భగ్గుమన్న అలర్లు.. కాల్పుల్లో ఇద్దరు మృతి

20 Jun, 2019 17:38 IST|Sakshi

బెంగాల్‌ భట్‌పరాలో ఇరువర్గాల మధ్య ఘర్షణ

కోల్‌కతా : పశ్చిమ బెంగాల్‌లో మళ్లీ అల్లర్లు చెలరేగాయి. కోల్‌కతాకు 30 కిలోమీటర్ల దూరంలోని భట్‌పరా ప్రాంతంలో ఇరువర్గాల మధ్య ఒక్కసారిగా ఘర్షణలు జరిగాయి. ఈ సందర్భంగా పోలీసులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు చనిపోగా, నలుగురు గాయపడ్డారు.  

ఇరువర్గాలు పరస్పరం నాటుబాంబులు, తుపాకులతో దాడులకు దిగారు. దీంతో ఇక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. రంగంలోకి దిగిన పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు కాల్పులు జరపాల్సి వచ్చింది. గురువారం ఉదయం 10.30 గంటలకు మొదలైన ఘర్షణలతో ఈ ప్రాంతమంతా నిర్మానుష్యంగా మారింది. రోడ్లన్నీ ఖాళీగా మారిపోయాయి. దుకాణాలు మూతపడ్డాయి. పోలీసుల కాల్పుల్లో రాంబాబు సాహు అనే చిరు దుకాణదారుడు ప్రాణాలు కోల్పోయాడు. పోలీసుల తూటా వచ్చి తలకు తగలడంతో అతను ప్రాణాలు విడిచాడని అతని బంధువు తెలిపారు. మరోవైపు ఈ ఘర్షణలకు మమతా బెనర్జీ ప్రభుత్వమే కారణమని, లోక్‌సభ ఎన్నికల్లో ఓటమితో మమత మానసిక​ స్థిరత్వం కోల్పోయారని, అందుకే రాష్ట్రమంతటా అల్లర్లు జరుగుతున్నాయని బీజేపీ మండిపడుతోంది.
 

మరిన్ని వార్తలు