ఏసీబీ వలలో వాణిజ్య పన్నుల శాఖ అధికారి

8 Dec, 2018 07:42 IST|Sakshi
అసిస్టెంట్‌ కమిషనర్‌ నాగేంద్ర ప్రసాద్‌ను విచారిస్తున్న ఏసీబీ అధికారులు

రూ.50 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన వైనం  

కర్నూలు: వాణిజ్య పన్నుల శాఖ అధికారి అవినీతికి పాల్పడి ఏసీబీ వలలో చిక్కాడు. కర్నూలు సెక్టార్‌–1 అసిస్టెంట్‌ కమిషనర్‌గా పనిచేస్తున్న పి.నాగేంద్ర ప్రసాద్‌..కర్నూలు కొత్తబస్టాండ్‌లోని హోటల్‌ అనుపమ యజమాని వెంకటేశ్వర్లు నుంచి రూ.50 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. వాణిజ్య పన్ను తక్కువగా చెల్లిస్తున్నావంటూ కొంతకాలంగా వెంకటేశ్వర్లును నాగేంద్ర ప్రసాద్‌  బెదిరిస్తూ వచ్చాడు. తాను తనిఖీ చేస్తే ప్రస్తుతం చెల్లిస్తున్న మొత్తానికి రెట్టింపు చెల్లించాల్సి వస్తుందంటూ బెదిరించాడు. తనిఖీకి రాకుండా ఉండాలంటే రూ.లక్ష మామూళ్లు ఇవ్వాలని బేరమాడాడు. చివరకు రూ.50 వేలకు ఇద్దరి మధ్యన ఒప్పందం కుదిరింది. అయితే ఆయన బెదిరింపులు తాళలేక హోటల్‌ యజమాని వెంకటేశ్వర్లు వారం రోజుల క్రితంఏసీబీ అధికారులను సంప్రదించి ఫిర్యాదు చేశాడు.

ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న ఏసీబీ అధికారులు..నాగేంద్ర ప్రసాద్‌ కదలికలపై నిఘా ఉంచారు. శుక్రవారం సాయంత్రం హోటల్‌ యజమాని చేత ఫోన్‌ చేయించి అధికారి మాటలను రికార్డు చేశారు. కర్నూలు నుంచి డోన్‌కు వెళ్లే రహదారిలోని ఇండస్‌ స్కూల్‌ దగ్గర వాణిజ్య పన్నుల శాఖ కార్యాలయం ఉంది. అక్కడి నుంచి మోటార్‌సైకిల్‌లో ఆయనే స్వయంగా హోటల్‌ వద్దకు వెళ్లి రిసెప్షన్‌ కౌంటర్‌లో వెంకటేశ్వర్లు వద్ద రూ.50 వేలు లంచం తీసుకుంటుండగా అప్పటికే మాటు వేసి ఉన్న  ఏసీబీ అధికారులు రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీ జయరామరాజుతో పాటు సీఐలు నాగభూషణం, ఖాదర్‌ బాషా ఆధ్వర్యంలో సిబ్బంది వలపన్ని పట్టుకున్నారు. ఈయన నంద్యాల చెక్‌పోస్టు సమీపంలో ఓ అపార్ట్‌మెంట్‌లో నివాసముంటున్నాడు. ఆయన ఇంట్లో కూడా సీఐలు శ్రీధర్, గౌతమి ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు. వైఎస్సార్‌ జిల్లా ఎలటూరు గ్రామానికి చెందిన నాగేంద్రప్రసాద్‌ 1989లో వాణిజ్య పన్నుల శాఖలో ఏసీటీఓ హోదాలో విధుల్లో చేరాడు. ఈయన అనంతపురం జిల్లాలో ఎక్కువ కాలం పనిచేశాడు. ప్రస్తుతం కర్నూలు సెక్టార్‌–1 అధికారిగా విధులు నిర్వహిస్తున్నాడు. కర్నూలు కొత్తబస్టాండ్‌ నుంచి కోడుమూరు వరకు ఈయన పరిధి. కొత్తబస్టాండ్‌లో వెంకటేశ్వర్లు ఈ ఏడాది జులై నుంచి హోటల్‌ నిర్వహిస్తున్నాడు. 

లంచం అడిగితే సమాచారమివ్వండి... : డీఎస్పీ  
ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు చేసిపెట్టేందుకు ఉద్యోగులు లంచం అడిగితే 94404 46178కు ఫోన్‌ చేసి సమాచారం అందించాలని  డీఎస్పీ జయరామరాజు జిల్లా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఆదాయానికి మించి ఆస్తులు కలిగివున్న వారి సమాచారాన్ని కూడా తెలియజేయాలని, అలాంటి వారి పేర్లు గోప్యంగా ఉంచుతామన్నారు. ప్రజలకు సంబంధించిన పనులను సకాలంలో చేసిపెట్టాల్సిన బాధ్యత అధికారులపై ఉందని, మామూళ్ల కోసం వేధిస్తే తమ కార్యాలయంలో సంప్రదించి సమాచారమివ్వాలని డీఎస్పీ విజ్ఞప్తి చేశారు.

మరిన్ని వార్తలు