పోలీసు అమరులకు వందనం..

15 Oct, 2018 11:43 IST|Sakshi
పోలీసు కమిషనరేట్‌లో ముస్తాబైన అమరవీరుల స్థూపం

వరంగల్‌ క్రైం: విధి నిర్వహణలో ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో ఇప్పటి వరకు 64 మంది పోలీసులు అమరులయ్యారు. శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా ప్రాణత్యాగాలు చేసిన వారి కోసం ఏటా పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలను నిర్వహిస్తున్నారు. ఈ మేరకు ఈ నెల 15 నుంచి 21 వరకు నిర్వహించేందుకు వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో పోలీస్‌ అధికారులు ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నారు.

పోలీసుల పని తీరును ప్రజలు, యువత, విద్యార్థులకు తెలియజేసేందుకు ప్రతి పోలీస్‌ స్టేషన్‌లో ఓపెన్‌ హౌస్‌ నిర్వహించనున్నారు. ట్రైసిటీగా పేరుగాంచిన వరంగల్, హన్మకొండ, కాజీపేటలో విద్యార్థుల కోసం పోలీసు కమిషనరేట్‌లోని రాణిరుద్రమ దేవి ప్రాంగణంలో ఓపెన్‌ హౌస్‌కు ఏర్పాట్లు చేశారు. పోలీసులువిధి నిర్వహణలో ఉపయోగించే ఆయుధాలతోపాటు బాంబు డిస్పోజల్, క్లూస్, ఫింగర్‌ ప్రింట్స్, డాగ్‌స్క్వాడ్, కమ్యూనికేషన్‌ విభాగాలకు సంబంధించిన స్టాళ్లను ఏర్పాటు చేయనున్నారు.
 
విద్యార్థులకు ప్రతిభా పోటీలు..
పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా సోమవారం నుంచి 21వ తేదీ వరకు ఉదయం 11 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఓపెన్‌ హౌస్‌ ప్రదర్శన కొనసాగేలా అధికారులు చర్యలు తీసుకున్నారు. అదేవిధంగా విద్యార్థులు, సిబ్బందికి వ్యాసరచన, వక్తృత్వం, చిత్రలేఖన పోటీలు నిర్వహించనున్నారుు. పోటీల్లో మొదటి మూడు స్థానాల్లో నిలిచిన విజేతలకు ఈనెల 21న నిర్వహించే స్మృతి పరేడ్‌లో బహుమతులు అందజేయనున్నారు.

రక్తదాన శిబిరాలు
పోలీసు అమరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా పోలీసు కమిషనరేట్‌ పరిధిలోని డివిజన్‌ కేంద్రాల్లో రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేస్తున్నారు. అదేవిధంగా ఈ నెల 20న సాయంత్రం ఏడు గంటలకు హన్మకొండలోని అశోక జంక్షన్‌ నుంచి కమిషనరేట్‌ కార్యాలయం వరకు కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించనున్నారు. 21న  అమరవీరుల స్థూపం వద్ద స్మృతి పరేడ్‌ నిర్వహించి పోలీసు అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటించడంతో వారోత్సవాలు ముగియనున్నాయి.

విజయవంతం చేయాలి..
శాంతి భద్రతల పరిరక్షణ కోసం ప్రాణ త్యాగాలు చేసిన పోలీసు అమరవీరులను స్మరించుకోవాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపై ఉంది. పోలీస్‌ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసే ఓపెన్‌హౌస్, రక్తదాన శిబిరాలు, ప్రతిభా పోటీల్లో పోలీసు అమరవీరుల కుటుంబ సభ్యులు, అధికారులు, ప్రజలు, విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలి. – డాక్టర్‌ విశ్వనాథ రవీందర్, వరంగల్‌ పోలీసు కమిషనర్‌

మరిన్ని వార్తలు