రక్తదానం రమ్మన్నాడు.. కిడ్నీ కొట్టేశాడు

11 Jul, 2018 07:47 IST|Sakshi

మదురై జిల్లాలో దారుణం

అన్నానగర్‌ : రక్తదానం కోసమని బంధువైన యువకుడిని తీసుకెళ్లాడు. అతడికి తెలియకుండానే కిడ్నీని అపహరించి తన కుమారుడికి అమర్చుకున్నాడు. యువకుడు తీవ్ర అస్వస్థతకు గురికావడంతో కిడ్నీ అపహరణ విషయం బయటపడింది. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మోసం వెలుగులోకి వచ్చింది. బాధితుని తల్లి జిల్లా ఎస్పీ మణివన్నన్‌కి సోమవారం ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్న వివరాలు ఇలా ఉన్నాయి.
మదురై జిల్లా ఒత్తకడైకి చెందిన షకీలా కుమారుడు మహ్మద్‌ ఫక్రుద్ధీన్‌ (18) ఫోటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నాడు. మదురై సమీపం కొట్టాంపట్టికి చెందిన సమీప బంధువు రాజా మహమ్మద్‌ 2017 అక్టోబర్‌లో భషీర్‌ అహ్మద్‌ అనే వ్యక్తితో కలిసి ఇంటికి వచ్చాడు.

తన కుమారుడు అజారుద్ధీన్‌కి రక్తందానం చేయాలని కోరి ఫక్రీద్దీన్‌ను ఒక ప్రయివేటు ఆస్పత్రికి తీసుకుని వెళ్ళాడు. ఫక్రుద్దీన్‌ రక్తంలో క్రిములు ఉన్నాయి, చికిత్స చేయాల్సి ఉందని నమ్మబలికి ఒక కాగితంపై సంతకం తీసుకెళ్లాడు. ఫక్రుద్దీన్‌ను నెలరోజులపాటు ఆస్పత్రిలోనే ఉండి ఇంటికి వచ్చిన మహ్మద్‌ ఫక్రుద్ధీన్‌ నడవలేక నీరసించి పోయాడు. అనుమానంతో పరీక్షలు చేయించగా ఫక్రుద్ధీన్‌ కిడ్నీ అపహరణకు గురైనట్లు తెలుసుకున్నారు. రక్తదానం కోసమని చెప్పి కుమారుడిని తీసుకెళ్లిన బంధువు రాజా మహ్మద్, సదరు ప్రయివేటు ఆసుపత్రి నిర్వాహకులను ప్రశ్నించగా బెదిరించారు. కిడ్నీ అపహరణ, బెదిరింపులపై గురించి మేలూరు పోలీసుస్టేషన్‌లో గత ఏడాది ఆఖరులో ఫిర్యాదు చేసినా ఇంతవరకు ఎటువంటి చర్యలు చేపట్టలేదు. తన బంధువు రాజమహ్మద్‌ పోలీసులు అండగా నిలుస్తున్నందున నిందితులపై ఎలాంటి చర్యలు తీసుకోవాలని షకీలా తన ఫిర్యాదులో ఎస్పీని వేడుకున్నారు. ఈ ఫిర్యాదును విచారించి తగిన చర్యలు తీసుకోవాలని మేలూర్‌ డీఎస్పీని ఆదేశించినట్లు ఎస్పీ మీడియాకు తెలిపారు. ఇప్పటికీ న్యాయం జరగకుంటే  హైకోర్టును ఆశ్రయిస్తానని బాధితురాలు మీడియా తెలిపారు. 

మరిన్ని వార్తలు