అతనేం జైరాను వేధించలేదు : ప్రత్యక్ష సాక్షి

14 Dec, 2017 10:44 IST|Sakshi

సాక్షి, సినిమా :  బాలీవుడ్‌ నటి జైరా వసీమ్‌ లైంగిక వేధింపుల కేసు మరో మలుపు తీసుకుంది. ఢిల్లీ నుంచి ముంబై వస్తున్న విస్తారా ఎయిర్‌లైన్స్‌ విమానంలో ఆమెపై ముంబైకి చెందని ఓ వ్యక్తి వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే తోటి ప్రయాణికుడు ఒకరు పోలీసులకు ఇచ్చిన స్టేట్‌మెంట్‌లో నిందితుడు జైరాను వేధించలేదని పేర్కొనటం విశేషం. ఈ మేరకు నిందితుడు వికాస్‌ సచ్‌దేవ్‌ తరపు న్యాయవాది హెచ్‌ ఎస్‌ ఆనంద్‌ బుధవారం కోర్టులో వాదనలు వినిపించారు. 

‘‘నేను అదే విమానంలో ప్రయాణించా. వారికి సమీపానే నేను కూర్చుని ఉన్నా. అతను సీటుపై కాలుపెట్టిన మాట వాస్తవం. అయితే ఫ్లైట్‌ టేకాఫ్‌ తీసుకున్నాక కూడా అతను కాలును అలాగే ఉంచాడు. అతనేం లైంగిక వేధింపులకు పాల్పడలేదు. ముంబైలో విమానం ల్యాండ్‌ అయ్యాక ఆమె అతనిపై గట్టిగా అరిచింది. వెంటనే కాలు పెట్టినందుకు అతను క్షమాపణలు కూడా తెలియజేశాడు. వివాదం అంతటితో సర్దుమణిగింది కూడా’’ అని చతుర్వేది అనే ప్రయాణికుడు ముంబై పోలీసులకు స్టేట్‌మెంట్ ఇచ్చాడు. 

దీనిని ఆధారంగా చేసుకుని అతనికి బెయిల్‌ మంజూరు చేయాలని న్యాయవాది ఆనంద్‌ జడ్జిని కోరారు. అయితే మరికొందరు ప్రయాణికులతోపాటు, బాధితురాలి స్టేట్‌మెంట్‌ను(సీఆర్‌పీసీ 164 సెక్షన్‌ ప్రకారం) ఇంకా రికార్డు చేయని పక్షంలో అతన్ని కస్టడీకి అనుమతించాలని పోలీసులు న్యాయమూర్తిని అభ్యర్థించారు. కానీ, నిందితుడు జమ్ము కశ్మీర్‌కు చెందిన వ్యక్తని.. అతనికి సీఆర్‌పీసీ వర్తించని అతని తరపున న్యాయవాది వాదన వినిపించగా.. దానిని కోర్టు తోసిపుచ్చింది. చివరకు అతనిని డిసెంబర్‌   22వరకు జ్యుడీషియల్‌ కస్టడీకి అనుమతిస్తూ జడ్జి తీర్పునిచ్చారు. అయితే సచ్‌దేవ్‌ బెయిల్‌ కోసం దరఖాస్తు చేసుకోగా.. దానిపై విచారణను 15వ తేదీకి వాయిదా వేశారు. 

బాలీవుడ్‌లో పెరిగిపోతున్న మద్దతు.. 

కాగా, నటి జైరా వసీమ్‌కు మద్దతు పెరిగిపోతూ వస్తోంది. పలువురు బాలీవుడ్ నటులు ఇప్పటికే ఆమెకు మద్దతుగా ట్వీట్లు చేయగా.. తాజాగా అమీర్‌ఖాన్‌ భార్య కిరణ్‌, నటి కంగనా రనౌత్‌ స్పందించారు. జైరా స్థానంలో తాను ఉండి ఉంటే అతని కాళ్లు విరగొట్టి ఉండేదానినని కంగనా వ్యాఖ్యానించారు. మరోవైపు క్రికెటర్‌ విరాట్‌ కోహ్లి కూడా ఘటనను తీవ్రంగా ఖండించారు.

మరిన్ని వార్తలు