-

నిందితుడి దస్తూరి నమూనాల సేకరణ

15 Nov, 2018 04:55 IST|Sakshi

     మేజిస్ట్రేట్‌ సమక్షంలో పరిశీలన

     వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై హత్యాయత్నం కేసు

విశాఖ క్రైం/అల్లిపురం: ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై హత్యాయత్నం కేసులో నిందితుడు జనుపల్లి శ్రీనివాసరావును దస్తూరి నమూనాలను పోలీసులు బుధవారం సేకరించారు.  న్యాయస్థానం ఆదేశాల మేరకు అతన్ని విశాఖ మూడో మెట్రోపాలిటన్‌ మేజిస్ట్రేట్‌ ఎదుట బుధవారం  హాజరుపర్చారు. జగన్‌పై హత్యాయత్నం జరిగిన సమయంలో నిందితుని జేబులో 11 పేజీల లేఖ ఉందని పోలీసులు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ లేఖలో ఎనిమిది పేజీలు తన సోదరి విజయదుర్గతోనూ, రెండు పేజీలు స్నేహితుడు రేవపతిపతితో రాయించాడని, చివరి పేజీలో మాత్రం స్వహస్తాలతో రాసి చంటి అని సంతకం చేసి పక్కనే తన చిరునామా రాసినట్టు  పోలీసులు చెబుతున్నారు.

ఈ లేఖలో దస్తూరిని విజయ దుర్గ, రేపతిపతి దస్తూరితో పోలీసులు సరిపోల్చారు. వారి దస్తూరిలతో పాటు నిందితుడి దస్తూరిని, లేఖని కూడా ఫోరెన్సిక్‌ సైన్స్‌ ల్యాబరేటరీ (ఎఫ్‌ఎస్‌ఎల్‌)కి పంపేందుకు అనుమతి కోరుతూ ఆరురోజుల కస్టడీ ముగిసిన తర్వాత కోర్టులో సిట్‌ అధికారులు పిటిషన్‌ వేశారు. ఈ పిటిషన్‌పై విచారణలో భాగంగా బుధవారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో నిందితుడ్ని సెంట్రల్‌ జైలు నుంచి కోర్టుకు తీసుకొచ్చారు. మూడో మెట్రోపాలిటిన్‌ మేజిస్ట్రేట్‌ సమక్షంలో నిందితుని దస్తూరిని సేకరించారు. చివరి పేజీలో నిందితుడు రాసినట్టుగా చెబుతున్న విషయాలనే మేజిస్ట్రేట్‌ సమక్షంలోనే ఎనిమిది పేజీల్లో రాయించి ప్రతి పేజీ కింద అతని సంతకాలను తీసుకున్నారు.  

మరిన్ని వార్తలు