కంటతడి పెట్టిన కంచర్ల దంపతులు

25 Nov, 2018 08:58 IST|Sakshi
కన్నీటిపర్యంతమవుతున్న కంచర్ల దంపతులు

నల్లగొండ రూరల్‌ : కాంగ్రెస్‌ ఓటమి భయంతోనే దాడులకు దిగుతోందని రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్‌ బండ నరేం దర్‌రెడ్డి ఆరోపించారు. టీఆర్‌ఎస్‌ నల్లగొండ ఎమ్మె ల్యే అభ్యర్థి కంచర్ల భూ పాల్‌రెడ్డిని గెలిపిం చాలని కోరుతూ ఆయ న సతీమణి రమాదేవి ఎస్‌ఎల్‌బీసీలో ప్రచారం నిర్వహిస్తుండగా కాంగ్రెస్‌ కార్యకర్తలు టీఆర్‌ఎస్‌ ప్రచార రథం ఫ్లెక్సీలను చించివేసి, డ్రైవర్‌పై దాడి చేశారని ఆరోపిస్తూ ఆ పార్టీ శ్రేణులు శనివారం స్థానిక క్లాక్‌టవర్‌ సెంటర్‌లో నిరసనకు దిగారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఓటమి ఖాయమని తేలిపోవడంతోనే ఆ పార్టీ కార్యకర్తలు రెచ్చగొట్టేందుకు కుట్ర పన్నుతున్నారని, గులాబీ శ్రేణులు శాంతి యుతంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. అభివృద్ధి సంక్షేమ పథకాలే టీఆర్‌ఎస్‌ను గెలిపిస్తాయన్నారు. నల్లగొండలో గులాబీ జెండా ఎగరడం ఖాయమన్నారు.

లక్ష చేతులతో ఓడిస్తా : కంచర్ల
కోమటిరెడ్డి దగ్గరుండి కార్యకర్తలతో భౌతిక దాడులు చేయిం చడం దుర్మార్గమైన చర్యని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే అభ్యర్థి కంచర్ల భూపాల్‌రెడ్డి అన్నారు. ఆటోడ్రైవర్‌పై దాడి చేయడం, ప్రచార రథం ఫ్లెక్సీని చించి తనను ఉద్దేశించి అవహేళనగా మాట్లాడడం సరికాదన్నారు. తన అవిటితనాన్ని ఉద్దేశించి అవహేళన వ్యాఖ్యలు చేసిన కోమటిరెడ్డిని వచ్చే ఎన్నికల్లో లక్ష చేతులతో ఓడించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు.  కాంగ్రెస్‌ కార్యకర్తలు తనపై చేసిన అవహేళన వ్యాఖ్యలు ఎంతో బాధిస్తున్నాయని గద్గదస్వరంతో అంటూ కాన్నీరు కార్చడంతో  ఆయన సతీమణి, కూతురు కూడా కంటతడిపెట్టారు.
 
సాగర్‌ రోడ్డులో రమాదేవి నిరసన..

కాంగ్రెస్‌ కార్యకర్తలు టీఆర్‌ఎస్‌ ప్రచారరథంపై ఉన్న ఫ్లెక్సీలను చించి, డ్రైవర్‌పై దాడి చేశారని ఆరోపిస్తూ కంచర్ల సతీమణి రమాదేవి  చర్లగౌరారం స్టేజ్‌ వద్ద నిరసనకు దిగారు.
 
కాంగ్రెస్‌ కార్యకర్తలపై ఎస్పీకి ఫిర్యాదు

నల్లగొండ క్రైం : కాంగ్రెస్‌ కార్యకర్తలు టీఆర్‌ఎస్‌ ప్రచార రథం ఫ్లెక్సీల తొలగింపు, డ్రైవర్‌పై దాడి, మహిళ కౌన్సిలర్లను అవమానించారని ఆరోపిస్తూ ఆ పార్టీ ఉమ్మడి నల్లగొండ జిల్లా అధ్యక్షుడు బండా నరేందర్‌రెడ్డి, పార్టీ ఎన్నికల పరిశీలకులు రవీందర్‌రావు, మాజీ మున్సిపల్‌ చైర్మెన్‌ బోయపల్లి కృష్ణారెడ్డి, నిరంజన్‌వలీ ఎస్పీకి ఫిర్యాదు చేశారు.  ఎస్‌ఎల్‌బీసీలో జరిగిన దాడి ఘటనపై టీఆర్‌ఎస్‌ నాయకుడు రామ రాజు యాదవ్‌  రూరల్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు నర్సింగ్‌శ్రీనివాస్, డబ్బ వెంకన్న.చింతల విజయ్, మంగలి శ్రీను, కడారి వెంకన్న, నల్లబొతు శంకర్, మరికొందరిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై మురళి తెలిపారు.

మరిన్ని వార్తలు