కొలంబియా నుంచి కొకైన్‌

2 May, 2019 02:55 IST|Sakshi
పోలీసుల అదుపులో జాన్‌ పాల్‌ ఒనెబూచి (ఫైల్‌ ఫొటో)

ఓడల్లో ప్రాదేశిక జలాల వరకు తరలింపు

అక్కడ నుంచి నాటు పడవల్లో ముంబైకి గోవా కేంద్రంగా సాగుతున్న దందా

పోలీసు దర్యాప్తులో కీలకాంశాలు వెలుగులోకి..

సాక్షి, హైదరాబాద్‌: భారత్‌కు సరఫరా అవుతున్న కొకైన్‌ మాదకద్రవ్యం ఆఫ్రికా దేశమైన కొలంబియా నుంచి వస్తోంది. భారీ ఓడల్లో ప్రాదేశిక జలాల వరకు తీసుకువస్తున్న స్మగ్లర్లు అక్కడ నుంచి నాటు పడవల్ని ఆశ్రయిస్తున్నారు. ముంబై, గోవాల కేంద్రంగా దందా చేస్తున్న వారిలో అత్యధికులు నైజీరియన్లే ఉంటున్నారు. పోలీసు నిఘాకు చిక్కకుండా, డిపోర్టేషన్‌కు ఆస్కారం లేకుండా అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. హైదరాబాద్‌లో డ్రగ్స్‌ విక్రయిస్తున్న నైజీరియన్‌ జాన్‌ పాల్‌ ఒనెబూచి అలియాస్‌ యుగోచుకువను వెస్ట్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు గత వారం అదుపులోకి తీసుకున్నారు.

భారీగా పెరిగిన సాగు
కొకైన్‌ను కోకా మొక్కల నుంచి తయారు చేస్తారు. ఈ మొక్కల సాగులో కొలంబియా ప్రపంచంలోనే టాప్‌. ప్రపంచవ్యాప్తంగా సరఫరా అవుతున్న కొకైన్‌లో 85 శాతం ఇక్కడే ఉత్పత్తి అవుతోంది. అక్కడ కోకా మొక్కల సాగు విస్తీర్ణం ఏడాదిలో లక్ష ఎకరాలకు పైగా పెరిగింది. 2016లో ఈ విస్తీర్ణం 4,64,558 ఎకరాలుగా ఉండగా.. 2017 నాటికి ఇది 5,16,450 ఎకరాలకు పెరిగిందని లెక్కలు చెబుతున్నాయి. కొలంబియా నుంచి కొకైన్‌ను ఓడల్లో ఇతర దేశాలకు తరలిస్తుంటారు. భారత్‌ విషయానికి వస్తే భారీ ఓడల్లో ముంబై తీరానికి 12 నాటికల్‌ మైళ్ల వరకు (22.2 కిమీ) తీసుకొస్తారు. అక్కడి వరకు అంతర్జాతీయ జలాలే అయినా.. ఆపై దేశ ప్రాదేశిక జలాలు మొదలవుతాయి. ఇక్కడ కోస్ట్‌గార్డ్‌ నిఘా ఉంటుంది. దీనికోసం అంతర్జాతీయ జలాల్లోనే ఓడల్ని ఆపేసి అనువైన ప్రాంతంలో డ్రగ్‌ పార్శిల్స్‌ను నాటు పడవల్లోకి ఎక్కిస్తారు. అంతర్జాతీయ, ప్రాదేశిక జలాల్లోకి మారుతూ ఎవరి కంటా పడకుండా ముంబై, గోవా తీరాలకు నాటు పడవల్ని తీసుకొస్తున్నారు. ఇలా తీరానికి చేరుకున్న మాదకద్రవ్యం హోల్‌సేల్‌గా ప్రధాన స్మగ్లర్ల చేతికి చేరుతుంది. వారి నుంచి రిటైల్‌గా విక్రయించే పెడ్లర్లు కొనుక్కొని దేశంలోని ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు.

చిక్కితే చిరునామా మారుతుంది
మాదకద్రవ్యాలకు సంబంధించిన కేసుల్లో అరెస్టయిన నైజీరియన్లు తమ ఉనికి బయటపడకుండా, పోలీసు నిఘా ఉండకుండా ఉండేందుకు పక్కా పథకం ప్రకారం వ్యవహరిస్తున్నారు. ఒనెబూచి ఉదంతమే దీనికి తాజా ఉదాహరణగా చెప్పుకోవచ్చు. నైజీరియాలోని లాగోస్‌ నుంచి 2008లో వచ్చిన ఇతడు కేరళలో స్థిరపడ్డాడు. 2015లో హైదరాబాద్‌కు మకాం మార్చి పెడ్లర్‌గా మారాడు. గోవాలో అరెస్టయ్యాక జైలు నుంచి బయటకొచ్చిన ఒనెబూచి హైదరాబాద్‌లో టోలిచౌకి నుంచి జవహర్‌నగర్‌కు మకాం మార్చాడు. 2016లో ఎల్బీనగర్‌ పోలీసులు మరోసారి అరెస్టు చేసి జైలుకు పంపారు. ఈసారి జైలు నుంచి బయటకు రాగానే బంజారాహిల్స్‌ రోడ్‌ నెం.12లోని సయ్యద్‌నగర్‌కు మకాం మార్చాడు. తాజాగా వెస్ట్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌కు అక్కడే చిక్కాడు. దాదాపు ప్రతి పెడ్లర్‌ కూడా ఇలా తరచూ మకాం మారుస్తుండటంతో నిఘా కష్టమవుతోందని పోలీసులు చెబుతున్నారు.

అంతా ఒకచోట పెట్టకుండా..
హోల్‌సేలర్ల నుంచి 50 నుంచి 100 గ్రాముల చొప్పున ఖరీదు చేస్తున్న పెడ్లర్లు దాన్ని భద్రపరిచే విషయంలోనూ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ మొత్తం ఒకే చోటనో, తమ దగ్గరో ఉంచితే పోలీసులకు చిక్కితే మొత్తం నష్టపోవాల్సి వస్తుందని నాలుగైదు భాగాలుగా చేస్తున్నారు. వాటిని వేర్వేరు ప్రాం తాల్లో, స్నేహితుల వద్ద ఉంచుతున్నారు. కొద్దికొద్దిగా తీసుకొచ్చి వినియోగదారులకు విక్రయిస్తున్నారు. దీ నికి తోడు ఇంత మొత్తం డ్రగ్‌తో అరెస్టు అయితే జైలు నుంచి వచ్చాక తమ దేశాలకు బలవంతంగా తిప్పి పంపుతారనే (డిపోర్టేషన్‌) భయం పెడ్లర్స్‌లో ఉం టోంది. దీంతో ఒకే వ్యక్తికి 3 గ్రాములు మించి అమ్మకుండా, ఒకేసారి ముగ్గురు కంటే ఎక్కువ మంది కస్టమర్లకు అందించకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నా రు. అందువల్లే ఇటీవల పోలీసులకు చిక్కిన పెడ్లర్స్‌ లో ఎవరి వద్దా భారీ మొత్తంలో డ్రగ్‌ రికవరీ కాలేదు. 

మరిన్ని వార్తలు