లాఠీఛార్జ్‌లో ఎమ్మెల్యే అభ్యర్థికి గాయాలు!

23 Feb, 2018 15:43 IST|Sakshi

సాక్షి, భోపాల్: పోలీసుల లాఠీఛార్జ్‌లో తమ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గాయపడ్డారని అందుకు బీజేపీనే కారణమని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. మధ్యప్రదేశ్‌లోని కొలారస్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఫిబ్రవరి 24న ఉప ఎన్నిక జరగనున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తమ పార్టీ అభ్యర్థి తరపున బీజేపీ ఎమ్మెల్యే నరేంద్ర సింగ్ కుశ్వాహ ప్రచారం ముగించుకుని వెళ్తుండగా గురువారం సాయంత్రం 5గంటలకు కాంగ్రెస్ కార్యకర్తలు ఎస్‌యూవీ కారును అడ్డుకున్నారు.

కారులో డబ్బు, ఇతరత్రా ఏమైనా ఉన్నాయో చెక్ చేయాలంటూ పోలీసులను కాంగ్రెస్ కార్తకర్తలు పట్టుబట్టారు. కుశ్వాహ డ్రైవర్ వేగం పెంచి కారును అక్కడినుంచి తీసుకెళ్లారని కాంగ్రెస్ అధికార ప్రతినిధి పంకజ్ చతుర్వేది తెలిపారు. అదేసమయంలో తీవ్ర ఆవేశానికి లోనైన తమ పార్టీ కార్తకర్తలు బీజేపీ ఎమ్మెల్యే కారుపై రాళ్లు రువ్వగ పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. విషయం తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి  మహేంద్ర సింగ్ యాదవ్ తమ కార్తకర్తలను కలుసుకునేందుకు లాఠీఛార్జ్ జరిగే ప్రదేశానికి వెళ్లగా ఆయనపై కూడా పోలీసులు లాఠీ పవర్ చూపించారని పంకజ్ చతుర్వేది చెప్పారు. లాఠీఛార్జ్‌లో ఎమ్మెల్యే అభ్యర్థి మహేంద్రకు గాయాలుకాగా, చికిత్స కోసం స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లినట్లు వివరించారు. 

మరోవైపు బీజేపీ ఎమ్మెల్యే కుశ్వాహ కాంగ్రెస్ కార్తకర్తలపై ఫిర్యాదు చేశారు. తనను అడ్డగించిన కార్తకర్తలు, రాళ్లతో తన వాహనంపై దాడి చేసి ధ్వంసం చేశారని కుశ్వాహ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎస్పీ, అసిస్టెంట్ కలెక్టర్ కేసు దర్యాప్తు చేస్తున్నారని కలెక్టర్ తరుణ్ రాటీ తెలిపారు. కాంగ్రెస్ సీనియర్ నేతలు కమల్ నాథ్, జ్యోతిరాదిత్య సింధియాలు ఢిల్లీలోని ఎన్నికల కమిషన్ లో లాఠీఛార్జ్‌పై ఫిర్యాదు చేశారు. 
 

మరిన్ని వార్తలు