పాఠశాల విద్యార్థుల మధ్య ఘర్షణ

3 Feb, 2019 02:45 IST|Sakshi
ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సురేష్‌ , దాడిలో గాయపడ్డ గణేష్‌

బీరు సీసాతో దాడి 

ఇద్దరి విద్యార్థులకు తీవ్ర గాయాలు 

హైదరాబాద్‌: పాఠశాల విద్యార్థుల మధ్య జరిగిన ఘర్షణలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డ సంఘటన మీర్‌పేట పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. సంఘటన ప్రకారం... జిల్లెలగూడలోని చల్లా లింగారెడ్డి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సురేష్, గణేష్, ప్రభులు 10వ తరగతి చదువుతున్నారు. సహ విద్యార్థినిని ప్రభు గత కొంత కాలంగా ప్రేమిస్తున్నాడు. సురేష్‌ ఆమెతో చనువుగా ఉండటాన్ని చూసిన ప్రభు పలుమార్లు అతనిని హెచ్చరించాడు. అయినా సురేష్‌ ఆమెతో చనువుగా ఉంటుండటంతో ఆగ్రహానికి గురైన ప్రభు శనివారం ఉదయం 11 గంటలకు పాఠశాల విరామ సమయంలో బయటకు వచ్చిన సురేష్‌తో తన తోటి స్నేహితులతో కలిసి వాగ్వావాదానికి దిగాడు.

ఇరువురి మధ్య మాటా.. మాట పెరగడంతో కోపోద్రిక్తుడైన ప్రభు పక్కనే ఉన్న బీరుసీసాను పగులగొట్టి సురేష్‌పై దాడి చేశాడు. దీంతో సురేష్‌కు వీపు కింది భాగంలో గాయమైంది. అడ్డుకోబోయిన మరో విద్యార్థి గణేష్‌పై కూడా దాడి చేయడంతో అతనికి మెడ భాగంలో గాయమైంది. దీంతో అక్కడే ఉన్న స్థానికులు గమనించి దగ్గరకు వెళ్లగా ప్రభు, అతని స్నేహితులు అక్కడి నుంచి పారిపోయారు. గాయపడ్డ సురేష్, గణేష్‌లు వెంటనే మీర్‌పేట పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేయగా వారిని చికిత్స నిమిత్తం పోలీసులు  మందమల్లమ్మ చౌరస్తాలోని ఆర్‌కెమల్టీస్పెషాలిటీ ఆసుపత్రికి తరలించారు. 

కౌన్సెలింగ్‌ ఇచ్చి పంపించాం: విద్యార్థుల మధ్య అహం దెబ్బతినడంతో పాటు, డబ్బుల విషయంలో ఘర్షణ జరిగిందని, ప్రేమ వ్యవహారమేమీ లేదని మీర్‌పేట పోలీసులు అంటున్నారు. ఈ ఘర్షణలో ఇద్దరు గాయపడగా దాడికి పాల్పడిన మరో ఇద్దరిని అదుపులోకి తీసుకుని కౌన్సెలింగ్‌ ఇచ్చి పంపించామని పోలీసులు తెలిపారు. వేర్వేరు సెక్షన్‌లు కావడంతో తరచూ వీరి మధ్య అహం దెబ్బతిని గొడవకు దారితీసిందని పోలీసులు అంటున్నారు.  

మరిన్ని వార్తలు