సిగరెట్లూ ఎగిరొస్తున్నాయ్‌!

4 Jan, 2020 08:03 IST|Sakshi

విదేశాల్లో తయారవుతున్న అనేక బ్రాండ్లు

ఢిల్లీ మీదుగా అక్రమ రవాణా

గుట్టురట్టు చేసిన సౌత్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ టీమ్‌

రూ.12 లక్షలకు పైగా విలువైన సరుకు స్వాధీనం

సాక్షి, సిటీబ్యూరో: బంగారం, ఎలక్ట్రానిక్‌ వస్తువులు... మాదకద్రవ్యాలు, ఇవి మాత్రమే కాదు సిగరెట్లు సైతం పెద్ద ఎత్తున సిటీకి అక్రమ రవాణా అవుతున్నాయి. ఈ తరహా స్మగ్లింగ్‌ కారణంగా ప్రభుత్వ ఖజానాకు భారీగా గండి పడటంతో పాటు ప్రజారోగ్యానికి చేటని అధికారులు చెబుతున్నారు. నగరానికి అక్రమంగా వచ్చి చేరిన సిగరెట్లను హోల్‌సేల్‌గా విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను దక్షిణ మండల టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.12 లక్షల విలువైన, పది బ్రాండ్లకు చెందిన 16,380 విదేశీ సిగరెట్‌ ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నామని, వీటి విక్రయంపై నిషేధం కొనసాగుతోందని టాస్క్‌ఫోర్స్‌ అదనపు డీసీపీ చక్రవర్తి గుమ్మి శుక్రవారం వెల్లడించారు. నగరానికి అక్రమ రవాణా అవుతున్న సిగరెట్లలో 23 బ్రాండ్లకు చెందినవి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. సాధారణ సిగరెట్లకు భిన్నమైన ఫ్లేవర్స్‌ కలిగి ఉండే బ్లాక్, గరమ్‌లతో పాటు ఎస్సీ, మోండ్‌ తదితర బ్రాండ్లకు చెందిన సిగరెట్లు వివిధ రూపాల్లో వస్తున్నట్లు తెలిపారు. ఇండోనేషియాలో తయారవుతున్న ఈ సిగరెట్లు అక్కడి నుంచి నేరుగా హైదరాబాద్‌కు చేరుకోవట్లేదు. దుబాయ్‌ మీదుగా ఢిల్లీకి వచ్చి... ఆపై నగరానికి వస్తున్నట్లు అధికారులు వివరిస్తున్నారు. కస్టమ్స్‌ సహా వివిధ విభాగాల కళ్లు గప్పేందుకు సిగరెట్ల పేరుతో కాకుండా వివిధ వస్తువుల పేరుతో ఈ అక్రమ రవాణా  జరుగుతుందన్నారు. ఈ  సిగరెట్లను బేగంబజార్‌కు చెందిన వికాస్‌ కుమార్, కలరామ్‌మాలి అనే వ్యక్తులు తమ వద్ద స్టాక్‌ చేసుకుంటున్నారు. పబ్లిక్, ప్రైవేట్‌ ట్రాన్స్‌పోర్ట్‌ ద్వారా సరఫరా చేస్తూ హోల్‌సేల్‌గా నగర వ్యాప్తంగా ఉన్న రిటైలర్లకు విక్రయిస్తున్నారు.

