ఆన్‌లైన్‌ గేమ్‌లకు బానిసైన మైనర్‌; తండ్రికే టోపి

6 Sep, 2019 17:34 IST|Sakshi

లక్నో : ఆన్‌లైన్‌ గేమ్‌లకు అలవాటు పడ్డ ఓ మైనర్‌ బాలుడు తండ్రి బ్యాంక్‌ నుంచి డబ్బులు కాజేయడం ప్రారంభించాడు. దీనికోసం తండ్రి ఫోన్‌లోని పేటీఎమ్‌ నుంచి ఈ తతంగాన్నినడిపించాడు. ఈ క్రమంలో తన అకౌంట్‌లో డబ్బులు మాయం అవడాన్ని గమనించిన తండ్రి సైబర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసుల దర్యాప్తులో సొంత కుమారుడే డబ్బులు కాజేశాడని తేలడంతో ఆ తండ్రి షాక్‌కు గురయ్యాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో చోటుచేసుకుంది. 

పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. లక్నోలో నాలుగో తరగతి చదువుతున్న ఓ బాలుడు చిన్నతనం నుంచే ఆన్‌లైన్‌ గేమ్‌లు ఆడటం ప్రారంభించాడు. తర్వాత అదే ఆటలకు బానిసైన ఆ మైనర్‌ డబ్బుల కోసం తండ్రికే ఎసరు పెట్టాడు. సాధారణంగా అనేక ఆన్‌లైన్‌ గేమ్‌లను డౌన్‌లోడ్‌ చేసుకోవడం కోసం ఆన్‌లైన్‌ చెల్లింపులు తప్పనిసరి. దీంతో ఆ బాలుడు డబ్బుల కోసం తండ్రి మొబైల్‌లో పేటీఎమ్‌ యాప్‌ను ఇన్‌స్టాల్‌ చేసి దానికి బ్యాంక్‌ అకౌంట్‌ను జతపరిచాడు. ఇదంతా 2018 డిసెంబర్‌లోనే ప్రారంభించి, తండ్రికి అనుమానం కలగకుండా రహస్యంగా ఉంచాడు. అంతేగాక పేటీఎమ్‌ వాలెట్‌లో డబ్బులు అయిపోయినప్పుడల్లా మళ్లీ బ్యాంక్‌ ఖాతా నుంచి డబ్బులు బదిలీ చేసి మరీ గేమ్‌లు ఆడేవాడు. ఈ నేపథ్యంలో సంవత్సరంలో దాదాపు 35 వేల రూపాయలను గేమ్‌లపై వెచ్చించాడు.  

తన అకౌంట్‌ను నుంచి డబ్బులు మాయమవుతుండాన్ని గమనించిన తండ్రి సైబర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు ప్రాథమిక విచారణలో.. డబ్బులు బదిలీ అయిన ఫోన్‌ నంబర్‌ తనదే అని చెప్పడంతో తండ్రి ఆశ్చర్యానికి గురయ్యాడు. దర్యాప్తును వేగవంతం చేసిన పోలీసులు వేరే దారి లేక అనుమానం వచ్చి తన కొడుకును విచారించగా వాస్తవాలు బహిర్గతమయ్యాయి. పిల్లవాడు తానే నేరం చేసినట్లు ఒప్పుకున్నాడు. అనంతరం సైబర్‌ పోలీసు సిబ్బంది బాలుడికి కౌన్సెలింగ్‌ ఇప్పించి ఇంటికి పంపించారు.

మరిన్ని వార్తలు