ఒకే రోజు.. ‘31’  ఫిర్యాదులు

18 Feb, 2020 04:09 IST|Sakshi

సైబర్‌ ఠాణాకు వచ్చిన బాధితులు

వీళ్లు పోగొట్టుకున్న మొత్తం.. రూ. 10.07 లక్షలు

బాధితుల్లో 29 మంది అక్షరాస్యులు, ఇద్దరే నిరక్షరాస్యులు

సాక్షి, హైదరాబాద్‌ : హైదరాబాద్‌ సిటీ సైబర్‌ క్రైమ్‌ స్టేషన్‌కు సోమవారం ఒక్క రోజే వేర్వేరు ఫిర్యాదులతో 31 మంది బాధితులు వచ్చారు. వీరు పోగొట్టుకున్న మొత్తం రూ.10.07 లక్షలు. అత్యధికులు ఓటీపీ క్రైమ్‌లోనే బాధితులుగా మారగా... ఆ తర్వాతి స్థానం ఓఎల్‌ఎక్స్‌ బారినపడిన వాళ్లున్నారు. అధికారుల మాదిరిగా ఫోన్‌ చేసి బ్యాంకు ఖాతాలు, క్రెడిట్‌ కార్డులకు చెందిన వివరాలతో పాటు ఓటీపీ సైతం సంగ్రహించి ఖాతా ఖాళీ చేయడంలో జార్ఖండ్‌లోని జామ్‌తారతో పాటు ఆ చుట్టుపక్కల ప్రాంతాలకు చెం దిన వారు దిట్టలు. సోమవారం సైబర్‌ క్రైమ్‌ ఠాణాను ఆశ్రయించిన వారిలో 10 మంది ఈ తరహా నేరాల బారిన పడ్డ వారే. ఈ తరహా నేరాల్లో నష్టపోయిన వాళ్లు తొలుత బ్యాంకులకు, తర్వాత సైబర్‌ క్రైమ్‌ ఠాణాను సంప్రదిస్తున్నారు.

ఈ తరహా కేసుల్లో రెండుమూడు నెలల ఆలస్యంగా పోలీసులకు ఫిర్యాదు చేస్తున్న బాధితులు ఉంటున్నారు. ఓటీపీ నేరాల తర్వాతి స్థానంలో యాడ్స్‌ యాప్స్‌ ద్వారా చేసేవి ఉంటున్నాయి. ఓఎల్‌ఎక్స్, క్వికర్‌తో పాటు ఫేస్‌బుక్‌లోనూ కొందరు యాడ్స్‌ పోస్టు చేస్తున్నారు. తక్కువ ధరకు వాహనాలు, వస్తువుల పేరు చెప్పి, తాము ఆర్మీ అధికారులమంటూ నమ్మిస్తున్నారు. ఆపై అడ్వాన్సుల రూపంలో అందినకాడికి దండుకుంటున్నారు. ఇలాంటి యాడ్స్‌ యాప్స్‌లో వస్తువులు అమ్ముతామంటూ ఎవరైనా యాడ్స్‌ పోస్టు చేసినా దాన్ని సైబర్‌ నేరగాళ్లు తమకు అనువుగా మార్చుకుంటున్నారు. వాటిని తాము ఖరీదు చేస్తామని చెప్తున్న కేటుగాళ్లు నగదు చెల్లిస్తున్నామంటూ క్యూఆర్‌ కోడ్స్‌ పంపిస్తున్నారు. వీటిని క్లిక్‌ చేస్తున్న బాధితులు ముందు వెనుక ఆలోచించకుండా ‘ప్రొసీడ్‌ టు పే’అనేది ఓకే చేయడంతో డబ్బు వచ్చేమాట అటుంచితే వీరి నుంచే ఎదుటి వారికి చేరిపోతోంది. సోమవారం వచ్చిన బాధితుల్లో 9 మంది ఓఎల్‌ఎక్స్‌ తరహా మోసాల్లో నష్టపోయిన వారే. 

ఇంకా మాట్లాడుతున్నారంటూ...
ఈ తరహా మోసాల్లో నష్టపోయిన బాధితులు సైబర్‌ క్రైమ్‌ పోలీసుల వద్దకు వచ్చి.. తమతో ఫోన్లలో మాట్లాడి, వాట్సాప్‌లో ఫొటోలు పంపి, డబ్బు గుంజిన వ్యక్తి ఇంకా వాట్సాప్‌లో యాక్టివ్‌గా ఉన్నాడని, ఫోన్‌ పని చేస్తోందని చెప్తూ... దాని ద్వారా లోకేషన్‌ కనిపెట్టమంటూ పోలీసులకే సలహాలు ఇస్తున్నారు. ఈ తరహా నేరగాళ్లు ఉండేది ఉత్తరభారత్‌లో.. ఏదైనా ఓ కేసులో దర్యాప్తు, నిందితుల అరెస్టు కోసం పోలీసులు రాష్ట్ర సరిహద్దులు దాటాలంటే దానికి పెద్ద ప్రహసనమే ఉంటుంది. ఫిర్యాదు అందుకున్న తర్వాత కేసు నమోదు చేసి, ఆధారాలు సేకరించి ఆపై ఉన్నతాధికారుల నుంచి రాష్ట్రం దాటి వెళ్లడానికి అనుమతి తీసుకోవాలి. ఇన్నీ చేసి వెళ్లినా ఇలాంటి నేరగాళ్లు తప్పుడు వివరాలతో తీసుకున్న సిమ్‌కార్డులు, బ్యాంకు ఖాతాలు వాడుతుండటంతో పట్టుకోవడం కష్టమవుతోంది. ఇదే విషయాన్ని బాధితులకు చెబితే.. అధికారులు తమ కేసును పట్టించుకోలేదనే భావనలో ఉంటున్నారు. 