రాజస్థాన్‌కు చెందిన వీరు 2016లో వ్యాపార నిమిత్తం సిటీకి వలస వచ్చారు. ప్రారంభంలో వక్కలు, స్వీట్‌ మసాలాలు, పాన్‌ షాపు ఉత్పత్తులు విక్రయించారు. ఈ వ్యాపారంలో ఎక్కువ లాభాలు లేకపోవడంతో ఢిల్లీకి చెందిన వ్యక్తులతో ఒప్పందాలు చేసుకుని విదేశీ సిగరెట్ల దందా మొదలెట్టారు. వీరి వ్యవహారాలపై సౌత్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌కు సమాచారం అందడంతో ఇన్‌స్పెక్టర్‌ ఎస్‌.రాఘవేంద్ర నేతృత్వంలో ఎస్సైలు వి.నరేందర్, ఎన్‌.శ్రీశైలం, మహ్మద్‌ థక్రుద్దీన్‌లు తమ బృందంతో శుక్రవారం వీరి సంస్థపై దాడి చేశారు. నిందితులను అదుపులోకి తీసుకుని వారి నుంచి రూ.12 లక్షల విలువైన నిషేధిత సిగరెట్లు స్వాధీనం చేసుకున్నారు. తదుపరి చర్యల నిమిత్తం నిందితులను షాహినాయత్‌గంజ్‌ పోలీసులకు అప్పగించారు. ఆరోగ్యానికి హానికరమైన, స్థానిక వ్యాపారులను నష్టాన్ని తీసుకువచ్చే సిగరెట్ల దిగుమతిని ప్రభుత్వం ప్రోత్సహించట్లేదు. ఈ నేపథ్యంలోనే వీటిపై దిగుమతి సుంకం (కస్టమ్స్‌ డ్యూటీ) భారీగా విధిస్తోంది. 69 నుంచి 90 మిల్లీమీటర్ల పొడవుల్లో ఉండే సిగరెట్లలో ఒక్కో దానికీ ఒక్కో రకమైన డ్యూటీ ఉంటుంది. మొత్తమ్మీద ఒకటికి ఒకటిన్నర శాతం పన్ను విధిస్తారు.

అంటే... రూ.10 ఖరీదైన సిగరెట్‌ను దిగుమతి చేసుకుంటే దానిపై డ్యూటీ రూ.15 చెల్లించాల్సి ఉంటుంది. ఈ రకంగా దాని ఖరీదు రూ.25కు చేరుతుంది. ఈ డ్యూటీని ఎగ్గొట్టడానికే నగరానికి చెందిన ముఠాలు భారీగా అక్రమ రవాణాకు పాల్పడుతున్నాయని టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు చెబుతున్నారు. ఢిల్లీలో ఉన్న ప్రధాన సూత్రధారులతో సంబంధాలు ఏర్పాటు చేసుకునే ఇలాంటి గ్యాంగ్‌లు వాటిని మార్కెట్‌లోకి తరలిస్తున్నాయి. ఈ అక్రమ రవాణా ద్వారా నగరంలోకి వస్తున్న సిగరెట్ల కారణంగా ‘పన్ను పోటు’తో పాటు ప్రజల ఆరోగ్యానికీ చేటు ఉందని పోలీసులు చెప్తున్నారు. ఇండోనేషియా సహా మరికొన్ని దేశాల్లో తయారవుతున్న ఈ సిగరెట్లలో ఏ తరహా పొగాకు వాడుతున్నారనేది స్పష్టంగా వెలుగులోకి రాలేదు. ఆ పొగాకు ఇక్కడి పరిస్థితులకు ఎంత అనుకూలమో చెప్పలేమని అధికారులు అంటున్నారు. నిబంధనల ప్రకారం దిగుమతయ్యే సిగరెట్లను ఆయా పోర్టులు, విమానాశ్రయాల్లో ఉండే కస్టమ్స్‌ హెల్త్‌ ఆఫీసర్లు పరీక్షించి సర్టిఫై చేస్తారని, అక్రమ రవాణాలో ఆ అవకాశం లేకపోడంతో విపణిలోకి వెళ్లిపోతున్నాయని వివరిస్తున్నారు. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ నిర్దేశించిన ప్రమాణాలు లేని ఈ సిగరెట్లు ఆరోగ్యానికి ఎనలేని హాని చేస్తాయని హెచ్చరిస్తున్నారు. వీటితో పాటు ఈ అక్రమ సిగరెట్లపై హెచ్చరిక బొమ్మలు కూడా ఉండవని, ఇలాంటి వాటికి దూరంగా ఉండటమే ఉత్తమమని అధికారులు సూచిస్తున్నారు. 

మరిన్ని వార్తలు