వేశ్య దగ్గరికి వెళ్లి ఓ మంచి పని చేశాడు

10 Aug, 2019 09:54 IST|Sakshi

అక్కడికి వెళ్లాలనుకోవడం తప్పే.. కానీ వెళ్లి మంచి పని చేశాడు
సుఖం కోసం వెళ్లి.. ఆమె బాధను చెరిపేశాడు
మోసపోయి వ్యభిచార కూపంలో చిక్కుకున్న ఆమెకు విముక్తిని కల్పించాడు

సాక్షి, న్యూఢిల్లీ :  ఏ స్త్రీ వ్యభిచారం చేయాలనుకోదు. అలాగే వేశ్య వృత్తి కొనసాగించాలని కూడా ఎవరు అనుకోరు. ఇష్టపడి ఈ వృత్తిలోకి వచ్చేవాళ్లు చాలా అరుదనే చెప్పాలి. స్త్రీలను బలవంతంగా ఎత్తుకొచ్చి ఈ వృత్తిలోకి తోస్తారు లేదా ఏ తోడు లేక  జీవనం కోసం ఏమి చేయాలో తెలియక ఇందులోకి వస్తారు. ప్రతి వేశ్య వెనక ఒక చీకటి బాధాకరమైన కథ తప్పక ఉంటుంది. అయితే వారి వద్దకు వెళ్లే కస్టమర్లు సుఖాన్ని కోరుకుంటారే తప్ప వారి బాధల్ని పట్టించుకోరు. కానీ ఓ వ్యక్తి ఆమె బాధను అర్థం చేసుకున్నాడు. ఆ స్త్రీ వేశ్యగా మారడానికి గల కారణాలు తెలుసుకొని చలించిపోయాడు. ఎలాగైనా ఆమెను ఆ ఊబినుంచి రక్షించాలని నిర్ణయించుకున్నాడు. ఆమె వద్ద నుంచి కుటుంబ సభ్యుల వివరాలు తెలుసుకొని వారికి సమాచారం ఇచ్చారు. చివరకు ఆమెకు విముక్తి కల్పించాడు. ఇదంతా దేశ రాజధాని ఢిల్లీలోని జీపీరోడ్‌లో జరిగింది. 

మోసపోయి వేశ్యగా..
కోల్‌కతాకు చెందిన ఓ 27 ఏళ్ల మహిళ ప్రైవేట్‌ ఉద్యోగం చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. వచ్చే జీతం ఇంటి ఖర్చులకు సరిపోవడం లేదు. మరో మంచి ఉద్యోగం కోసం ఆమె వెతుకుతోంది. అంతలోనే ఆమెకు పరిచయమైన ఓ మహిళ ఢిల్లీలో మంచి ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మపలికింది. ఆమె మాటలు నమ్మి జూన్‌ 8న ఢిల్లీకి వెళ్లింది. ఉద్యోగం ఇప్పిస్తుందనే ఆశతో ఆమె చెప్పిన ప్రాంతానికి వెళ్లింది. అక్కడికి వెళ్లాక తెలిసింది సదరు మహిళ ఆమెను మోసం చేసిందని. ఓ వ్యభిచార ముఠా చేతికి చిక్కిన ఆమె.. రెండు నెలలపాటు నరకం చూసింది. ఆమె దగ్గర ఉన్న డబ్బులు, మొబైల్ ఫోన్‌ తీసుకొని బందించారు. చిత్రహింసలకు గురిచేశారు. వచ్చిన కస్టమర్లను సుఖపెట్టకుంటే హింసించేవారు. ఇక తన బతుకు ఇంతే అనుకొని అలా శవంగా జీవిస్తోంది. ఇదిలా ఉండగా ఇటీవల ఆమె వద్దకు కోల్‌కతా కస్టమర్‌ వచ్చాడు. అందరిలాగే అతను ఆమె సుఖాన్ని కోరుకోకుండా బాధను పంచుకున్నాడు. ఆమె వేశ్యగా మారడానికి గల కారణాలు తెలుసుకొని చలించిపోయాడు.  ఆమె సోదరుడికి ఫోన్‌ చేసి విషయం చెప్పాడు. 

కస్టమర్‌గా వెళ్లిన సోదరుడు
అజ్ఞాత వ్యక్తి నుంచి ఫోన్‌ రావడంతో మహిళ సోదరుడు ఢిల్లీకి వెళ్లి అతన్ని కలిశాడు. వివరాలు తెలుసుకొని... నిర్థారించుకోవడానికి కస్టమర్‌గా వేశ్య గృహానికి వెళ్లాడు. అక్కడ తన సోదరిని చూసి చలించిపోయాడు. బయటకు వచ్చి ఢిల్లీ మహిళా కమిషన్‌కు సమాచారం ఇచ్చాడు. కేసు ఫిర్యాదు చేసుకున్న ఢిల్లీ పోలీసులు పథకం ప్రకారం దాడి చేసి వ్యభిచార ముఠాను అరెస్ట్‌ చేశారు. బందీగా ఉన్న మహిళకు విముక్తి కల్పించారు. ఉద్యోగం పేరిట మోసం చేసిన మహిళపై కేసు నమోదు చేశారు. చేసింది తప్పే అయినా ఆ కస్టమర్‌ ఓ మహిళను రక్షించి మంచి పని చేశాడు.

మరిన్ని వార్తలు