పాక్‌కు సమాచారం: ఇద్దరు ఉద్యోగుల అరెస్టు

8 Jun, 2020 17:47 IST|Sakshi

జైపూర్‌: పాకిస్తాన్‌ గూఢాచర సంస్థ ఐఎస్‌ఐకి భారత సైన్యం సమాచారాన్ని చేరవేస్తున్నారన్న ఆరోపణలతో రాజస్తాన్‌ పోలీసులు ఇద్దరు రక్షణ శాఖ ఉద్యోగులను అరెస్టు చేశారు. వికాస్‌ కుమార్‌(29), చిమన్‌లాల్‌(22)లను సోమవారం అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. రాజస్తాన్‌లోని శ్రీ గంగానగర్‌ సమీపంలో గల ఆర్మీ అమ్యూనిషన్‌(మందుగుండు) విభాగంలో పని చేస్తున్న వికాస్‌ కుమార్‌ను పాకిస్తాన్‌ ఇంటలిజెన్స్‌ విభాగానికి చెందిన ఓ వ్యక్తి అమ్మాయి పేరిట ఫేస్‌బుక్‌లో చాటింగ్‌ చేస్తూ హనీట్రాప్‌ చేసినట్లు పేర్కొన్నారు. ఈ క్రమంలో మిలిటరీ ఇంటలిజెన్స్‌(ఎంఐ) ఆర్బాట్‌(ఆర్డర్‌ ఆఫ్‌ బాటిల్‌; కంపోజిషన్‌ అండ్‌ ఆర్డర్‌ ఆఫ్‌ మిలిటరీ ఫైటింగ్‌ ఇన్ఫర్మేషన్‌)కు చెందిన సున్నితమైన సమాచారాన్ని అతడు చేరవేసినట్లు అనుమానిస్తున్నారు. మందుగుండు పరిమాణం, ఫొటోలు, రవాణా, ఫైరింగ్‌ ప్రాక్టీసుకు ఎంతమేర ఉపయోగిస్తున్నారు తదితర వివరాలను శత్రుదేశ గూఢాచారులకు వెల్లడించినట్లు పేర్కొన్నారు. 

ఈ క్రమంలో అతడి అకౌంట్‌లోకి మూడు విడతల్లో పెద్ద మొత్తంలో(రూ. 75 వేలు) డబ్బు జమ అయినట్లు తెలిపారు. వికాస్‌ కుమార్‌ కదలికలపై నిఘా వేసిన లక్నో ఎంఐ జనవరిలో ఈ సమాచారాన్ని యూపీ యాంటీ టెర్రరిజం స్వ్కాడ్‌కు అందించింది. దీంతో రంగంలోకి దిగిన ఏటీఎస్‌.. ‘డిజర్ట్‌ ఛేజ్‌’పేరిట ఆపరేషన్‌ చేపట్టి అతడి వ్యవహారంపై నిఘా వేసింది. ఈ నేపథ్యంలో రాజస్తాన్‌ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సోమవారం వికాస్‌ను అరెస్టు చేసినట్లు సమాచారం. 

ఈ క్రమంలో వికాస్‌కు సహకరించిన చిమన్‌లాల్‌ను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.  బికనీర్‌లోని ఆర్మీ మహాజన్‌ ఫీల్డ్‌ ఫైరింగ్‌ రేంజ్‌(ఎన్‌ఎఫ్‌ఎఫ్‌ఆర్‌)లో పనిచేసే చమన్‌ లాల్‌.. వికాస్‌ కలిసి సున్మితమైన సమాచారాన్ని చేరవేసినట్లు వెల్లడించారు. విచారణలో భాగంగా వికాస్‌ కుమార్‌ నేరాన్ని అంగీకరించాడని తెలిపారు. చమన్‌ లాల్‌ నుంచి ఆర్మీ యూనిట్ల సమాచారం సేకరించి.. అనౌష్క చోప్రా అనే అమ్మాయి సూచన మేరకు వివిధ వాట్సాప్‌ గ్రూపుల్లో జాయిన్‌ అయ్యానని తెలిపినట్లు వెల్లడించారు.    

మరిన్ని వార్తలు