైన విషయం తెలిసిందే. సాయినగర్‌కు చెందిన తనిగెల అనిల్‌కుమార్‌ కుటుంబ అవసరాల దృష‍్ట్యా 2008లో మోహన్‌ రెడ్డి నుంచి రూ.17 లక్షలు అప్పుగా తీసుకున్నాడు. ఇందుకోసం అనిల్‌ తన భార్య మణిమ్మ పేరుమీద ఉన్న ఇంటిని మోహన్‌ రెడ్డి సూచన మేరకు కసర్ల మహేందర్‌ రెడ్డి పేరు మీద జీపీఏ కం సేల్‌డీడ్‌ రాసిచ్చాడు. ప్రతి నెల వాయిదాలు కడుతున్న సమయంలో అనిల్‌కు తెలియకుండా మోహన్‌ రెడ్డి...కొండబత్తిన సాంబమూర్తితో పాటు మరొకరి పేరు మీద సేల్‌డీడ్‌ చేశాడు. ఈ విషయమై అనిల్‌ ...మోహన్‌ రెడ్డిని నిలదీయగా అప్పు చెల్లిస్తేనే ఇంటిని ఇస్తానని చెప్పడంతో వడ్డీతో కలిపి రూ.30 లక్షలు చెల్లించాడు.

అయినా మోహన్‌ రెడ్డి ...ఆ ఇంటిని అనిల్‌ భార్య పేరుమీద రిజిస్ట్రర్‌ చేయలేదు. అంతేకాకుండా 2012లో మోహన్‌ రెడ్డి...మణిమ్మ ఇంట్లోకి ప్రవేశించి...ఆమెను తుపాకీతో బెదిరించి ఇంటి నుంచి గెంటివేశాడు. దీంతో అనిల్‌ కుటుంబం హైదరాబాద్‌ వలస వెళ్లింది. తర్వాత ఇల్లు పోయిందనే మనోవేదనతో మణిమ్మ గుండెపోటుతో మృతి చెందింది. ఈ విషయమై బాధితుడు గురువారం కరీంనగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు.

మరిన్ని వార్తలు