కేవైసీ ఆప్‌డేట్‌ అంటూ లింకులు...
సైబర్‌ క్రైమ్‌ పోలీసుల వద్దకు వచ్చిన బాధితుల్లో లింకులు క్లిక్‌ చేసిన వాళ్లూ ఉన్నారు. పేటీఎం సహా వివిధ పేమెంట్‌ యాప్స్‌ ప్రతినిధులమంటూ సైబర్‌ నేరగాళ్లు ఫోన్లు చేశారు. ఆపై కేవైసీ అప్‌డేట్‌ చేసుకోవాలని కోరుతూ ఓ లింకును పంపించారు. దాన్ని క్లిక్‌ చేసిన వెంటనే టీమ్‌వ్యూవర్‌ తరహా యాప్స్‌ వారి ఫోన్లలో ఇన్‌స్టల్‌ అయిపోతున్నాయి. ఆపై వీరి ఫోన్‌ స్క్రీన్‌ను సైబర్‌ నేరగాళ్లు తమ ఆధీనంలోకి తీసుకుని నగదు కాజేస్తున్నారు. ఇప్పటికీ కోకకోలా లాటరీ, సామ్‌సంగ్‌ లాటరీ పేరుతో ఫోన్లు రావడం, వాటిని నమ్మి మోసపోవడం జరుగుతోంది. సోమవారం రూ.98 వేలు మోసపోయిన ఇద్దరు బాధితులు సిటీ సైబర్‌ క్రైమ్‌ ఠాణాలో ఫిర్యాదు చేశారు. అసలు ఐటీ యాక్ట్‌ పరిధిలోకి రాని కేసులు, స్థానిక పోలీస్‌స్టేషన్‌కు వెళ్లాల్సిన ఫిర్యాదులు, బయటి ప్రాంతాలకు చెందిన బాధితులు సైతం సిటీ సైబర్‌ క్రైమ్‌ ఠాణాలో ఫిర్యాదు చేస్తున్నారు. ఐటీ యాక్ట్‌ పరిధిలోకి రాని, అసలు సైబర్‌ నేరమే కాని కేసుల్ని నమోదు చేసే అధికారం సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఉండదు. ఈ విషయం బాధితులకు అర్థమయ్యేట్లు చెప్పడం, వారిని కన్వెన్స్‌ చేయడం అధికారులకు కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతోంది. 

బండి ఒకరిది... బాధితుడు ఒకరు...
నగరానికి చెందని ఓ యువకుడు తన ద్విచక్ర వాహనాన్ని రూ.18 వేలకు విక్రయించాలని భావించాడు. ఇదే విషయాన్ని ఓఎల్‌ఎక్స్‌ యాడ్స్‌ యాప్‌లో పోస్టు చేశాడు. దీనికి స్పందించిన మరో వ్యక్తి ఆ వాహనం ఖరీదు చేయడానికి సిద్ధంగా ఉన్నానంటూ చెప్పాడు. అడ్వాన్స్‌గా కొంత మొత్తం చెల్లించాలంటూ బాధితుడు కోరాడు. దానికి అంగీకరించిన సైబర్‌ నేరగాడు గూగుల్‌ పే ద్వారా డబ్బు పంపుతానని చెప్పాడు. తన ఫోన్‌కు అలాంటి సౌకర్యాలు లేవని చెప్పిన బాధిత యువకుడు తన స్నేహితుడిని నంబర్‌ ఇచ్చాడు. దానికి లింకు పంపిన సైబర్‌ నేరగాడు రూ.17 వేలు చెల్లిస్తున్నానంటూ క్లిక్‌ చేయమన్నాడు. అలా చేసిన మరుక్షణం ఇతడి ఖాతా నుంచి రూ.17 వేలు నేరగాడికి వెళ్లిపోయాయి. ఈ విషయంపై యాడ్‌ పోస్టు చేసిన వ్యక్తి సైబర్‌ నేరగాడికి ఫోన్‌ చేసి ప్రశ్నించాడు. దీంతో ఆ పొరపాటు సరిదిద్దుకోవడానికి నీ స్నేహితుడికి మరో లింకులో డబ్బు పంపిస్తున్నానని చెప్పాడు. మరో లింకు పంపించి, క్లిక్‌ చేయించి మరో రూ.17 వేలు కాజేశాడు. 

యువకులే అత్యధికులు...
సైబర్‌ నేరాలబారిన పడుతున్న వారిలో విద్యాధికులు, యువకులే ఎక్కువగా ఉంటున్నారు. సోమవారం సిటీ సైబర్‌ క్రైమ్‌ ఠాణాను ఆశ్రయించిన 31 మందిలో 29 మంది పురుషులే. వీరిలోనూ 25 మంది యువకులు.. విద్యాధికులే. ‘సైబర్‌ నేరాల్లో మోసపోవడం ఎంత తేలికో... నిందితుల్ని పట్టుకోవడం, రికవరీ చేయడం అంత కష్టం. దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరూ ఆర్థిక లావాదేవీల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ఎవరైనా సైబర్‌ నేరాల్లో బాధితులుగా మారితే.. గరిష్టంగా 24 గంటల్లోపు ఫిర్యాదు చేస్తే ఫలితం ఉంటుంది’అని సిటీ సైబర్‌ క్రైమ్‌ ఏసీపీ కేవీఎం ప్రసాద్‌ తెలిపారు.

మరిన్ని వార్తలు