షాకింగ్‌ నిజాలు వెల్లడించిన కమెడియన్‌!

18 Jul, 2018 20:42 IST|Sakshi

సాక్షి, తిరుపతి : ఎర్రచందనం అక్రమ రవాణా చేసిన కేసుల్లో జబర్దస్త్‌ షోలో కమెడియన్‌గా నటించిన శ్రీహరి(హరిబాబు) మంగళవారం టాస్క్‌ఫోర్స్‌ ఐజీ కాంతారావు ఎదుట లొంగిపోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేసుకు సంబంధించి పలు విషయాలను శ్రీహరి వెల్లడించాడు. తొలుత తాను ప్రభుత్వ ఉద్యోగినని చెప్పిన నటుడు ఆపై జల్సాలకు అలవాటుపడి భారీ మొత్తాల్లో అప్పు చేసి జాబ్‌ మానేసినట్లు తెలిపాడు. టాస్క్‌ఫోర్స్‌ అధికారులు తీసిన ఈ వీడియో వైరల్‌గా మారింది. వాటిని తీర్చేందుకు చాలా కష్టపడ్డానని శ్రీహరి.. తన తల్లి ఆరోగ్యం విషయంలో ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నట్లు చెప్పాడు.

నాలుగేళ్ల కిందట తన తల్లి తీవ్ర అనారోగ్యానికి లోనయ్యారని, ఆస్పత్రికి తీసుకెళ్తే డాక్టర్లు నిర్లక్ష్యంగా వ్యహరించారని చెప్పాడు. దాంతో డబ్బుల కోసం ఫ్రెండ్‌ ద్వారా తొలిసారి స్మగ్లింగ్‌ చేసి వచ్చిన డబ్బులతో తల్లికి ట్రీట్‌మెంట్‌ ఇప్పించినట్లు అంగీకరించాడు. అయితే గతంలో తొలిసారి కేసు నమోదు చేశాక.. ఇప్పుడు తనకేం సంబంధం లేకపోయినా నాలుగేళ్లకు మరో కేసు నమోదు చేశారని ఆందోళనకు గురయ్యాడు. గతంలో తనతో కలిసి పనిచేసిన శ్రీనివాసులురెడ్డి దొరికిపోవడంతో ఏం చేయాలో పాలుపోక తనపేరు చెప్పాడన్నాడు. అయితే గతంలో తనపై నమోదైన తొలికేసు సమయంలో తాను స్మగ్లింగ్‌ చేయడం నిజమే కనుక నిజాయితీగా తాను లొంగిపోయానని.. ఆ కేసులో శిక్ష అనుభవించేందుకు సిద్ధమని తెలిపాడు హరిబాబు

తాను ఎప్పుడో వదిలేసిన ఈ పనికి ప్రస్తుతం తప్పుడు కేసులు బనాయించారని, ఆ కారణంతోనే నాలుగేళ్లు తనపేరు మీడియాకు ఎందుకు చెప్పలేదని ప్రశ్నించాడు. అర్బన్‌ జిల్లాలో ఉన్న ఏ కేసులతోనూ తనకు సంబంధం లేదని, శ్రీనివాసులు రెడ్డి ఓ ఎస్‌ఐతో కలిసి స్లగ్లింగ్‌ చేశాడని వివరించాడు. బెంగళూరులో దుంగలు అమ్మి ఎస్‌ఐ డబ్బులు ఖాతాలో వేసేవాడని, అయితే వాటికి సంబంధించిన రశీదులు శ్రీనివాసులు రెడ్డి వద్ద ఉన్నాయని టాస్క్‌ఫోర్స్‌కు బహిర్గతం చేశాడు. ఉద్దేశపూర్వకంగానే తనపై మరిన్ని తప్పుడు కేసులు బనాయించారని తన ఆవేదనను కమెడియన్‌ వెల్లగక్కాడు.

మరోవైపు ఎర్రచందనం అక్రమ రవాణాతో కోట్లకు పడగలెత్తిన కమెడియన్‌.. సంపాదించిన సొమ్ముతో సినిమాలకు ఫైనాన్స్‌ చేస్తున్నాడని పోలీసులు కేసు నమోదు చేసి గత కొన్ని రోజులుగా హరిబాబు కోసం గాలించారు. ఈ క్రమంలో తిరుపతి టాస్క్‌ ఫోర్స్‌ అధికారుల ఎదుట లొంగిపోయి తన తప్పును ఒప్పుకున్నాడు.

టాస్క్‌ఫోర్స్‌ ఐజీ ఎదుట లొంగిపోయిన టీవీ ఆర్టిస్ట్‌

కమెడియన్‌ కోసం పోలీసుల వేట

మరిన్ని వార్తలు