సిబ్బందిపై పాశవిక దాడి

26 Jun, 2020 12:02 IST|Sakshi
బాధితుడు సంపత్‌ ,భానుచందర్‌ ఒంటిపై గాయాలు

వస్త్ర దుకాణ యాజమాన్యం నిర్వాకం

కుషాయిగూడ: లెక్కల్లో తేడా జరిగిందన్న అనుమానంతో ఓ వస్త్ర షోరూం యాజమాన్యం ఇద్దరు ఉద్యోగులపై దాడికి పాల్పడింది. ఈ సంఘటన గురువారం కుషాయిగూడ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో వెలుగుచూసింది. బాధితులు తెలిపిన మేరకు.. ఉప్పల్‌కు చెందిన గౌర సంపత్‌ ఫ్లోర్‌ ఇంచార్జిగా, బానచందర్‌ క్యాషియర్‌గా కొన్ని  సంవత్సరాలుగా ఉప్పల్‌లోని అనుటెక్స్‌లో షోరూంలో పనిచేస్తున్నారు. అయితే లెక్కల్లో తేడాలున్నాయని అనుమానించిన యాజమాన్యం ఈ నెల 20న ఏఎస్‌రావునగర్‌ అనుటెక్స్‌ షోరూంకు పిలిపించారు. బాధితులు అక్కడికి వెళ్లగానే అప్పటికే అక్కడ ఉన్న బౌన్సర్లు బాధితుల నుంచి  సెల్‌ఫోన్లు, పర్స్‌లను లాక్కొని చీకటి గదిలోకి తీసుకెళ్లి  డిస్కౌంట్ల పేరుతో అవినీతికి పాల్పడుతారా అంటు దాడికి పాల్పడ్డారు.

కర్రలు, ఇనుపరాడ్లు, చెక్కలతో విచక్షణ రహితంగా దాడిచేశారు. బౌన్సర్లతో పాటుతా అనుటెక్స్‌ ఎండీలు పులవర్తి నాగేశ్వరరావు, రాజశేఖర్, రామకృష్ణారావులు దాడికి పాల్పడ్డారని బాధితులు ఆరోపించారు.  తమ క్రెడిట్, డెబీట్‌ కార్డుల నుంచి సుమారు 2.5 లక్షలు కూడా డ్రా చేసుకున్నట్లు ఆరోపించారు.   అంతేకాక పోలీస్‌స్టేషన్‌కు తీసుకువెళ్లి కేసునమోదు చేయాలని పోలీసులను కోరారన్నారు. అయితేపోలీసులు మందలించగా వెనక్కు తగ్గారన్నారు. అక్కడే వారిని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించి వెళ్లిపోయారు. తరువాత బాధితులు కుషాయిగూడ పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై ఇన్‌స్పెక్టర్‌ మన్‌మోహన్‌ మాట్లాడుతూ.. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నామన్నారు. బాధ్యులైన పులవర్తి నగేశ్, పులవర్తి రాజు, పులవర్తి రామకృష్ణ, పులవర్తి శ్రీనివాస్, ఉప్పల సంతోష్‌లపైకేసు నమోదు చేశామన్నారు.

మరిన్ని వార్తలు