భగ్గుమన్న పాతకక్షలు!

17 Jan, 2019 08:36 IST|Sakshi
కలిగాంలో ప్రత్యేక పోలీస్‌ బలగాలకు సూచనలు చేస్తున్న సీఐ నాగేశ్వరరావు

కలిగాంలోఇరువర్గాలమధ్యకొట్లాట

13 మందికి గాయాలు ఒకరి పరిస్థితి విషమం

శ్రీకాకుళం, కొత్తూరు: కలిగాం గ్రామం భగ్గుమంది. మాజీ సర్పంచ్‌ గోవిందరావు, కూన అర్జునలకు చెందిన రెండు వర్గాల మధ్య కొన్నేళ్లుగా గొడవులున్నాయి. తరచూ ఒకరిపై ఒకరు దాడులకు దిగుతూ కక్షసాధింపు చర్యలకు పాల్పడుతుండేవారని పోలీసులు తెలిపారు. ఈ క్రమంలోనే  బుధవారం కూడా భోగి మంట వద్ద  ఉన్న సందర్భంలో ఒకరిపై ఒకరు కత్తులు, కర్రలు, రాళ్లతో దాడులకు తెగబడినట్టు చెప్పారు. కొనమాపల్లి గోవిందరావుకు చెందిన వర్గంపై కూన అర్జున, సింహాచలం, తమ్మినాయుడు తదితరులు దాడి చేసి తీవ్రంగా గాయపరిచినట్లు గోవిందరావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గోవిందరావు గృహంపై కూడా ప్రత్యర్థులు దాడి చేయడంతో ఇంటి ఆవరణ రాళ్లతో నిండిపోయింది.

ముందేవేసుకున్న ప్రణాళిక ప్రకారమే తమవర్గంపై ప్రత్యర్థులు దాడికి పాల్పడ్డారని గోవిందరావు తన ఫిర్యాదులో పేర్కొన్నట్టు పోలీసులు చెప్పారు. కొట్లాటలో గోవిందరావు వర్గానికి చెందిన చిరుగుపిల్లి అప్పన్నకు తీవ్ర గాయాలు కావడంతో అతన్ని  శ్రీకాకుళంలోని కిమ్స్‌ ఆస్పత్రికి  తరలించారు. ఈ ఘటనలో గోవిందరావు వర్గానికి చెందిన చిగురుపల్లి శ్యామలరావు, రమేష్, కొమనాపల్లి గోవిందరావు, ఉమామేశ్వరరావు, లక్ష్మీనారాయణ, వబంరవిల్లి నూకరాజు, వసిడి ఏడుకొండలు, కె.వెంకటరావులకు గాయాలయ్యాయి. ఇది ఇలా ఉండగా కూన అర్జున వర్గానికి చెందిన మామిడి తమ్మినాయుడుపై కొమనాపల్లి గోవిందరావు, అప్పన్న తదితరులు దాడి చేసినట్లు తమ్మినాయుడు ఫిర్యాదు చేశారు. దాడిలో తమ్మినాయుడు, ఎన్ని వాసుదేవరావు, మామిడి నిర్మలతో పాటు పలువురికి గాయాలయ్యాయి. ఇరువర్గాలు వారు వేర్వేరుగా ఇచ్చినఫిర్యాదు మేరకు పలువురిపై కేసు నమోదు చేసినట్లు కొత్తూరు ఎస్సై వై.రవికుమార్‌ తెలిపారు. కాగా కలిగాంలో ఇరువర్గాలు కొట్లాటకు దిగినట్టు సమాచారం అందడంతో సీఐ నాగేశ్వరావు ఆధ్వర్యంలో సిబ్బంది సకాలంలో సంఘటన స్థలానికి చేరుకొని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.

లేదంటే పరిస్థితి చేయిదాటిపోయేది. ఇది ఇలా ఉండగా ఏడాది క్రితం కూడా   ఈ రెండు వర్గాల మధ్య కొట్లాట జరిగింది. దీంతో రెండు నెలలపాటు గ్రామంలో పోలీస్‌ పికెట్‌ నిర్వహించారు. తాజా పరిణామాల నేపథ్యంలో ముందజాగ్రత్తల్లో భాగంగా ప్రత్యేక బలగాలతో గ్రామంలో పికెట్‌ నిర్వహిస్తున్నట్టు సీఐ నాగేశ్వరరావు తెలిపారు.

మరిన్ని వార్తలు