ఏసీబీ వలలో కమర్షియల్‌ ట్యాక్స్‌ అధికారి

19 Mar, 2020 10:53 IST|Sakshi
అధికారులకు పట్టుబడిన కమర్షియల్‌ ట్యాక్స్‌ సీనియర్‌ అసిస్టెంట్‌ రాజేంద్రప్రసాద్‌ ,లంచంగా తీసుకున్న సొమ్ము

జీడిపిక్కల వ్యాపారి నుంచి సొమ్ము డిమాండ్‌

రూ.60 వేలు తీసుకుంటూ పట్టుబడిన వైనం  

రాజమహేంద్రవరం క్రైం: నగరంలోని కమర్షియల్‌ ట్యాక్స్‌ కార్యాలయం సీనియర్‌ అసిస్టెంట్‌ ఉండ్రాజపు రాజేంద్ర ప్రసాద్‌ లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. ఏసీబీ డీఎస్పీ పి.రామచంద్రరావు తెలిపిన వివరాల ప్రకారం.. రాజానగరం మండలం కృష్ణపట్నం వద్ద ఉన్న యర్త్‌ గిఫ్ట్‌ కమ్యూలిటీస్‌ ఫ్యాక్టరీ (జీడిపిక్కల ప్రోసెసింగ్‌ ఇండస్ట్రీ) యాజమాని కర్రి రామచంద్రారెడ్డి నుంచి రూ.60 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు దాడి చేశారు. నిందితుడు రాజేంద్రప్రసాద్‌ను  ఏసీబీ డీజీ పి.ఎస్‌.ఆర్‌.ఆంజనేయులు ఆదేశాల మేరకు అదుపులోకి తీసుకున్నారు. రామచంద్రా రెడ్డి మన రాష్ట్రంతో పాటు కేరళ, మహారాష్ట్రలకు జీడిపప్పు ఎగుమతి చేస్తుంటారు. ఎగుమతి చేసిన జీడి పప్పుకు రాష్ట్రంలో 2 శాతం కమర్షియల్‌ ట్యాక్స్‌ చెల్లిస్తారు.

ఇతర రాష్ట్రాలలో 3 శాతం ట్యాక్స్‌ చెల్లిస్తారు. ఇతర రాష్ట్రాలలో చెల్లించిన ట్యాక్స్‌కు సీ ఫారం సమర్పించాల్సి ఉంటుంది. 2016 –17 సంవత్సరాలకు గాను రామచంద్రా రెడ్డి రూ.3 కోట్ల విలువైన జీడిపప్పును ఎగుమతి చేశారు. దీనికి సంబంధించి ఆయన అన్ని ట్యాక్స్‌లు చెల్లించినప్పటికీ మరో రూ.9 లక్షలు చెల్లించాలంటూ గత నెల 7న కమర్షియల్‌ ట్యాక్స్‌ అధికారులు నోటీసులు జారీ చేశారు. తాను అన్ని ట్యాక్స్‌లు చెల్లించానని, మరో సారి పరిశీలించాలంటూ రామచంద్రారెడ్డి అధికారుల నోటీసుకు సమాధానం పంపారు. అయినప్పటికీ రూ.9 లక్షలు చెల్లించాల్సిందే అంటూ అధికారులు అతడిపై ఒత్తిడి తెచ్చారు. నష్టాలు కారణంగా చాలా కాలంగా తాను జీడిపప్పు వ్యాపారం చేయడం మానేశానని రామచంద్రా రెడ్డి చెప్పినా పట్టించుకోకుండా రూ.9 లక్షలు చెల్లించకుండా ఉండాలంటే కమర్షియల్‌ ట్యాక్స్‌ అధికారులకు రూ.2 లక్షల లంచం ఇవ్వాల్సిందేనని డిమాండ్‌ చేశారు. దీనిపై రామచంద్రా రెడ్డి ఏసీబీ అధికారులను ఆశ్రయించారు.

ఏసీబీ అధికారులు ట్రాప్‌ చేసి రూ.60 వేలు ఇచ్చేలా కమర్షియల్‌ ట్యాక్స్‌ అధికారులను ఒప్పించేలా పథకం రచించారు. లంచం సొమ్ము రూ.60 వేలు బుధవారం మధ్యాహ్నం కమర్షియల్‌ ట్యాక్స్‌ కార్యాలయానికి తీసుకువచ్చి ఇస్తానని సీనియర్‌ అసిస్టెంట్‌ రాజేంద్రప్రసాద్‌కు రామచంద్రా రెడ్డి ఫోన్‌ చేసి చెప్పారు. తమ కార్యాలయానికి రావొద్దని, తానే బయటకు వచ్చి తీసుకుంటానని రాజేంద్రప్రసాద్‌ చెప్పారు. కార్యాలయం సమీపంలోని ఐశ్వర్య అపార్ట్‌మెంట్‌ వద్దకు వచ్చి రామచంద్రా రెడ్డి నుంచి రూ.60 వేలు లంచం తీసుకుంటుండగా రాజేంద్ర ప్రసాద్‌ను ఏసీబీ అధికారులు రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. లంచంగా తీసుకున్న నగదుతో పాటు కార్యాలయానికి తీసుకువచ్చి విచారణ చేపట్టారు. 

సీటీఓకూ సంబంధం!
ఈ సంఘటనలో కమర్షియల్‌ ట్యాక్స్‌ ఆఫీసర్‌ ఆర్‌.త్రినాథరావుకు కూడా సంబంధం ఉందని బాధితుడు చెబుతున్నారు. తనకు ఏవిధమైన సంబంధం లేదని సీటీఓ త్రినాథరావు ఏసీబీ అధికారుల విచారణలో చెప్పారు. ఈ సంఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి లంచం తీసుకోవడంలో ఎవరి ప్రమేయం ఉందో గుర్తిస్తామని ఏసీబీ డిఎస్సీ పి.రామచంద్రరావు తెలిపారు. నిందితుడిపై కేసు నమోదు చేసి ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తామన్నారు. ఈ దాడులలో ఏసీబీ సీఐలు వి.పుల్లారావు, పి.వి.జి.తిలక్, సూర్యమోహనరావు, సిబ్బంది పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు