సీఎం రిలీఫ్‌ ఫండ్‌ చెక్కు బౌన్స్‌

21 Apr, 2019 04:09 IST|Sakshi
ఫండ్స్‌లేవని బ్యాంక్‌ అధికారులు ఇచ్చిన లేఖ

కర్నూలు (గాయత్రీ ఎస్టేట్‌): ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎం రిలీఫ్‌ ఫండ్‌) అంటే ఆషామాషీ కాదు. ప్రభుత్వానికి సంబంధించి ఏ విభాగంలో అయినా నిధుల కొరత ఉండొచ్చేమో కానీ.. సీఎం సహాయ నిధి పద్దులో మాత్రం కొరత ఉండదు. ఇది అత్యవసర పద్దు కిందకు వస్తుంది. టీడీపీ సర్కారు పుణ్యమాని ప్రస్తుతం ఆ పద్దులోనూ నిధులు ఖాళీ అయ్యాయి. ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు ఈ పద్దును సైతం ఖాళీ చేసి నిధులను ఇతర పథకాలకు మళ్లించారు. ఫలితంగా అనారోగ్యం బారినపడిన వారికి మంజూరు చేసిన సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులు బౌన్స్‌ అవుతున్నాయి. ఎన్నికల ముందు లబ్ధిదారులకు సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులు ఇవ్వగా.. ఆ పద్దులో సొమ్ము లేకపోవడంతో బ్యాంకర్లు తిప్పి పంపిస్తున్నారు. తాజాగా, కర్నూలు జిల్లా పాణ్యం నియోజకవర్గ పరిధిలోని నాగిరెడ్డి రెవెన్యూ కాలనీకి చెందిన జ్యోతి పేరిట ఇచ్చిన సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కును ‘ఇన్‌సఫీషియంట్‌ ఫండ్స్‌’ అని పేర్కొంటూ బ్యాంక్‌ అధికారులు వెనక్కి ఇచ్చారు.

వివరాల్లోకి వెళితే.. రెవెన్యూ కాలనీకి చెందిన గంగాధర్‌రెడ్డి భార్య జ్యోతికి 2018 నవంబర్‌లో తీవ్ర కడుపు నొప్పి రావటంతో కర్నూలులోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చేర్పించారు. వైద్యులు ఆమెకు అత్యవసరంగా ఆపరేషన్‌ చేయించాలని సూచించారు. ఆ కుటుంబానికి ఆరోగ్యశ్రీ సదుపాయం లేకపోవడంతో అప్పు తెచ్చి ఆపరేషన్‌ చేయించారు. మొత్తంగా రూ.56 వేలు ఖర్చయ్యింది. సహాయం కోసం పాణ్యం టీడీపీ ఇన్‌చార్జి ఏరాసు ప్రతాప్‌రెడ్డి ద్వారా నవంబర్‌ 26న సీఎం రిలీఫ్‌ ఫండ్‌కు దరఖాస్తు చేసుకున్నారు. రూ.26,920 మంజూరు చేస్తున్నట్టు ఈ ఏడాది మార్చి 15న సమాచారం వచ్చింది. ఎన్నికల పోలింగ్‌కు రెండు రోజుల ముందు ఏప్రిల్‌ 9వ తేదీన ఏరాసు ప్రతాప్‌రెడ్డి బాధిత కుటుంబానికి సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కును అందించారు. 10వ తేదీన చెక్కును బ్యాంక్‌లో సమర్పించగా.. 15వ తేదీన ఆ పద్దులో నిధులు లేవని బ్యాంక్‌ అధికారులు లిఖిత పూర్వకంగా సమాచారం ఇచ్చారు. 

సీఎంఆర్‌ఎఫ్‌లో నిధులు లేకపోవటమా..
సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కు తీసుకుని బ్యాంక్‌కు వెళితే నిధులు లేవన్నారు. ఆపరేషన్‌ కోసం అప్పు చేశాం. రిలీఫ్‌ ఫండ్‌ నుంచి రూ.26,920 మంజూరవటంతో కొంతలో కొంతైనా అప్పు తీరుతుందని భావించాం. ఆ ఖాతాలో డబ్బులు లేవని చెప్పడం చూస్తే పేద, మధ్య తరగతి జనాలను పట్టించుకోవటం లేదని అర్థమవుతోంది. ఎన్నికల్లో ఓటు వేస్తారనే ఉద్దేశంతో పోలింగ్‌కు రెండు రోజుల ముందు చెక్కు ఇచ్చారు.     – జ్యోతి,  గంగాధరరెడ్డి దంపతులు 

మరిన్ని వార్తలు