డిప్యూటీ సీఎం కేఈ తనయుడిపై కోర్టులో ఫిర్యాదు

27 Dec, 2017 19:52 IST|Sakshi

వైఎస్సార్‌సీపీ నేత నారాయణరెడ్డి హత‍్య కేసులో కీలక పరిణామం

హతుడి భార‍్య శ్రీదేవి ఫిర్యాదును స్వీకరించిన డోన్‌ సివిల్‌ కోర్టు

సాక్షి, డోన్‌ టౌన్‌ : అధికారం అడ్డుపెట్టుకొని ఎవరినైనా హత్యచేసి ముద్దాయి కాకుండా తప్పించుకోవచ్చనే డిప్యూటీ సీఎం కేఈ క్రిష్ణమూర్తి తనయుడు కేఈ శ్యాంబాబు ఆటలు ఇకపై సాగవని పత్తికొండ అసెంబ్లీ నియోజకవర్గపు వైఎస్సార్‌సీపీ ఇన్‌చార్జ్, దివంగత చెరుకులపాడు నారాయణరెడ్డి సతీమణి కంగాటి శ్రీదేవి అన్నారు.

గత మే నెలలో తన భర్త నారాయణరెడ్డితో పాటు మరో వ్యక్తిని అతి కిరాతకంగా హత్యచేసిన శ్యాంబాబు అనుచరులు అటు తరువాత పోలీసులపై ఒత్తిడి తెచ్చి చార్జీషీట్‌లో పేర్లు తొలగించుకోవడం పట్ల ఆమె తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశారు. ఆ మేరకు నిందితులుగా కేఈ శ్యాంబాబుతో పాటు ఆస్పరి జెడ్పీటీసీ కప్పెట్రాల బొజ్జమ్మ, అప్పటి వెల్దుర్తి ఎస్‌ఐ నాగతులసీ ప్రసాద్‌లను తన భర్త హత్యకేసులో ముద్దాయిలుగా చేర్చాలని  పేర్కొంటూ బుధవారం కర్నూలు జిల్లా డోన్‌ కోర్టులో శ్రీదేవి ప్రైవేట్‌ ఫిర్యాదు దాఖలుచేశారు. అనంతరం హైకోర్టు న్యాయవాది పొన్నవోలు సుధాకర్‌ రెడ్డి, ఆయన సహాయకులు యుగేందర్‌ రెడ్డి, వైఎస్సార్‌సీపీ నేత చెరుకులపాడు ప్రదీప్‌ రెడ్డితో కలిసి ఆమె విలేకరులతో మాట్లాడారు. 

ఐదు శతాబ్దాల వైరం
తమ కుటుంబంపై డిప్యూటీ సీఎం కేఈ క్రిష్ణమూర్తి కుటుంబం ఐదు శతాబ్దాల నుంచి వైరం పెంచుకొని అనవసరమైన కక్షసాధింపులు చేస్తున్నారని కంగాటి శ్రీదేవి ఆరోపించారు. ఇసుక మాఫియాను  అడ్డుకున్నందుకు తన భర్త నారాయణరెడ్డిని కేఈ శ్యాంబాబు దారుణంగా హత్యచేయించారన్నారు. అధికారాన్ని అడ్డుపెట్టుకొని పోలిసులపై ఒత్తిడి తెస్తూ ఈ జంట హత్యల కేసులో చార్జీ షీటు దాఖలు చేయకుండా అడ్డుకుంటున్నారని ఆమె డిప్యూటీ సీఎంపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ హత్యకేసులో సూత్రదారులు, పాత్రదారులకు శిక్షపడేంత వరకు పోరాడుతూనే ఉంటానని ఆమె గద్గద స్వరంతో స్పష్టంచేశారు. 

న్యాయం కోసమే
నారాయణరెడ్డి హత్యకేసులో ముద్దాయిల పేర్లను చార్జీషీట్‌ నుంచి తొలగించినందునే కోర్టును ఆశ్రయించాల్సి వచ్చిందని ప్రముఖ న్యాయవాది పొన్నవోలు సుధాకర్‌ రెడ్డి తెలిపారు. తమ క‍్లయింట్‌ శ్రీదేవి వర్గీయులు ఇచ్చిన ఫిర్యాదును పరిగణలోకి తీసుకోకుండా పోలిసులు ముద్దాయిల పేర్లను తొలగిస్తే ఉన్నత న్యాయస్థానాన్ని సైతం ఆశ్రయిస్తామన్నారు. చెరుకులపాడు నారాయణరెడ్డి హత్యకేసులో ముద్దాయిలకు శిక్షపడి, శ్రీదేవి కుటుంబానికి న్యాయం జరిగే వరకు వైఎస్సార్‌సీపీ లీగల్‌ సెల్‌ అధ్యక్షునిగా న్యాయస్థానాల్లో తమ పోరాటాన్ని కొనసాగిస్తానని పొన్నవోలు సుధాకర్‌ రెడ్డి స‍్పష‍్టంచేశారు.

వివరాలు తెలపండి
నారాయణరెడ్డితో పాటు మరో వ్యక్తి దారుణహత్యలకు సంబంధించి కేసు నమోదు, తదితర వివరాలను జనవరి 25వ తేదీ లోపు కోర్టుకు తెలపాలని జ్యూడిషియల్‌ ఫస్ట్‌క్లాస్‌ మెజిస్ట్రేట్‌ ఆంజనేయులు కేసు ఇన్వస్టిగేషన్‌ అధికారి అయిన డీఎస్పీ బాబాఫకృద్దీన్‌ను ఆదేశించినట్లు న్యాయవాది పొన్నవోలు సుధాకర్‌ రెడ్డి తెలిపారు. 

మరిన్ని వార్తలు