ఎస్‌ఐ జగదీష్‌ సాక్షులను బెదిరిస్తున్నారు

7 Jul, 2020 12:53 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

అసత్య ప్రసారాలు చేసిన టీవీ చానల్‌పై చర్యలు తీసుకోవాలి

ప్రణవ్‌ ఎస్‌ఐకు పుట్టిన వాడే.. డీఎన్‌ఏ పరీక్షకు నేను సిద్ధం

రూరల్‌ ఎస్పీకి ఫిర్యాదు చేసిన బాధిత యువతి

గుంటూరు: ఎస్‌ఐ ఎస్‌.జగదీష్‌పై నమోదైన కేసులో సాక్షులను బెదిరిస్తున్నాడంటూ నరసరావుపేట మండలం రావిపాడు గ్రామానికి చెందిన ఓ యువతి సోమవారం రూరల్‌ ఎస్పీ విశాల్‌ గున్నీకి ఫిర్యాదు చేసింది. ముప్పాళ్ళ ఎస్‌ఐగా విధులు నిర్వహిస్తున్న జగదీష్‌ తనను పెళ్లి చేసుకుంటానని మోసం చేసి శారీరకంగా అనుభవించి ఓ బిడ్డకు తల్లిని చేశాడని నరసరావుపేట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో ఈ నెల 2వ తేదీన కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎస్పీని కలసి తనకు, సాక్షులకు రక్షణకల్పించాలని కోరింది.  ‘ఎస్‌ఐపై కేసు నమోదైనప్పటి నుంచి సాక్షులుగా ఉన్న వారికి ఫోన్‌ చేసి మీరు ఈ కేసులో సాక్ష్యం చెబితే మీ అంతు చూస్తానని హెచ్చరిస్తున్నాడు.

ఓ టీవీ చానల్‌లో (సాక్షి కాదు) నా గురించి అసత్యాలతో కూడిన వీడియోలను చూపించి అసభ్యకరంగా ప్రదర్శించారు. నా మాజీ భర్త పి.సుబ్బారావును సాకుగా చూపి నా మనోభావాలను దెబ్బతీసేలా టీవీలో కథనం వచ్చింది. వారిపై కూడా విచారించి చర్యలు తీసుకోవాలి. ముఖ్యంగా నా బిడ్డ ప్రణవ్‌ ఎస్‌ఐ జగదీష్‌కు పుట్టిన బిడ్డే కావాలంటే డీఎన్‌ఏ పరీక్షకు నేను, నాబిడ్డ సిద్ధంగా ఉన్నాం. తమకు ప్రాణరక్షణ కల్పించి ఆదుకోవాలి’ అని కోరింది. కాగా, వీడియో కాన్పరెన్స్‌ ద్వారా విచారించిన ఎస్పీ ఫిర్యాదుపై విచారణ చేపడతామని స్పష్టం చేశారు. ఎస్‌ఐపై ప్రస్తుతం శాఖాపరమైన విచారణ కొనసాగుతుందని  ఎస్పీ విశాల్‌ గున్నీ వివరించారు.

మరిన్ని వార్తలు