చీకుల దుకాణం వద్ద వివాదం..యువకుల హత్య

31 May, 2018 08:12 IST|Sakshi
కాకినాడ జగన్నాథపురం ఏటిమొగ అశ్విన్‌ బార్‌ అండ్‌ రెస్టారెంట్‌ వద్ద గుమిగూడిన ప్రజలు

ఇద్దరు యువకుల హత్య

కాకినాడ జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్న మరో వ్యక్తి   

కాకినాడ రూరల్‌: మాంసం చీకుల కొట్టు వద్ద వివాదం ఇద్దరు ప్రాణాలను బలిగొంది. కాకినాడ ఏటిమొగ వెళ్లే ప్రధాన రోడ్డులో ఉన్న అశ్విని బార్‌అండ్‌ రెస్టారెంట్‌లో మద్యం సేవిస్తున్న ముగ్గురు యువకులపై ఓ వ్యక్తి కత్తితో దాడి చేయడంతో ఇద్దరు వ్యక్తులు మృతి చెందగా.. మరో వ్యక్తి చావుబతుకుల మధ్య కాకినాడ జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనలో ఏటిమొగకు చెందిన వనమాడి రాజు(30), పంతాడి దుర్గాప్రసాద్‌ అలియాస్‌ తులసి(35)మృతి చెందగా, చెక్కా రాజేష్‌ తీవ్రగాయాలతో కాకినాడ జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్నాడు. పోలీసుల కథనం ప్రకారం.. ఏటిమొగకు వెళ్లే దారిలోని మూలారమ్మ(ధనమ్మ) గుడి సమీపంలో ఉన్న అశ్విని బార్‌ అండ్‌ రెస్టారెంట్‌ సమీపంలో ఉన్న బిర్యానీ షాపులో మాంసం చీకుల కోసం మంగళవారం రాత్రి పంతాడి నూకరాజు వెళ్లి రూ.50 పెట్టి చీకులు కొనుక్కున్నాడు. మరికొన్ని చీకులు పెట్టాలని షాపు యజమానిని అడిగాడు. అతను పెట్టలేదు. దీంతో అనుమతి లేకుండా చేత్తో తీసుకొని తినేశాడు.

దీంతో దుకాణం యజమానికి పంతాడి నూకరాజుకి ఘర్షణ జరిగింది. అనంతరం ఎవరికి వారు ఇంటికి వెళ్లిపోయారు. చీకుల వ్యాపారం చేస్తున్న వ్యక్తి వనమాడి రాజుకు బంధువు కావడంతో బుధవారం మధ్యాహ్న సమయంలో పంతాడి నూకరాజును వనమాడి రాజు రాత్రి గొడవ విషయం అడిగాడు. ఆ సమయంలో ఇరువురు మధ్య వివాదం చోటు చేసుకుంది. వనమాడి రాజు తన స్నేహితులైన పంతాడి దుర్గాప్రసాద్, చెక్కా రాజేష్‌తో కలసి వచ్చి మద్యం షాపులో మద్యం సేవిస్తుండగా నూకరాజు పొడవాటి బాకులాంటి కత్తిని తీసుకొచ్చి వనమాడి నూకరాజును విచక్షణారహితంగా పొడవడంతో అతడు అక్కడికక్కడే  చనిపోయాడు.

రాజును కత్తితో పొడుస్తున్న సమయంలో నూకరాజును అడ్డుకునే ప్రయత్నం చేయడంతో అప్పటికే విచక్షణ కోల్పోయిన నూకరాజు పంతాడి దుర్గాప్రసాద్, చెక్కా రాజేష్‌లపైనా కత్తితో దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన ఇరువురిని 108 అంబులెన్స్‌లో జీజీహెచ్‌కు తరలిస్తుండగా మార్గమధ్యలో పంతాడి దుర్గాప్రసాద్‌ మృతి చెందాడు. చెక్కా రాజేష్‌ చావుబతుకుల మధ్య జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్నాడు. ఇరువురు వ్యక్తులను హత్య చేసి, మరో వ్యక్తి తీవ్ర గాయాలకు కారణమైన పంతాడి నూకరాజును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటనపై పోర్టు పోలీస్‌స్టేషన్‌ సీఐ రాజశేఖరరావు పర్యవేక్షణలో ఎస్సై సతీష్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నూకరాజు, దుర్గాప్రసాద్‌లు మృతి చెందడంతో ఏటిమొగ ప్రాంతంలో అల్లర్లు జరిగే అవకాశం ఉండడంతో పోలీసులు ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు. రాజు, దుర్గాప్రసాద్‌ల మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం
కాకినాడ జీజీహెచ్‌కు తరలించారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా